తుస్ మనిపించిన జగన్.. వైసీపీలో విస్తృత చర్చ!
ఈ పరిస్థితుల్లో మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ 45 రోజుల సుదీర్ఘ ఉద్యమాన్ని ప్రారంభించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
By: Tupaki Political Desk | 11 Oct 2025 4:24 PM ISTమాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై ఆ పార్టీ కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఉద్యమం ప్రకటించిన జగన్.. అదే రోజు లండన్ పర్యటనకు వెళ్లిపోవడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. 9వ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ పర్యటనకు వెళ్లి కేడర్ లో ఊపు తీసుకువచ్చిన జగన్.. 24 గంటలు గడిచిలోగా గాలి తీసేశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ రాజకీయంగా సరైన కార్యక్రమం నిర్వహించలేదన్న విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించాయి. 15 నెలల కాలంలో వైసీపీ అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా, వాటిలో జగన్ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ఇక మిర్చి, మామిడి, పొగాకు రైతుల సమస్యలపై జగన్ క్షేత్రస్థాయి పర్యటనలు చేసినా అవన్నీ వన్ డే షోగా మిగిలిపోయాయి. ఇక 15 నెలల తర్వాత మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయం కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం కూడా వైసీపీ విమర్శలతో ఆత్మరక్షణలోకి వెళ్లిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ 45 రోజుల సుదీర్ఘ ఉద్యమాన్ని ప్రారంభించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు జగన్ సరైన రీతిలో ఆలోచిస్తున్నారని, తమ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగే అవకాశం దక్కిందని వైసీపీ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఆనందం వారికి ఎంతసేపు నిలవలేదు. అధినేత చెప్పినట్లే కోటి సంతకాల ఉద్యమం ప్రారంభించిన నాడే ఆయన లండన్ వెళ్లిపోవడంపై కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు జగన్ లండన్ లో ఉంటారు. 23న ఆయన తిరిగి మన దేశానికి వస్తారు.
దీంతో ఈ పది రోజులు వైసీపీ ఆందోళనలు కొనసాగుతాయా? అనే చర్చ జరుగుతోంది. అధినేత అందుబాటులో లేకపోతే ఈ కార్యక్రమం కొనసాగించేందుకు మిగిలిన నేతలు ఆసక్తి చూపుతారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతలు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం వైసీపీ కోటి సంతకాల పోరాటానికి అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆందోళన నిర్వహించగా, పోలీసులు 400 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేత సుబ్బన్నను వేరే కేసులో అరెస్టు చేశారు. దీనిపై పేర్ని నాని పోలీసుస్టేషన్ కు వెళితే, ఆయనపై నాన్ బెయిల్బుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
అధినేత సూచనలో కేడర్ క్షేత్రస్థాయికి వెళ్లి పోరాడుతూ కేసులు పాలవుతుంటే, ఆయన మాత్రం విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా సరైన నిర్ణయమే అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే జగన్ కేడర్ కు అందుబాటులో ఉండటం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. వారంలో ఐదు రోజులు బెంగళూరులో గడుపుతున్నారని కేడర్ నిట్టూరుస్తున్నారు. ఇక డిజిటల్ బుక్ పేరుతో కేడర్ ను అసలు కలిసే ప్రయత్నం కూడా చేయడం లేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా పార్టీపై అభిమానంతో పోరాటానికి సిద్దపడుతుంటే.. మనోధైర్యం కల్పించాల్సిన అధినేత దూరంగా ఉండటంపై కార్యకర్తలు నిరసన వ్వక్తం చేస్తున్నారు.
