Begin typing your search above and press return to search.

జగన్ పాదయాత్ర...వైసీపీలో తీవ్ర చర్చ

జగన్ 2017 లో పాదయాత్ర చేసిన నాటికి 2027లో చేయబోయే నాటికి ఏపీ రాజకీయం పూర్తిగా మారిపోయింది అని అంటున్నారు.

By:  Satya P   |   8 March 2026 5:00 AM IST
జగన్ పాదయాత్ర...వైసీపీలో తీవ్ర చర్చ
X

వైసీపీ మొత్తం అధినేత జగన్ చుట్టూ అల్లుకుని ఉంది. ఏ ప్రాంతీయ పార్టీకి అయినా ఇదే పరిస్థితి ఉంటుంది. అధినేత ఇమేజ్ మీదనే ఆధారపడి పార్టీ సాగుతుంది. అయితే తెలుగు రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ పార్టీలను గమనిస్తే సంస్థాగతంగా అత్యంత పటిష్టంగా టీడీపీ ఉంది. గ్రాస్ రూట్ లెవెల్ వరకూ టీడీపీ దూసుకుని పోయి ఉంది. అందుకే నాయకులు పార్టీ మారినా క్యాడర్ అయితే కమిట్ మెంట్ తో ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ వైపు తీసుకుంటే పాతికేళ్ళ వయసు ఉన్న పార్టీ. ఆ పార్టీకి కమిటెడ్ క్యాడర్ ఉన్నారు. పదిహేనేళ్ల వైసీపీ విషయానికి వస్తే సంస్థాగతంగా ఇంకా బలపడాల్సి ఉంది అన్నది ఉంది. అయితే వైసీపీకి ఉన్న కమిటెడ్ క్యాడర్ అంతా వైఎస్సార్ జగన్ ని చూసే అన్నది నిజం.

పాదయాత్రతోనే జోష్ :

వైసీపీ అధినేత పాదయాత్రతోనే జోష్ వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. గడచిన ఇరవై నెలలుగా చూస్తే జగన్ బయటకు పెద్దగా రావడం లేదు, జిల్లాల టూర్లు వంటివి కూడా చేస్తారని ప్రచారంలో ఉంది కానీ అది మాత్రం అమలు జరగడంలేదు. ఇక జగన్ పాదయాత్ర 2027 లో జూలైలో వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్లీనరీని నిర్వహించి ఆ మీదట డేట్ ఫిక్స్ చేస్తారని అంటున్నారు. ఈసారి ఏకంగా అయిదు వేల కిలోమీటర్ల భారీ పాదయాత్ర ఉంటుందని చెబుతున్నారు. గతసారి అంటే 2017 లో జరిగిన పాదయాత్ర 3,700 కిలోమీటర్ల దాకా సాగింది. నియోజకవర్గం ముఖ ద్వారం గుండా నాడు సాగింది. ఈసారి మండలాలు, మేజర్ పంచాయతీలు టచ్ చేస్తూ జగన్ పాదయాత్ర ఉండేలా రూపకల్పన చేస్తున్నారు అని అంటున్నారు.

జరుగుతుందా లేదా :

అసలు ఎందుకొచ్చిన ఈ ప్రశ్న అని అంతా అనుకుంటే అక్కడే ఉంది రాజకీయం అంటున్నారు. జగన్ 2017 లో పాదయాత్ర చేసిన నాటికి 2027లో చేయబోయే నాటికి ఏపీ రాజకీయం పూర్తిగా మారిపోయింది అని అంటున్నారు. ఈ మధ్యలో జగన్ అధికారంలోకి రావడం ప్రతిపక్షాల మీద నిర్బంధాలు విధించడాలు జరిగాయి. ఆ మధ్యలో లోకేష్ యువగళం పాదయాత్రకు కూడా ఇబ్బందులు పెట్టారని టీడీపీలో విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా పాదయాత్ర పేరుతో నెలల తరబడి వీధులను బ్లాక్ చేస్తామంటే కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా అన్నది మరో చర్చ. ఇక ఢీ అంటే ఢీ కొడుతున్న ఏపీ రాజకీయాల్లో వైసీపీ మీద కూటమి వ్యూహాలు ఎటూ ఉండనే ఉంటాయని అంటున్నారు.

కేసులు చిక్కుముళ్ళు :

ఇక మరో వైపు చూస్తే గతంలో వైసీపీ అధినేత మీద ఉన్న కేసులు అలాగే పెండింగులో ఉన్నాయి. అదే విధంగా కొత్త కేసులు కూడా పెట్టే చాన్స్ ఉంటుందని ప్రచారం అయితే సాగుతోంది రెడ్ బుక్ లో జగన్ పేరు ఉంటుందా లేదా అంటే తరువాత చెబుతామని ఇటీవల నరా లోకేష్ చెప్పిన దానిని గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాదు చంద్రబాబుని 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసి ఏకంగా 53 రోజుల పాటు జైలులో ఉంచారు అన్నది తమ్ముళ్లలో ఉంది అని గుర్తు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వానికి కేసుల చిక్కుముళ్ళు తప్పేట్లు లేవని అంటున్నారు. దాంతో ఒకవేళ అనూహ్యమైన పరిణామాలు జరిగి జగన్ మీద కేసులు ఎదురై ఆయన అరెస్ట్ అయి జైలు పాలు అయ్యే ప్రమాదాన్ని కొట్టి పారేయలేమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎన్నో అనుమానాలు :

అంతే కాదు వైసీపీ అధినేత ఈసారి సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధపడినా అది సాధ్యమవుతుందా అన్నది మరో చర్చగా ఉంది. ఇతరత్రా ఒత్తిళ్ళు కూడా ఉంటాయని అంటున్నారు. అంటే ఒక వైపు కూటమి వ్యూహాలు మరో వైపు కేసుల చిక్కులు ఇబ్బందులు ఇవన్నీ కలిసి జగన్ పాదయాత్ర సవ్యంగా మొదలై సాగుతుందా అన్నది పార్టీలో తీవ్ర చర్చ అయితే సాగుతోంది అని అంటున్నారు. మొత్తానికి చూడాల్సి ఉంది. జగన్ పాదయాత్రతో గేర్ మార్చాలని చూస్తున్న వైసీపీ అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలుగుతుందా జగన్ పాదయాత్ర అయిదు వేల కిలోమీటర్ల భారీ లక్ష్యాన్ని సాధించి చేదిస్తుందా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న నేపధ్యం ఉంది.