ప్రజాక్షేత్రానికే జగన్ మొగ్గు.. !
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయికాట్ చేశారు. అన్ని వైపుల నుంచి ఆయనపై ఒత్తిడి వస్తున్నప్పటికీ అసెంబ్లీకి వెళ్లకూడదనే నిర్ణయానికే ఆయన కట్టుబడి వ్యవహరిస్తున్నారు.
By: Garuda Media | 22 Sept 2025 5:00 AM ISTవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయికాట్ చేశారు. అన్ని వైపుల నుంచి ఆయనపై ఒత్తిడి వస్తున్నప్పటికీ అసెంబ్లీకి వెళ్లకూడదనే నిర్ణయానికే ఆయన కట్టుబడి వ్యవహరిస్తున్నారు. `ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీకి వెళ్లడానికి కానీ, తాడేపల్లిలో మీటింగుటు పెట్టడానికి కాదు` అని మంత్రుల నుంచి టిడిపి నాయకుల వరకు విమర్శలు గుప్పిస్తున్నారు. అదే విధంగా మేధావులు కూడా పలు చర్చల్లో ఇదే విషయాన్ని చెబుతున్నారు. కానీ, వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయం వెనక కీలకమైన ఉద్దేశం ఉందన్నది ఓ సీనియర్ నాయకుడు చెప్పిన మాట.
``మా నాయకుడు అసెంబ్లీని వదిలేసినప్పటికీ ప్రజాక్షేత్రాన్ని నమ్ముకున్నారని`` ఆయన చెబుతున్నారు. తాడేపల్లి లోనే కూర్చుని ఆయన మీడియా సమావేశాలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దీనికి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు గత ఆరు నెలల నుంచి రైతులకు సంబంధించిన సమస్యలు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, పేదలకు సంబంధించిన అంశాలు, ధరల పెరుగుదల, ఉల్లిపాయ రైతుల సమస్యలు ఇలా అనేక అంశాలపై మీడియా సమావేశాల్లో చర్చించడంతోపాటు పార్టీ నాయకులను క్షేత్రస్థాయిలో నడిపించడంలోనూ జగన్ సక్సెస్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.
దీనికి ప్రభుత్వం స్పందిస్తున్న తీరే ఉదాహరణ అని కూడా పేర్కొన్నారు. నిజానికి అసెంబ్లీలో లేని లేదా రాని వ్యక్తుల గురించి సభలో చర్చ నడవదు. కానీ, జగన్ గురించి మాత్రం గడిచిన సమావేశాల్లోనూ ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనూ తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. అంటే దీనిని బట్టి జగన్ సభకు వెళ్లినా.. వెళ్లకపోయినా ఇంటి దగ్గర నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి అన్నది.. సదరు నాయకుడు చెప్పిన మాట. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కూడా మంచి స్పందన వస్తుందని ఆయన చెబుతున్నారు.
అలాగని అసెంబ్లీకి రాకూడదని ఏమీ లేదని, అసెంబ్లీకి రావాలనే జగన్‌కు కూడా ఉందని అన్నారు. కానీ మాట్లాడే సమయం ఇచ్చే విషయంలో స్పీకర్ నుంచి సరైన సమాధానం రావడంలేదన్నారు. దీంతోనే సభకు రావడం లేదన్నది ఆయన చెప్పారు. ఇప్పటికైనా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినా.. ఇవ్వకపోయినా కనీసం సీఎంతో సమానంగా మాట్లాడే సమయం కేటాయిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే జగన్ కచ్చితంగా సభకు వస్తారన్నది అనంతపురం జిల్లాకు చెందిన నాయకుడు తెలిపారు.
మరి దీనిని బట్టి జగన్ అసెంబ్లీని వదిలేసి ప్రజాక్షేత్రాన్ని నమ్ముకున్నారని స్పష్టమవుతున్నప్పటికీ అసెంబ్లీని పూర్తిగా బాయ్‌కాట్ చేయటం అనేది సరికాదన్న వాదన కూడా వినిపిస్తోంది. దీనిపై ఇటు ప్రభుత్వం మౌనంగా ఉంది. అటు స్పీకర్ కూడా నిబంధనల పేరుతో ఆయన కూడా మౌనంగానే ఉన్నారు. దీన్నిబట్టి భవిష్యత్తులో ఇక జగన్ సభకు వస్తారా రారా అన్నది చూడాలి.
