Begin typing your search above and press return to search.

అమరావతికి జగన్...ప్లాన్ ఏంటి ?

ఇదే సమయంలో జగన్ అమరావతి టూర్ చేస్తే బాగుంటుందని కొందరు నేతలు అంటున్నారు. రైతుల సమస్యలను తెలుసుకుని వారికి సంఘీభావం తెలపడం మంచి పరిణామంగా ఉంటుందని అంటున్నారు.

By:  Satya P   |   22 July 2026 10:31 PM IST
అమరావతికి జగన్...ప్లాన్ ఏంటి ?
X

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతి రాజధాని పర్యటనకు రెడీ అవుతున్నారా అంటే ప్రచారం బట్టి చూస్తే అవును అనే అంటున్నారు. జగన్ ఉండేది తాడేపల్లిలోని తన నివాసంలో. అమరావతి కూడా దగ్గరలోనే ఉంది. ఇక జగన్ ఇపుడు ఎందుకు అక్కడకు వెళ్ళాలని అనుకుంటున్నారు అన్నదే పెద్ద చర్చ. పైగా అమరావతి వర్సెస్ మావిగన్ అని జగన్ ఇటీవల కాలంలోనే ఒక నినాదం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మా స్టాండ్ ఇదే అని మీడియా ముఖంగా కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన తరువాత జగన్ అమరావతి అని వెళ్ళడం వెనక వ్యూహమేంటి అన్న చర్చ సాగుతోంది.

వెళ్తే ఎలా ఉంటుంది :

ఇదిలా ఉంటే అమరావతి వెళ్తే ఎలా ఉంటుంది అని జగన్ ఇటీవల తన పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు అని అంటున్నారు. ఇపుడే ఎందుకు అంటే ఇటీవల రాజధానిలో పంట భూములను దున్నేసి మరీ ప్రభుత్వం తీసుకుంది అన్న ఆరోపణలు వచ్చాయి. ఇక దానిని తట్టుకోలేక ఉండవల్లికి చెందిన రైతు పద్మనాభరెడ్డి గుండె పోటుతో మృతి చెందారు అని కూడా వార్తలు వెలువడ్డాయి. అంతే కాకుండా బలవంతపు భూసేకరణ మీద రైతాంగం ఆగ్రహంగా ఉందని కూడా ప్రచారం సాగుతోంది. వీటి నేపధ్యంలో జగన్ గుండెపోటుతో మరణించిన రైతు పద్మనాభం కుటుంబాన్ని పరామర్శించేందుకు అమరావతి టూర్ తొందరలో పెట్టుకోనున్నారు అని అంటున్నారు. దీని మీదనే పార్టీ నేతలతో ఆయన డిస్కస్ చేశారు అని అంటున్నారు.

అనుమతిస్తారా :

ఇక చూస్తే కనుక ఈ మధ్యనే వైసీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు అంతా కలసి ఉండవల్లికి వెళ్ళి భూసేకరణ విషయంలో ఇబ్బంది పడుతున్న రైతులను పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే వైసీపీ నేతలు అక్కడకి చేరుకున్న నేపథ్యంలో ఘర్షణ వాతావరణ నెలకొనడం టీడీపీ వర్సెస్ వైసీపీగా అది మారడంతో పెద్ద రచ్చ జరిగింది. ఆ మీదట రెండు వైపుల నుంచి కూడా కేసులు పెట్టుకోవడం జరిగింది. ఆ ఉద్రిక్తతలు అలా ఉండగానే ఇపుడు ఏకంగా వైసీపీ అధినేత జగన్ అమరావతి టూర్ అంటే మరింత ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయో అన్నది పోలీసులు ఆలోచిస్తారు అని అంటున్నారు. దీంతో జగన్ టూర్ కి అనుమతిస్తారా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది.

వైసీపీలో భిన్న వాదనలు :

ఇదే సమయంలో జగన్ అమరావతి టూర్ చేస్తే బాగుంటుందని కొందరు నేతలు అంటున్నారు. రైతుల సమస్యలను తెలుసుకుని వారికి సంఘీభావం తెలపడం మంచి పరిణామంగా ఉంటుందని అంటున్నారు. అలాగే గుండె పోటుతో మృతి చెందిన పద్మనాభరెడ్డి కుటుంబాన్ని పరామర్శించడం మానవతా కోణంలో ఉంటుందని అంటున్నారు. మరి కొందరు అయితే మరోసారి ఉద్రిక్తతలకు ఈ పరిణామాలు దారి తీయవచ్చు కాబట్టి జగన్ కొన్నాళ్ళు ఆగితే బాగుంటుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ అమరావతి టూర్ మీద భిన్న స్వరాలు అయితే వైసీపీలో వినిపిస్తున్నాయని అంటున్నారు. మరి దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాల్సింది వైసీపీ అధినాయకత్వమే అని అంటున్నారు. ఏది ఏమైనా అమరావతి విషయంలో వైసీపీ ఆలోచనలు ఏమిటి అన్నది అయితే చర్చగానే ఉంది. అమరావతి రైతుల పట్ల వైసీపీకి సానుభూతి ఉందని గట్టిగా చెప్పాలన్నదే ఆ పార్టీ ఆలోచన. అదే సమయంలో అమరావతి రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ ఇప్పటికే చెప్పేసింది అని అంటున్నారు. మరి రాజధానికి మద్దతు ఇవ్వకుండా ఈ తరహా పర్యటనలు పరామర్శలు చేయడం వల్ల ఏమైనా కొత్తగా ఒనగూడే ప్రోయోజనం ఏమిటి అన్నదే అంతా చర్చిస్తున్నారు.