Begin typing your search above and press return to search.

వినాయక చవితికి అలా... దసరాకు ఇలా.. అర్థం కాని జగన్

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Political Desk   |   30 Sept 2025 3:39 PM IST
వినాయక చవితికి అలా... దసరాకు ఇలా.. అర్థం కాని జగన్
X

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. దసరా ఉత్సవాలు సందర్భంగా ఆయన ఎక్కడా కనిపించకపోవడంపై అధికార కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గత నెలలో జరిగిన వినాయక చవితి పండుగకు తాడేపల్లిలోని తన నివాసంలో ప్రత్యేకంగా పందిరి వేసి పూజలు చేసిన మాజీ సీఎం జగన్.. దసరా వచ్చేసరికి ముఖం చాటేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లికి సమీపంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భారీ ఎత్తున దసరా ఉత్సవాలు జరుగుతున్నా, మాజీ సీఎం జగన్ రాకపోవడంపైనా చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెలలో కొన్ని రోజులు తాడేపల్లి, మరికొన్ని రోజులు బెంగళూరులో ఉంటున్న మాజీ సీఎం జగన్.. దసరా నవరాత్రి ఉత్సవాలకు దూరంగా ఉండటం విమర్శలకు తావిస్తోందని అంటున్నారు. సెప్టెంబరు 18 నుంచి జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరుకాని జగన్మోహనరెడ్డి.. అదే సమయంలో ఒక సారి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత 24న పార్టీ నేతల సమావేశం నిర్వహించి ‘డిజిటల్ బుక్’ను ప్రకటించారు. అయితే అప్పటికే ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమైనా మాజీ సీఎం దుర్గమ్మను దర్శించుకోలేదని గుర్తు చేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో దసరా ముగుస్తుందనగా, జగన్మోహనరెడ్డి అమ్మవారిని దర్శించుకోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వినాయక చవితికి పండుగ నాడు ఎలా పూజా కార్యక్రమాలు నిర్వహించారో.. ఇప్పుడు కూడా దసరా రోజు ఆయన పూజల్లో పాల్గొంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే జగన్ తాడేపల్లిలోనే ఈ పూజలు చేస్తారా? లేక విజయవాడ దుర్గ గుడికి వస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. హిందూ సంప్రదాయ పండుగల సమయంలో మాజీ సీఎం జగన్ వ్యవహారశైలిపై ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. ఆయన పూజించే విధానం దగ్గర నుంచి ఇతర అంశాల వరకు రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంటారు.

జగన్ అధికారంలో ఉండగా, సంక్రాంతికి తాడేపల్లి నివాసంలో వెంకటేశ్వరస్వామి గుడి సెట్ వేయడాన్ని తప్పు పడుతూ పెద్ద ఎత్తున వైరల్ చేశారు. ఇక అధికారం కోల్పోయి విపక్షంలోకి వచ్చినా, పండుగల విషయంలో జగన్ ను టీడీపీ, జనసేన సోషల్ మీడియా టార్గెట్ చేయడాన్ని విస్మరించడం లేదు. దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడం, మాజీ సీఎం జగన్ ఎక్కడా కనిపించకపోవడాన్ని గుర్తుచేస్తూ మళ్లీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. కొందరు యూట్యాబర్లు ఈ విషయాన్ని ఎత్తిచూపుతూ వీడియోలు చేయడం కూడా జగన్ రాజకీయ ప్రత్యర్థుల పనిగా అనుమానిస్తున్నారు. ఏదిఏమైనా దసరా సందర్భంగా మరోసారి విపక్ష నేత జగన్ పూజలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.