నేనే వస్తున్నా.. వైసీపీ నేతలకు జగన్ కాల్!
మరోవైపు.. పులివెందుల సహా పుంగనూరు, రాయచోటిలలో చోటు చేసుకున్న తీవ్ర దాడులు, ఘర్షణలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: Garuda Media | 18 Oct 2026 1:00 PM ISTవైసీపీ నేతలకు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. తాజాగా శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన సొంత నియోజకవర్గం పులివెం దులలో చోటు చేసుకున్న ఘటనలు, ఘర్షణలపై దుమారం రేగిన నేపథ్యంలో అక్కడి నాయకులతో జగన్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో తాను రంగంలోకి దిగుతున్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం జగన్ బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్లో ఉన్నారు. నిజానికి ఆయన షెడ్యూల్ ప్రకారం దసరాకు అక్కడే ఉండాలని భావించారు. కానీ, మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో రగడ చోటు చేసుకోవడంతో తన బెంగళూరు పర్యటనను రద్దు చేసుకుని ఏపీకి వస్తున్నట్టు చెప్పారు.
ఎందుకింత?
ప్రస్తుతం పుంగనూరు, రాయచోటి, పులివెందులలో చోటు చేసుకున్న ఘర్షణల వ్యవహారాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకువె ళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హుటాహుటిన బెంగళూరు నుంచి ఆదివారం ఉదయమే జగన్ తాడేపల్లికి రానున్నారని పార్టీ నాయకులు తెలిపారు. ఇక, ఇప్పటికే పార్టీ నేతలు. గవర్నర్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోరారు. ``రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలపై జరుగు తున్న దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నాం. ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తిపై దాడి ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లననున్నాం. రాయచోటిలో వైసీపీ కార్యాలయం దగ్ధం, పులివెందులలో కాల్పుల ఘటనలపై ఫిర్యాదు చేస్తాం`` అని పార్టీ నేత లేళ్ల తెలిపారు.
ఈసీ సీరియస్..
మరోవైపు.. పులివెందుల సహా పుంగనూరు, రాయచోటిలలో చోటు చేసుకున్న తీవ్ర దాడులు, ఘర్షణలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదన్నారు. అధికారులు, పోలీసులు కూడా నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షనేనని హెచ్చరించారు. నామినేషన్ల ఘర్షణలపై కేసులు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించారు. అలానే.. రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక ఇవ్వాలని కోరారు. అల్లర్లు జరగకుండా చూడాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చూపిస్తే సస్పెన్షన్, బదిలీ తప్పదని హెచ్చరించారు.
కలెక్టర్లదే బాధ్యత
రాయచోటి, పులివెందుల, తిరుపతి, దర్శి , రాజంపేట, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు వచ్చిన ఫిర్యాదులపై పునేఠా తక్షణమే స్పందించారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో కలెక్టర్లదే పూర్తి బాధ్యతని ఆయన తేల్చి చెప్పారు.
