Begin typing your search above and press return to search.

జగన్ విషయంలో షర్మిలలో ఈ మార్పు చూశారా.. ఇది వైరల్!

అవును... సరస్వతీ పవర్ కంపెనీకి సంబంధించి చట్టపరమైన సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు వెరసి గత కొంతకాలంగా జగన్ - షర్మిల మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్లు కనిపించిన సంగతి తెలిసిందే!

By:  Raja Ch   |   21 Dec 2025 11:42 AM IST
జగన్  విషయంలో షర్మిలలో ఈ మార్పు చూశారా.. ఇది వైరల్!
X

గత కొంతకాలంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ సంతానం అయినా వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల వరకూ ఎంతో ప్రేమాభిమానాలాతో ఉన్నట్లు కనిపించిన వీరిద్దరూ ఆ తర్వాత ఉప్పు, నిప్పుగా మారిపోయిన పరిస్థితి. అయితే తాజాగా ఓ ఆసక్తికర పరిణాం చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది.

అవును... సరస్వతీ పవర్ కంపెనీకి సంబంధించి చట్టపరమైన సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు వెరసి గత కొంతకాలంగా జగన్ - షర్మిల మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్లు కనిపించిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థిపై పోటీగా కడపలో పోటీ చేసిన షర్మిల.. జగన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా కనీసం బర్త్ డేలకు శుభాకాంక్షలు చెప్పుకోవడం కూడా కరువైన పరిస్థితి.

ఈ క్రమంలో.. ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పుట్టినరోజు జరుపుకున్న్నారు. ఈ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు కానీ.. వైఎస్ జగన్ నుంచి మాత్రం స్పందన రాలేదు. అప్పటివరకూ షర్మిల కూడా జగన్ కు శుభాకాంక్షలు చెప్పింది లేదు! రాఖీ రోజూ కలిసిందీ లేదు!

కట్ చేస్తే.. ఈ రోజు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. భారీ భారీ ఫ్లెక్సీలు పెడుతున్నారు. అదంతా ఒకెత్తు అయితే... ఈ సందర్భంగా జగన్ సోదరి షర్మిల కూడా ఆయనకు ఆన్ లైన్ (ఎక్స్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

ఇందులో భాగంగా... "వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అందించండి మనస్పూర్తిగా కోరుకుంటున్నా" అంటూ షర్మిల తన అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది ఇప్పుడు రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది!