Begin typing your search above and press return to search.

పులివెందులలో రీ పోలింగ్ కి జగన్ డిమాండ్

ఎన్నికలు నిర్వహించే విధానం ఇదేనా అని జగన్ ప్రశ్నించారు. పోలీసులను ఎక్కడికక్కడ పెట్టించి టీడీపీ వారు బూతులను ఆక్రమించుకుంటే చూస్తూ వదిలేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

By:  Satya P   |   1 Nov 2026 12:12 PM IST
పులివెందులలో రీ పోలింగ్ కి జగన్ డిమాండ్
X

పులివెందుల మునిసిపాలిటీలో రీపోలింగ్ పెట్టాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బెంగళూరు నుంచి ఆయన ఆదివారం ఉదయం పదకొండు గంటలకు పులివెందులకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందులలో ప్రజాస్వామ్యం హత్య జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం 80 పోలింగ్ బూతులుంటే అందులో 70 దాకా టీడీపీ వారే ఆక్రమించుకుని ఓటర్లను కూడా రానీయకుండా ఓట్లేసుకుంటున్నారని మండిపడ్డారు. చాలా చోట్ల మహిళా ఓటర్లు కూడా తమ ఓటు వేస్తామని కోరినా మీ ఓటు పడిపోయింది అని వారిని పంపించేస్తున్నారు అని జగన్ మండిపడ్డారు. మొత్తం 70 పోలింగ్ బూతులలో వైసీపీ ఏజెంట్లనే కూర్చోబెట్టలేదని ఆయన అన్నారు.

ఇవేనా ఎన్నికలు :

ఎన్నికలు నిర్వహించే విధానం ఇదేనా అని జగన్ ప్రశ్నించారు. పోలీసులను ఎక్కడికక్కడ పెట్టించి టీడీపీ వారు బూతులను ఆక్రమించుకుంటే చూస్తూ వదిలేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చైర్ పర్సన్ అభ్యర్థి ప్రమీల మీద దాడి చేశారని అలాగే పోలింగ్ బూతుల నుంచి వైసీపీ ఏజెంట్లను బయటకు నెట్టేశారని ఆయన అన్నారు. ఈ తరహా ఎన్నికల కోసమ అంతా కోరుకున్నది అని నిలదీశారు. పులివెందులలో ఎన్నికలు ఈ విధంగా జరగడం తీవ్ర అభ్యంతరకరమని జగన్ అన్నారు. ఇదే విషయం మీద తాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు.

భావి తరాలకు సందేశమా :

ఈ విధంగా ప్రత్యర్ధులు లేకుండా జనాలు ఓటు వేయకుండా ఎన్నికల పేరుతో తామే ఓట్లు వేసుకుంటే రేపటి తరానికి ఏమి సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రేపటి రోజున ఇదే కరెక్ట్ అని మరో పార్టీ వారు కూడా ఇలాగే చేస్తే అప్పుడు ఎన్నికల వ్యవస్థ మీదనే జనాలకు నమ్మకం పోదా అని జగన్ ప్రశ్నించారు. వ్యవస్థలను కాపాడాల్సిన వారు ఈ తీరున వ్యవహరిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరని ఆయన అన్నారు.

కాక్రోచులు అందుకే :

దేశంలో నక్సలైట్లు కానీ కాక్రోచులు కానీ పుట్టుకుని వస్తున్నారు అంటే ఈ విధంగా చేయబట్టే కదా అని జగన్ అన్నారు. ఎన్నికలలో గెలిచేందుకు ఇన్ని అడ్డదారులు తొక్కాలా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించకపోవడం దారుణని ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా జగన్ నిప్పులు చెరిగారు. బాబుకు తన పాలన మీద నమ్మకం లేకనే ఈ విధంగా చేయిస్తున్నారాని జగన్ ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేయలేకపోయారని అందుకే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్ అన్నారు.

రాకుండా అడ్డుకున్నారు :

తాను బెంగళూరు నుంచి పులివెందులకు హెలికాప్టర్ లో వస్తూంటే దారి మధ్యలో రాకూడదని అధికారులు చెప్పారని అయితే ఇంధనం అయిపోయిందని పైలెట్ చెప్పడం వల్లనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి అవకాశం ఇచ్చారు అని అన్నారు. తాను పులివెందుల రాకుండా కుట్ర జరిగిందని దీని వెనక పెద్దలు ఉన్నారని జగన్ ఆరోపించారు. పులివెందుల అక్రమాల మీద రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటర్లు లేకుండా ఎన్నికలు ఏమిటి అని ఆయన అంటూ ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ప్రజలు మేధావులు అంతా దీని మీద ఆలోచించాలని కోరారు.