Begin typing your search above and press return to search.

జగన్ కి చుక్కలు చూపించాలని కూటమికి ఉందిట కానీ..?

అదేంటో ఏపీలో టీడీపీ అతి పెద్ద మెజారిటీతో గెలిచింది అధికారం పూర్తిగా చేతిలోకి వచ్చింది, కానీ ఒక బలమైన కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది అని అంటున్నారు.

By:  Satya P   |   12 Sept 2025 8:00 AM IST
జగన్ కి చుక్కలు చూపించాలని కూటమికి ఉందిట కానీ..?
X

అదేంటో ఏపీలో టీడీపీ అతి పెద్ద మెజారిటీతో గెలిచింది అధికారం పూర్తిగా చేతిలోకి వచ్చింది, కానీ ఒక బలమైన కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది అని అంటున్నారు. ఆ కోరిక గత పదిహేను నెలలుగా ఏ మాత్రం తీరడం లేదు అని అంటున్నారు. అసెంబ్లీ నిండా 164 మంది ఎమ్మెల్యేలతో కూటమి నిండుగా పరచుకుని ఉంది. కేవలం 11 మంది మాత్రమే వైసీపీ నుంచి గెలిచారు. దాంతో వైసీపీ కనుక అసెంబ్లీకి వస్తే బిక్కు బిక్కుమంటూ ఒక వైపు ఉండాల్సిందే. ఆ సన్నివేశం ఊహించుకుంటేనే కూటమికి తెగ హుషార్ వస్తుంది. కానీ జరుగుతున్నదేమిటో అందరికీ తెలిసిందే.

చప్పగానేనా :

వైసీపీ అధినేత జగన్ ఈసారి సమావేశాలకు హాజరు కావడం లేదని తేల్చేసారు. ఈ నెల 18 నుంచి వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు కూడా యధా ప్రకారం కూటమి పార్టీలతోనే సాగుతాయి. అంటే అంతటా అధికార పక్షమే. వారే సభలో ఉంటారు. దాంతో ఒంటి చేత్తో చప్పట్లుగానే ఉంటుంది. సభలో విపక్షం లేకపోవడం అంటే కూరలో ఉప్పు లేక చప్పగా ఉండడమే అని అంటున్నారు. అదే విపక్షం సభకు వస్తే ఆ సమావేశాల తీరే వేరుగా ఉంటుంది అన్నది తెలిసిందే.

జగన్ ది వ్యూహమా :

ఇక 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. దాంతో వైసీపీ సభకు హాజరు కావడం లేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని చెబుతోంది. ప్రతిపక్ష హోదా కావాలీ అంటే నిబంధనల ప్రకరాం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలని కూటమి పెద్దలు అంటున్నారు. అందువల్ల అది కుదరదు సభకు వచ్చి చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో చంద్రబాబు మరోసారి జగన్ కి సవాల్ చేశారు. అసెంబ్లీకి వస్తే అన్నీ చర్చిద్దాం, సిద్ధమేనా అని కూడా నిగ్గదీశారు. అయితే సభకు గైర్ హాజరు అన్నది వైసీపీ అధినేత వ్యూహాత్మక నిర్ణయం అంటున్నారు. సభకు వెళ్తే జరిగేది ఏమిటో తెలుసు. అందుకే ఆయన రావడానికి నిరాకరిస్తున్నారు అని అంటున్నారు. కూటమి నుంచి వచ్చే విమర్శలు వారు చేసే ఆవేశపూరిత ప్రసంగాలు అన్నీ కూడా తమ మీదనే అన్నది వైసీపీకి తెలుసు. అందుకే ఆ బారిన పడకుండా ఉందేందుకే వ్యూహాత్మకంగా ప్రతిపక్ష హోదా అన్న కండిషన్ తీసుకుని వచ్చారు అని అంటున్నారు.

ఇచ్చినా వెళ్తారా :

ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. పోనీ కూటమికి ఎటూ జగన్ సభకు రావాలి కాబట్టి మేము విపక్ష హోదా ఇస్తాం రండి అని పిలిచినా జగన్ అసెంబ్లీకి వస్తారా అంటే అది కూడా డౌటేనా అన్న కొత్త చర్చ వస్తోంది. ఇక 2014 నుంచి 2019 మధ్యలో ఏపీ అసెంబ్లీలో అతి పెద్ద సంఖ్యతో ప్రతిపక్ష హోదాతో వైసీపీ ఉంది. ఆ సమయంలో కూడా గట్టిగా మూడేళ్ళు మాత్రమే జగన్ అసెంబ్లీకి వచ్చారు. ఆ మీదట ఆయన సభకు నమస్కారం పెట్టి జనంలోకి వెళ్ళిపోయారు. అంటే విపక్ష హోదా ఇచ్చినా ఆనాడు తన గొంతులు నొక్కుతున్నారని తాము అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడం లేదని తాము సభకు వచ్చి ఏమి లాభం అని ప్రజల మధ్యనే వెళ్ళి తేల్చుకుంటామని జగన్ చెప్పి వెళ్ళిపోయారు అన్నది గుర్తు చేస్తున్నారు.

వచ్చేది లేదు...ఇచ్చేదీ లేదు :

జగన్ సభకు రారు అన్నది కూటమి పెద్దలకు బాగా తెలుసు. వస్తే సభలో ఆయన అపరిమిత బలంతో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఫేస్ చేయాలని అందుకే రారు అని కూడా తెలుసు అంటున్నారు. మరి తెలిసి ఎందుకు పిలుస్తున్నారు అంటే జనంలో జగన్ ని చెడ్డ చేసేందుకే అని అంటున్నారు. ఇక జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అని అంటున్నారు. ఎందుకు అంటే ఆ హోదా ఎటూ అధికార కూటమి ఇవ్వదని తెలుసు. అలా ఇవ్వకపోవడం వల్లనే తాను గైర్ హాజరు అవుతున్నాను అని తప్పు అంతా కూటమి ప్రభుత్వానిదే అని చెప్పుకోవడానికే జగన్ ఇలా డిమాండ్ ముందు పెడుతున్నారు అని అంటున్నారు. రెండు వైపులా విషయాలు తెలుసు. కానీ జనం కోసమే ఈ డిమాండ్లు సవాళ్ళూ అని అంటున్నారు.