జగన్ కేసులలో అనూహ్యంగా పెరిగిన వేగం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి సంబంధించిన ఆస్తుల కేసులలో అనూహ్యంగా విచారణలో వేగం పెరిగింది.
By: Satya P | 1 Nov 2026 6:00 AM ISTవైసీపీ అధినేత వైఎస్ జగన్ కి సంబంధించిన ఆస్తుల కేసులలో అనూహ్యంగా విచారణలో వేగం పెరిగింది. ఈ కేసులలో రోజూ వారీ విచారణ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో నమోదైన 11 సీబీఐ కేసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన 9 చార్జ్షీట్లపై కూడా ప్రతిరోజూ విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ఈ విచారణలో వేగం పెరిగింది అని అంటున్నారు. అక్టోబర్ నెల మధ్య వారం నుండి రోజువారీ విచారణ ప్రక్రియ అధికారికంగా అమలులోకి వచ్చింది. దాని ఫలితంగా ఇప్పుడు డిశ్చార్జి పిటిషన్ల విచారణ సాగుతోంది. ఒక విధంగా చూస్తే దాదాపు పదేళ్లుగా ప్రాథమిక దశలోనే పెండింగ్లో ఉన్న ఈ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు అడుగులు పడుతున్నాయని చెప్పాలి.
ఈడీ వినతి నేపథ్యంలో :
ఇక జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి ఈడీ హైకోర్టును ఆశ్రయించడం జరిగిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద దాఖలైన ఈ కేసుల విచారణ డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా సుదీర్ఘకాలంగా స్తంభించిపోయిందని హైకోర్టుకు ఈడీ విన్నవించింది. దాంతో ఈ కేసుల విషయం మీద త్వరితగతిన విచారణ జరపాలని ఈడీ సెప్టెంబర్ నెలలో తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పాటు నిందితులంతా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశించాలని కోరింది. ఆ మీదటనే ఈ కేసులలో వేగం బాగా పుంజుకుంది అని అంటున్నారు
రికార్డు స్థాయిలోనే :
ఇదిలా ఉంటే వైఎస్ జగన్తో పాటు ఈ కేసులలో ఉన్న దాదాపు 70 మందికి పైగా నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు దృష్టి సారించింది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో దాదాపు 45 డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ ముగించింది అని చెబుతున్నారు. ప్రస్తుతానికి చూస్తే ఇండియా సిమెంట్స్ కేసులో డిశ్చార్జి పిటిషన్ల మీద విచారణ ముగిసినట్లుగా చెబుతున్నారు. అలాగే ఇంతదాకా ఉన్న ఆరు సీబీఐ చార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపైన సైతం విచారణ పూర్తి అయిందని అంటున్నారు. అలాగే భారతి సిమెంట్స్ కేసులో డిశ్చార్జి పిటిషన్ల విచారణ ఇపుడు మొదలైంది అని అంటున్నారు.
కీలకమైన పరిణామాలు :
ఇక జగన్ ఆస్తుల కేసులలో విచారణ వేగం పుంజుకున్న వేళ సాధ్యమైనంత తొందరలోనే కీలక పరిణామాలు జరగవచ్చు అని న్యాయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక చూస్తే సుప్రీంకోర్టు హైకోర్టులు నిరంతర పర్యవేక్షణతో పాటు వారి ఆదేశాలతో ఈ కేసుల విచారణ వేగం పెరగడంతో రానున్న కాలంలో కీలక పరిణామాలు సంభవిస్తాయని అంటున్నారు. వైఎస్ జగన్ అంటే తెలుగు నాట మాత్రమే జాతీయ రాజకీయాల్లో ముఖ్య నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆయన కేసులకు సంబంధించి ఏదైనా కీలక పరిణామాలు సంభవిస్తాయా అన్నది అయితే రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చతో పాటు పెను ఉత్కంఠని కూడా రేపుతోందని అంటున్నారు.
