Begin typing your search above and press return to search.

పాదయాత్రకు ముందే ఆమె ఎంట్రీ...జగన్ మాస్టర్ ప్లాన్ ?

వైసీపీ అధినేత బెంగళూరులో ఉన్నారు కానీ ఆయన ఆలోచనలు అన్నీ ఏపీలో భవిష్యత్తు రాజకీయాల మీద సీరియస్ గా సాగుతున్నాయని అంటున్నారు.

By:  Satya P   |   2 Jan 2026 11:47 PM IST
పాదయాత్రకు ముందే ఆమె ఎంట్రీ...జగన్ మాస్టర్ ప్లాన్ ?
X

వైసీపీ అధినేత బెంగళూరులో ఉన్నారు కానీ ఆయన ఆలోచనలు అన్నీ ఏపీలో భవిష్యత్తు రాజకీయాల మీద సీరియస్ గా సాగుతున్నాయని అంటున్నారు. ఒక వైపు పార్టీని పటిష్టం చేసుకోవడం, ఇంకో వైపు అధికార కూటమి జోరుని తట్టుకుని వైసీపీని నైతికంగా నిలబెట్టడం, రానున్న మూడేళ్ళలో వచ్చే ఎన్నికల కోసం వ్యూహ రచన చేయడం ఇలా జగన్ అనేక విధాలుగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. కొత్త ఏడాదిగా 2026 వచ్చేసింది. జగన్ ఈ ఏడాది జనంలోకి రావాలని చూస్తున్నారు. జిల్లాల టూర్లకు ఆయన ప్లాన్ చేశారు.

ఆరు నెలల పాటు :

ఇక సంక్రాంతి పండుగ తరువాత జగన్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేస్తారు అని అంటున్నారు. ఏపీలోని మొత్తం 26 జిల్లాలలో జగన్ పర్యటనలు ఉంటాయి, ఇవన్నీ ఆరు నెలల పాటు నిరాటకంగా కొనసాగుతాయని చెబుతున్నారు. ఆ తరువాత పార్టీలో సమూలమైన మార్పులు కూడా ఉంటాయని చెబుతున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్ లో వచ్చిన నివేదికలు తాను స్వయంగా జిల్లాలలో పర్యటించినపుడు అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా నియోజకవర్గాలలో భారీ మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు.

పాదయాత్ర ఫోకస్ :

వైసీపీ అధినేత 2027లో భారీ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఆ ఏడాది ప్రధమార్ధం నుంచే ఆయన పాదయాత్రలో ఉంటారని అంటున్నారు. సరిగ్గా అప్పటికి పదేళ్ళ క్రితం 2017లో నవంబర్ 6న పాదయాత్ర చేపట్టారు. అది 2019లో అధికారాన్ని అందించింది. బంపర్ విక్టరీని కూడా కట్టబెట్టింది. దాంతో అదే సెంటిమెంట్ ని కంటిన్యూ చేయాలని 2027 ఇయర్ ని ఎంచుకున్నారని అంటున్నారు. అపుడు నవంబర్ అయితే ఈసారి మరో ఎనిమిది నెలల ముందు అంటే ఫిబ్రవరి లేదా మార్చి నుంచే భారీ పాదయాత్ర సాగుతుందని చెబుతున్నారు. దానికి కారణం ఈసారి ఏకంగా అయిదు వేల కిలోమీటర్ల టార్గెట్ ని పెట్టుకుని జగన్ పాదాలు కదుపుతున్నారు. దాంతో 2029 మొదటి కల్లా పాదయాత్ర పూర్తి చేసుకోవడానికి ఈ ప్రిపరేషన్ ఉండాలని భావిస్తున్నారుట. ఈసారి పాదయాత్ర ఏకంగా 24 నెలల పాటు ఉండే చాన్స్ అయితే ఉందని అంటున్నారు.

వారి లోటు అలా :

అయితే గతంలో జగన్ పాదయాత్ర చేసినపుడు ఆయన తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల పార్టీని చూసుకునేవారు. వారు కుటుంబ సభ్యులు కాబట్టి కడు నమ్మకంగా ఉండేవారు. జగన్ పాదయాత్ర పేరుతో రోడ్డు మీద ఉంటే పార్టీని పూర్తి స్థాయిలో ఆ ఇద్దరూ కనిపెట్టుకుని ఉండేవారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. తల్లి విజయమ్మ రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు. షర్మిల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారు అని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వారి లోటు అయితే వైసీపీలో ఇపుడు ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు.

ఆమె రాక అనివార్యం :

ఈ నేపధ్యంలోనే వైసీపీ అధినాయకత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. జగన్ అయితే తన సతీమణి భారతిని రాజకీయాల్లోకి తీసుకుని రావాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆమె కనుక పార్టీ వ్యవహారాలు చూసుకుంటూంటే తాను పాదయాత్రలో బిజీగా ఉన్నా ఢోకా ఉండదని భావిస్తున్నారుట. అయితే ఆమెను తీసుకుని రావాలా వద్దా అన్నది ఒక సందేహంగా ఉన్నా అనివార్యంగా కనిపిస్తోంది కాబట్టి తప్పనిసరిగా భారతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారు అని పార్టీలో చర్చ అయితే సాగుతోంది. మరి భారతి కనుక రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి పూర్తిగా పార్టీ వ్యవహారాలు అవగాహన చేసుకోవాలి అంటే దానికి 2026 సరైన సమయం అని అంటున్నారు. సో ఈ ఏడాది ఆ ప్రకటన ఉండే చాన్స్ ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉంది అన్నది.