Begin typing your search above and press return to search.

హస్తినకు వస్తా.. జగన్ రిక్వెస్ట్! కారణం ఏంటో?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Political Desk   |   22 July 2026 1:55 PM IST
హస్తినకు వస్తా.. జగన్ రిక్వెస్ట్! కారణం ఏంటో?
X

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో జగన్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ టూర్ లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను మాజీ సీఎం కలవాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు ఆ ఇద్దరి అపాయింట్మెంట్ తీసుకోవాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ రాజకీయాలు మంచి వాడివేడి మీద ఉన్న సమయంలో జగన్ రెడ్డి ఢిల్లీ వచ్చేందుకు రెడీ అవుతుండటం వెనుక కారణం ఏమై ఉంటుందనేది అంతుచిక్కడం లేదని చెబుతున్నారు.

సహజంగా ఏపీ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే జగన్ రెడ్డి హఠాత్తుగా ఢిల్లీకి వస్తానని కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరడం హాట్ టాపిక్ అవుతోంది. దాదాపు రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రతిపక్షంలో కొనసాగుతున్న జగన్ రెడ్డి జాతీయ స్థాయిలో తటస్థ వైఖరినే ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కూడా కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు వైసీపీ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను ఎందుకు కలవాలని అనుకుంటున్నారనే అంశంపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది.

రైతు సమస్యలా? రాజకీయమా?

మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలవాలని చూస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై విస్తృత చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రైతు సమస్యలపై గళం విప్పిన జగన్ రెడ్డి.. ఆయా అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా? లేక ఇంకేమైనా కారణం ఉందా? అనేది తెలియడం లేదని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అక్వా, పొగాకు రైతులు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అక్వా ఫీడ్ ధరలు పెరిగిపోవడంతోపాటు కనీస ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదేసమయంలో పొగాకుపై కేంద్రం 40 శాతం జీఎస్టీ విధించడంతో ముడి పొగాకు అమ్ముడు కావడం లేదని అంటున్నారు. ఈ రెండు సమస్యలపై వైసీపీ కొద్దిరోజులుగా పోరాడుతోంది. కొద్దిరోజుల క్రితం భీమవరంలో పర్యటించిన జగన్ అక్వా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా బుధవారం పొగాకు రైతులతోనూ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర పెద్దలను కలవాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదే సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన మద్యం రవాణా కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీకి చెందిన కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, కారుమూరి సునీల్ కుమార్ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసులో వైసీపికి చెందిన మరికొందరిని విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ జోరుకు బ్రేకులు వేయాలని వైసీపీ నేతలు అధినేత జగన్ ను కోరుతున్నారని అంటున్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో వైసీపీ నేతలను కాపాడటం కోసమే జగన్ ఢిల్లీ టూర్ కు ప్లాన్ చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.