దసరా తరువాత...జనంలోకి జగన్ !
ఇక జగన్ జిల్లాల టూర్లకు ఉత్తరాంధ్ర జిల్లాలను ఎంచుకుంటున్నారు అన్నది కూడా ప్రచారంలో ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి ఆయన జిల్లా యాత్రలు స్టార్ట్ అవుతాయని చెబుతున్నారు.
By: Satya P | 25 Aug 2025 8:30 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీని గాడిన పెట్టేందుకు భారీ కసరత్తునే చేస్తున్నారు. గద పదిహేను నెలలుగా ఆయన పార్టీ నాయకులతో సమావేశాలు వారికి దిశా నిర్దేశం చేస్తూ సాగారు. అలాగే పరామర్శలు ఓదార్పు యాత్రలు మధ్య మధ్యలో చేశారు అయితే వైసీపీలో చాలా కాలంగా ఉన్న ఒక ప్రచారం జగన్ జనంలోకి వస్తారు అని ఆయన జిల్లాల టూర్లు వేస్తారు అని. అది కాస్తా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. చివరికి ఒక మంచి ముహూర్తమే సెట్ అయింది అన్నది తాజా సమాచారం గా ఉంది మరి.
విజయదశమి తరువాత :
ప్రస్తుతం భాద్రపద మాసం నడుస్తోంది. దీనిని శూన్య మాసం అంటారు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఆశ్వయుజ మాసం వస్తుంది. అలా మంచి రోజులు అన్నీ అపుడే ఉన్నాయి. విజయదశమి తెలుగు వారికి పెద్ద పండుగ. దాంతో నవరాత్రులలో అంతా బిజీగా ఉంటారు. ఈ పండుగ సందడి అంతా ముగిసిన తరువాత ఒక మంచి వేళ చూసుకుని జగన్ జిల్లా టూర్లకు రెడీ అవుతారు అని అంటున్నారు.
ఉత్తరాంధ్ర నుంచేనట :
ఇక జగన్ జిల్లాల టూర్లకు ఉత్తరాంధ్ర జిల్లాలను ఎంచుకుంటున్నారు అన్నది కూడా ప్రచారంలో ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి ఆయన జిల్లా యాత్రలు స్టార్ట్ అవుతాయని చెబుతున్నారు. అలా నెలలో కనీసంగా రెండు జిల్లాలు వంతున ఆయన పర్యటనలు సాగుతాయని చెబుతున్నారు. ఆయా జిల్లాల టూర్లలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ బాధ్యులు కీలక నాయకులతో జగన్ సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తారని గ్రౌండ్ లెవెల్ లో పార్టీ ఏ విధంగా ఉంది అన్నది ఆయన పూర్తిగా తెలుసుకుంటారు అని అంటున్నారు.
రెండేళ్ళ పాటు టూర్లు :
ఇక ఈ జిల్లా టూర్లు దాదాపుగా రెండేళ్ల పాటు జరుగుతాయని అంటున్నారు అంటే 2027 దాకా అని అంటున్నారు. ఆ తర్వాత వైసీపీ అధినేత మహా పాదయాత్రకు అప్పటి నుంచి 2029 ఎన్నికల వరకూ శ్రీకారం చుడతారు అని అంటున్నారు. గతానికి కంటే భిన్నంగా మరిన్ని మారు మూల గ్రామాల్లో జగన్ పాదయాత్ర ఈసారి ఉంటుందని చెబుతున్నారు. గతంలో జగన్ 37 వేల కిలోమీటర్ల భారీ పాదయాత్ర చేశారు. ఈసారి అయిదు వేల కిలోమీటర్ల దాకా ఈ పాదయాత్ర ఉండొచ్చని అంటున్నారు. మొత్తం మీద తొలి ఏణ్ణర్థం అధికార పార్టీకి హానీ మూన్ పీరియడ్ గా వదిలేసిన జగన్ మిగిలిన కాలాన్ని మాత్రం పవర్ ఫుల్ యాక్షన్ ప్లాన్ తో సెట్ చేసారు అని అంటున్నారు. జగన్ జనంతో మమేకం అవుతూనే 2029 ఎన్నికలకు వెళ్తారు ఇక మీదట జగన్ ఉండేది జనంలోనే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సో ఆ ప్రకటన కోసం ఇక వేచి చూడాల్సిందే అని అంటున్నారు.
