Begin typing your search above and press return to search.

మోడీకి జగన్ ట్వీట్...పొలిటికల్ స్పెషల్ !

ఇదిలా ఉంటే ఈ మధ్యనే జగన్ కేంద్ర ఎన్నికల సంఘం తీరుని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఇది జాతీయ స్థాయిలో తెగ వైరల్ అయింది.

By:  Satya P   |   7 Oct 2026 5:39 PM IST
మోడీకి జగన్ ట్వీట్...పొలిటికల్ స్పెషల్ !
X

నరేంద్ర మోడీ అధికారిక పదవులలో ఏకంగా పాతికేళ్ళ కాలం ఎలాంటి విరామం లేకుండా కొనసాగారు. అది అక్టోబర్ 7 తో పాతికేళ్ళ మైలురాయిని దాటింది. దాంతో నరేంద్ర మోడీ సాధించిన ఈ సరి కొత్త రికార్డుని చూసి బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. అదే సమయంలో ఎన్డీయే మిత్రులు అంతా ఆయన ప్రజా సేవను కీర్తిస్తూ పెద్ద ఎత్తున అభినందనలు తెలియచేస్తున్నారు. అయితే ఎన్ డీయేతర పక్షాల నుంచి మాత్రం పెద్దగా స్పందన లేదు, పైగా ఈ రోజున విపక్ష శిబిరం ఎన్డీయే మీద తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తూ ఉంది. ఈ కీలక సమయంలో జాతీయ రాజకీయాల్లో న్యూట్రల్ స్టాండ్ అంటూ చెబుతూ వస్తున్న వైసీపీ నుంచి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు రావడం అంటే పొలిటికల్ గా వెరీ స్పెషల్ అనే అంతా భావిస్తున్నారు.

చరిత్రాత్మక మైలురాయిగా :

నరేంద్ర మోడీ సాధించిన ఈ అరుదైన ప్రయత్నాన్ని చరిత్రాత్మక మైలురాయిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. పాతికేళ్ల పరిపాలకుడు అయిన మోడీకి ఆయన సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలియచేశారు. తొలుత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ తరువాత దేసానికి ప్రధానిగా మోడీ ఏకంగా 25 ఏళ్ళు పాలించడం పట్ల జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీజీ మీకు హృదయ పూర్వకమైన శుభాకాంక్షలంటూ జగన్ చెప్పుకొచ్చారు.

ఈసీని విమర్శించిన వేళ :

ఇదిలా ఉంటే ఈ మధ్యనే జగన్ కేంద్ర ఎన్నికల సంఘం తీరుని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఇది జాతీయ స్థాయిలో తెగ వైరల్ అయింది. ఇండియా ఎన్డీయే కూటమి నుంచి రాజకీయ పక్షాలు కూడా జగన్ ట్వీట్ మీద విభిన్నంగా స్పందించాయి. జగన్ ది రాజకీయ అవకాశవాదం అని ఎన్డీయే మిత్ర పక్షం టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శిస్తే తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ అయితే జగన్ తన నిబద్ధత నిరూపించుకోవాలంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు పార్లమెంట్ లో తన ఎంపీల ద్వారా మద్దతు ఇవ్వకూడదని సూచించారు. ఇక కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు అని ఒక వైపు ప్రచారం సాగుతోంది, మరో వైపు చూస్తే ఈ మధ్యనే ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే జగన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు జగన్ ప్రధాని మోడీని అభినందిస్తూ చేసిన ట్వీట్ సర్వత్రా మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ స్టాండ్ మీద :

వైసీపీ పొలిటికల్ స్టాండ్ జాతీయ రాజకీయాల్లో ఏ వైపు అన్నది మళ్ళీ హాట్ డిస్కషన్ పాయింట్ గా మారుతోంది. అయితే మోడీ పాతికేళ్ల ప్రజా జీవిత ప్రస్థానం మీద ఒక పార్టీ అధినేతగా జగన్ స్పందించడంలో వేరే రాజకీయ కోణాలను తీయకూడదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటిదాకా ఎవరూ సాధించని రేర్ ఫీట్ ని మోడీ సాధించారు కాబట్టే ఆయనకు అభినందనలు చెప్పారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా విపక్ష శిబిరం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్న వేళ జగన్ నుంచి ఈ ట్వీట్ రావడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నదే అని అంటున్నారు.