2029కి భారీ ప్లాన్.. నియోజకవర్గాలకు వైసీపీ స్పెషల్ టీమ్స్
కొద్దిరోజులుగా వైసీపీ కార్యక్రమాల్లో దూకుడు కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏదో విధంగా పార్టీ శ్రేణులు జనంలో ఉండేలా కార్యక్రమాలు నిర్వహించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించిందని అంటున్నారు.
By: Tupaki Political Desk | 4 Aug 2026 1:04 PM ISTవైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తాజా రాజకీయ వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి. 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యం పెట్టుకున్న జగన్ రెడ్డి బెంగళూరులోని యలహంక వేదికగా ముమ్మర కసరత్తు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ వ్యూహాలు అనుసరించాలనే విషయమై ఆయన ఫోకస్ చేశారని చెబుతున్నారు. ఇందులో భాగంగా కొందరు సీనియర్ నేతలతోపాటు ఎన్నికల వ్యూహకర్తలను అక్కడికే పిలిపించుకుని చర్చిస్తున్నారని అంటున్నారు. వీటి ఫలితంగానే ఇటీవల వైసీపీ దూకుడు పెంచిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కొద్దిరోజులుగా వైసీపీ కార్యక్రమాల్లో దూకుడు కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏదో విధంగా పార్టీ శ్రేణులు జనంలో ఉండేలా కార్యక్రమాలు నిర్వహించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించిందని అంటున్నారు. ఇందులో భాగంగానే అధినేత జగన్ రెడ్డి ఆకస్మిక జిల్లాల పర్యటనలు చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ వ్యూహకర్తగా కపిల్ సాహు నియామకం తర్వాత రెండేళ్లుగా నిస్తేజంగా ఉన్న పార్టీ కేడర్ లో కదలిక తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో అధినేత జగన్ రెడ్డి వస్తేనే హడావిడి చేసే నేతలు ఇప్పుడు సొంతంగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారని అంటున్నారు.
దీనికి తాజాగా పలు ఉదంతాలను చూపుతున్నారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతల భూకబ్జాలపై ఆందోళనలు చేయాలనే నిర్ణయంతోపాటు డీఎస్సీలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడాన్ని ఎత్తిచూపుతున్నారు. అంతేకాకుండా డీఎస్సీలో ఉద్యోగాలు రాని అభ్యర్థులను ఒక చోట సమీకరించి వారితో మాట్లాడించడం వల్ల కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దీంతో మెగా డీఎస్సీపై అనుమానాలు రేకెత్తించడం ద్వారా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసే వ్యూహం దాగుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఒక రాజకీయ పార్టీగా ఈ విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. అదే సమయంలో గతంలో ఎప్పుడో ఒకసారి అన్నట్లు జిల్లాలకు వచ్చే అధినేత జగన్ రెడ్డి తీరులోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖలో మత్స్యకారుల పరామర్శ, ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి అప్పలరాజు కుటుంబ సభ్యుల పరామర్శ వంటి వరుస కార్యక్రమాలతో పార్టీ కేడర్ లో ఊపు తెచ్చేలా జగన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. దీని అంతటికీ ప్రధానంగా వ్యూహకర్తల సలహాలు, సూచనలే ప్రధాన కారణం అంటున్నారు.
వ్యూహకర్తల సలహాలతో వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభించి, ఎన్నికల వరకు జనంలోనే ఉండాలనే మాజీ సీఎం జగన్ నిర్ణయాన్ని కాస్త సడలించుకున్నారని చెబుతున్నారు. అందుకే వారంలో ఒకసారి ఏదో ఒక జిల్లా టూర్ ఉండేలా ప్లాన్ జరుగుతోందని అంటున్నారు. ఇదే సమయంలో కొత్త వ్యూహకర్త కపిల్ సాహు బృందంతోపాటు వైసీపీకి గతంలో సేవలు అందించిన పలువురు సెఫాలజిస్టులను రాష్ట్ర వ్యాప్తంగా రంగంలోకి దింపారని కూడా చెబుతున్నారు. వీరు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఒక సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారని అంటున్నారు. వీటి ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో వచ్చే మూడేళ్లలో ఏం చేయాలి? ఎవరికి బాధ్యతలు అప్పగించాలన్న విషయమై ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఈ బృందాలు ఇప్పటికే ప్రాథమిక నివేదిక తయారు చేశాయని, కొద్దిరోజుల్లో సమగ్ర నివేదికను పార్టీకి సమర్పిస్తాయని చెబుతున్నారు. దీని ఆధారంగా ఆపరేషన్ 2029కి ప్రణాళిక రూపొందించేలా జగన్ రెడ్డి పావులు కదుపుతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
