జగన్ సెల్ ఫోన్ కేసులో బిగ్ ట్విస్ట్... సీబీఐకి అలా షాకిచ్చారా..?
కోర్టు రికార్డుల ప్రకారం.. అవసరమైన అనుమతి పొందిన తర్వాత జగన్ అక్టోబర్ 11న యూరప్ కు బయలుదేరారు.
By: Raja Ch | 23 Oct 2025 3:42 PM ISTవైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన విదేశీ పర్యటన సందర్భంగా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఇటీవల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ నెలకొంది!
అవును... జగన్ తన కుమార్తెలను చూడటానికి అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 30 మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చి వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరవుతారని హామీ ఇచ్చారు. ఆ విధంగా కఠినమైన పర్యవేక్షణ నిబంధనలతో అనుమతి మంజూరు చేయబడింది.
కోర్టు రికార్డుల ప్రకారం.. అవసరమైన అనుమతి పొందిన తర్వాత జగన్ అక్టోబర్ 11న యూరప్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా.. మాజీ ముఖ్యమంత్రి ఎటువంటి కోర్టు షరతును ఉల్లంఘించలేదని ఆయన న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు! అయితే సీబీఐ వాదన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.
ఈసారి లండన్ టూర్ కు వెళ్లే సమయంలో కోర్టు షరతుల మేరకు సీబీఐకి సమర్పించిన సెల్ ఫోన్ నంబర్ వివాదానికి కారణమైంది. ఇందులో భాగంగా... గతంలో ఇచ్చిన నంబర్ ఒకటి కాగా.. ఈసారి ఇచ్చిన నంబర్ మరొకటి అని చెబుతూ దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే.. ఆలోపే జగన్ విదేశాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారని, తమకు అందుబాటులో ఉండేందుకు ఇచ్చిన ఫోన్ నంబర్ మార్చి ఇచ్చారని పేర్కొంది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని వాదించింది! అయితే జగన్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో తాజాగా సీబీఐ కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా బిగ్ ట్విస్ట్ నెలకొంది.
ఇందులో భాగంగా... జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లు సీబీఐ వాదించగా.. అసలు జగన్ సెల్ ఫోనే వాడటం లేదని ఆయన లాయర్లు కోర్టుకు తెలిపారు. సీబీఐకి అందుబాటులో ఉండేందుకు ఓ మొబైల్ నంబర్ ఇచ్చారని సీబీఐ కోర్టుకు ఆయన లాయర్లు తెలిపారు. దీంతో వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో ఈ నెల 28న తీర్పు ఇస్తామని వెల్లడించారు.
