Begin typing your search above and press return to search.

జగన్ హౌస్ అరెస్ట్...లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఇక మంత్రి నారా లోకేష్ తాజాగా జగన్ అరెస్ట్ మీద హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Satya P   |   23 Sept 2025 9:20 AM IST
జగన్ హౌస్ అరెస్ట్...లోకేష్ సంచలన వ్యాఖ్యలు
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరెస్టు మీద ఎప్పటికపుడు ప్రచారం సాగుతూనే ఉంటుంది. ఆయనను ఏదో ఒక కేసులో ఎక్కడో చూసి మరీ అరెస్ట్ చేస్తారు అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న అతి పెద్ద ప్రచారం. దీనికి కూడా ఒక బలమైన కారణం ఉంది. జగన్ అధికారంలో ఉన్నపుడు చంద్రబాబుని అరెస్ట్ చేయించారు. ఏకంగా 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉన్నారు. దాంతో చంద్రబాబు సీఎం అయ్యారు కాబట్టి జగన్ కూడా అరెస్ట్ అవుతారు అని చెప్పే రాజకీయ జోతిష్కులు ఎక్కువ అయిపోయారు.

కూటమి వ్యూహాత్మకంగానే :

రాజకీయాల్లో అరెస్టులు అన్నవి శిక్షలుగా బయటకు కనిపించినా అవి ఎంతో సానుభూతిని తెచ్చిపెడతాయి. జైలు నుంచి బయటకు వచ్చిన వారు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు తప్పించి కింద పడిపోలేదు. దానికి దేశ రాజకీయ చరిత్రలో ఎన్నో ఉదాహరణలు. జగన్ కూడా గతంలో జైలుకు వెళ్ళారు. ఆ తరువాత ఆయన రాజకీయంగా మరింత బలపడి 2019లో సీఎం అయిపోయారు. అందువల్ల ఈ లెక్కలు పక్కాగా తెలిసిన టీడీపీ ఆయనను అరెస్ట్ చేయిస్తుంది అన్నది ఎవరూ అసలు అనుకోరు. కానీ అలాగని వదిలేస్తుందా అన్నది కూడా మరో చర్చగా ఉంటూనే ఉంది. ఆ రెండవ దాని మీఎద ఎవరికీ క్లారిటీ లేదు, ఎవరి ఊహకే అది వదిలేయాల్సింది. అందుకే కూటమి నుంచి కూడా జగన్ అరెస్టు మీద పదే పదే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి.

జగన్ అరెస్టు అంటూ :

ఇక మంత్రి నారా లోకేష్ తాజాగా జగన్ అరెస్ట్ మీద హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎక్కడికి అయినా వెళ్ళవచ్చు హౌస్ అరెస్టులు ఉండవని అన్నారు. అయితే లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఏపీకి పెట్టుబడులు పెట్టాలని చూస్తే వారిని వైసీపీ నేతలు బెదిరించాలని చూస్తే అసలు ఊరుకోమని స్పష్టం చేశారు. ఇక వైసీపీ కులాల ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అని లోకేష్ విమర్శించారు.

బాధ్యత లేదా :

జగన్ కి ఒక ఎమ్మెల్యేగా అయినా బాధ్యత లేదా అని లోకేష్ ప్రశ్నించారు. ఆయన పులివెందుల నుంచి నెగ్గారు. కనీసం తన సొంత నియోజకవర్గం సమస్యల గురించి అయినా అసెంబ్లీలో చెప్పాలి కదా అని అన్నారు. వైసీపీ అధినేత జగన్ సభకు రావాల్సి ఉందనే లోకేష్ చెప్పారు. ఏది ఏమైనా తాము అభివృద్ధికే కట్టుబడి ఉన్నామని అందువల్ల తాము ప్రజల కోసం ప్రగతి కోసం ఆలోచిస్తామని ఏపీ బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించాలన్నదే తమ విధానం అని అన్నారు.