జగన్...ఏపీ పాలిటిక్స్ లో కొత్త ఇన్నింగ్స్ !
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు ఈ రోజు. ఆయన 1972 డిసెంబర్ 21న జన్మించారు.
By: Satya P | 21 Dec 2025 11:53 PM ISTవైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు ఈ రోజు. ఆయన 1972 డిసెంబర్ 21న జన్మించారు. ఈ ఏటితో ఆయన 53 ఏళ్ళు పూర్తి చేసుకుని 54 ఏట అడుగు పెడుతున్నారు. రాజకీయంగా చూస్తే జగన్ యంగ్ లీడర్ కింద లెక్క. ఆయన పార్టీ వారు సైతం తరచూ అదే మాట చెబుతూ ఉంటారు. మా నేత యంగ్ అని మరింత కాలం ఆయన పార్టీని ముందుకు నడిపిస్తారు అని కూడా వారు అంటూ ఉంటారు. ఇక ఏపీ రాజకీయాల్లో జగన్ పాత్ర ఏమిటి అన్నది అందరికీ తెలిసిందే. నిజం చెప్పాలీ అంటే వైఎస్సార్ కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా జగన్ తనకంటూ కొత్త పేజీని పొలిటికల్ హిస్టరీలో క్రియేట్ చేసుకున్నారు. ఆయన వర్తమాన రాజకీయాల్లో ప్రత్యేకం అని చెప్పాల్సి ఉంటుంది.
సైలెంట్ గానే ఉంటూ :
జగన్ ఎక్కువగా మాట్లాడరు, ఆయన తన పని ఏదో తానేంటో అన్నట్లుగా ఉంటారు. నిజం చెప్పాలంటే ప్రజా జీవితంలో ఉన్నవారు ఎక్కువగా మాటల ద్వారానే కనెక్ట్ అవుతారు. కానీ జగన్ మౌనంతోనే కనెక్ట్ అవుతూంటారు. ఏపీ రాజకీయాలో గత పదిహేనేళ్ళుగా చూస్తే కనుక జగన్ గురించే చర్చ ఉంటుంది. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన చుట్టూనే రాజకీయాలు తిరుగుతాయి. ఇపుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం జగన్ మీద విమర్శలు చేయని రోజు అంటూ ఉండదు, అలా జగన్ పాత్ర కీలకం అని చెప్పాలి.
ఆల్టర్నేషన్ పాలిటిక్స్ :
ఏపీలో చూస్తే కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. అయితే వీటిలో పెద్ద పార్టీగా టీడీపీ ఉంది. ఆ పార్టీకి ధీటైన ఆల్టర్నేషన్ పార్టీ అంటే కచ్చితంగా వైసీపీనే చూడాలి. మిగిలిన పార్టీకి టీడీపీని ఢీ కొట్టే స్థాయిలో అయితే లేవు. దాంతో అందరి చూపూ వైసీపీ మీద కచ్చితంగా ఉంటుంది. ప్రజా స్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో విపక్షం కూడా అంతే ముఖ్యం. అందువల్ల విపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత వైసీపీకి జనం ఇచ్చారు. అయిదేళ్ళ పాటు అధికారంలో కూడా అదే జనం ఉంచారు. ఇపుడు తన వంతు పాత్ర పోషిస్తే ప్రజల మనసు చూరగొంటే మరోసారి అధికారం ఇవ్వడానికి కూడా జనం సిద్ధంగా ఉంటారు. అందువల్ల వైసీపీ వైపు ఆ పార్టీ వారే కాదు ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ప్రతిపక్ష నేతగా జగన్ తమ సమస్యలు ప్రస్తావించాలని వారు కోరుకుంటూంటారు.
అదే బలం :
జగన్ లో బలం ఏమిటి అంటే ఆయనకు ఉన్న ఆత్మ విశ్వాసం. అదే ఒక్కోసారి అతి విశ్వాసం కూడా అవుతుందని అంటారు. ఆ విధంగానే ఆయన ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని చెబుతారు. 2014లో అయితే రాజకీయంగా కొత్త కాబట్టి ఆయన అంచనాలు సరిగ్గా వేసుకోలేకపోయారు అనుకున్నా 2024లో మాత్రం జగన్ ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నారా లేక గ్రౌండ్ రియాలిటీస్ ని సరిగ్గా అర్ధం చేసుకోలేదా అన్న చర్చ నేటికీ ఉంది. ఏది ఏమైనా జగన్ ఓడినా ఆయన మాత్రం ఎక్కడా డీలా పడలేదు, అదే ఆయన బలంగా చెప్పుకోవాలని అంటున్నారు.
కొత్త ఏడాదిలో :
ఇక చూస్తే ఈ పుట్టిన రోజు తరువాత జగన్ రెట్టించిన ఉత్సాహంతో తన పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుని కొత్త ఏడాది నుంచి జనంలోకి వస్తారు అని అంటున్నారు. అదే విధంగా ఏపీలో ప్రస్తుతం రాజకీయం రెండుగా చీలింది. అధికార పక్షం. విపక్షం. వైసీపీ ఈ స్పేస్ లోకి తప్పకుండా అందుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. వైసీపీకి ఇది వరం అని కూడా చెప్పాలి. ఎందుకంటే విపక్షం సైడ్ అంతా ఒక్క వైసీపీ మాత్రమే పరచుకుని ఉంది. మరే పార్టీ ఇక్కడ లేదు, దాంతో ఈ భారీ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని వైసీపీ ఏ విధంగా పుంజుకుని 2029 ఎన్నికల దిశగా స్టెప్స్ వేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.
