తాడేపల్లిలో జగన్.. బెంగళూరు నుంచి ఎలా వచ్చారంటే?
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
By: Tupaki Political Desk | 29 Oct 2025 2:59 PM ISTమాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. గత వారం తాడేపల్లి నుంచి బెంగళూరులోని యలహంకలో నివాసానికి వెళ్లిన జగన్ మంగళవారం తిరిగి రావాల్సివుంది. అయితే మొంథా తుఫాన్ కారణంగా మాజీ సీఎం జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు. మంగళవారం తుఫాన్ తీవ్రత దృష్ట్యా గన్నవరం నుంచి విశాఖ, హైదరాబాద్, బెంగళూరు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన వాయిదా వేశారు.
అయితే బుధవారం తుఫాన్ ప్రభావం తగ్గడంతో విమాన సర్వీసులు పునరుద్ధరించారు. దీంతో బెంగళూరులో ఉండిపోయిన మాజీ సీఎం ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో వైసీపీ అధినేతకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, పార్టీ సీనియర్ నేత పోతుల మహేశ్ తోపాటు వందల మంది కార్యకర్తలు జగన్ ను కలిశారు.
ఇక తాడేపల్లి చేరుకున్న మాజీ సీఎం జగన్ మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆయన ఎక్కడకు వెళ్లేది? ఎప్పుడు వెళ్లేది ఇంకా ఖరారు కాలేదు. మంగళవారం అర్ధరాత్రి తీరం దాటిన తుఫాను ప్రభావం తగ్గింది. అయితే ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అయినప్పటికీ రేపు లేదా ఎల్లుండి జగన్ పర్యటన ఉంటుందని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. పంటలు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేల మందిని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించింది. అయితే పునరావాస కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించలేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తమ హయాంలో వలంటీర్లు, సచివాలయ సిబ్బందితోపాటు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటూ తక్షణ సహాయ చర్యలు చేశారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తోందని వైసీపీ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తోంది.
