Begin typing your search above and press return to search.

జగన్ తరువాత ఆమె...నంబర్ టూ పోస్టులోకి ?

వైసీపీలో సర్వ సత్తాక అధినేత జగన్ అన్నది అందరికీ తెలుసు. పార్టీ ఆయనతోనే అల్లుకుని ఉంది. జగన్ ఇమేజ్ తోనే పార్టీకి విజయం అయినా లేదా మరేదైనా.

By:  Satya P   |   30 July 2026 7:00 AM IST
జగన్ తరువాత ఆమె...నంబర్ టూ పోస్టులోకి ?
X

వైసీపీలో సర్వ సత్తాక అధినేత జగన్ అన్నది అందరికీ తెలుసు. పార్టీ ఆయనతోనే అల్లుకుని ఉంది. జగన్ ఇమేజ్ తోనే పార్టీకి విజయం అయినా లేదా మరేదైనా. అన్నింటికీ ఆయనే కర్త కర్మ క్రియ అన్నది తెలిసిందే. ఇదిలా ఉంటే ఒంటి చేత్తో జగన్ పార్టీని దాదాపుగా పదిహేనేళ్ళ పాటు నెట్టుకుని వచ్చారు. అయితే ఇపుడు పరిస్థితులు మారుతున్నాయి. దాంతో జగన్ పార్టీలో నంబర్ టూ అవసరం ఏర్పడింది అని అంటున్నారు. గతంలో విజయసాయిరెడ్డి ఈ పోస్టులో ఉండేవారు అని అనుకునేవారు. అయితే ఆయన రెండేళ్ళ క్రితం పార్టీని వీడి వెళ్ళిపోయారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో జగన్ తరువాత కీలకంగా వ్యవహరిస్తున్నారు అని అనుకున్నా అది కూడా సరిపోవడం లేదు, కోటరీ జగన్ చుట్టూ ఉందని ఒక ప్రచారం అయితే ఉంది. దాంతో చాలా మంది అసంతృప్తి చెందుతున్నారు. దాంతో జగన్ సరికొత్తగా ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.

అన్ని విధాలుగా అండగా :

ప్రస్తుతం ఏపీలోని టీడీపీలో చంద్రబాబుకు లోకేష్ అందుకుని వచ్చారు. ఆయన పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అలాగే జనసేనలో పవన్ కి నాగబాబు అండగా ఉన్నారు. అలాగే వైసీపీకి కూడా సంబంధీకులు వెన్నుదన్నుగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు, పైగా ఎలాంటి కోటరీ విమర్శలు రాకపోతే నాయకత్వం అంతా ఒక్కటిగా ఉంటుందని భావిస్తున్నారుట. దాంతో పాటుగా జగన్ వచ్చే ఏడాది నుంచి జనంలోనే ఉండబోతున్నారు. ఆయన పర్యటనలు పాదయాత్ర అన్నీ కలిపి 2029 ఎన్నికల దాకా కొనసాగుతాయని అంటున్నారు. దాంతో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడానికి నంబర్ టూ ఒకరు అవసరం అని భావిస్తున్నారుట. ఆ పదవిలోకి ఎవరు వస్తారు అన్నదే చర్చగా ఉంది. కానీ దానికి ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రచారం అయితే ఆసక్తికరంగానే ఉంది అని అంటున్నారు.

రంగంలోకి ఆమె :

జగన్ తరువాత వైసీపీ మొత్తం బాధ్యతలు చూసే చాన్స్ ఆమెకే అని అంటున్నారు. ఆమె ఎవరో కాదు జగన్ సతీమణి భారతి అని చెబుతున్నారు. వైసీపీలో అందరినీ కట్టుగా జట్టుగా ఉంచడంతో భారతి వంటి వారు అయితేనే సరిపోతారు అని భావిస్తున్నారుట. పైగా ఏ రకమైన ఇబ్బందులు కూడా ఆమెకు ఈ బాధ్యతలు అప్పగిస్తే రావు అని అంటున్నారు. అదే వేరొకరికి తెచ్చి అక్కడ పెడితే పార్టీలో ఇతర నేతల మధ్య విభేదాలు రావడం జరుగుతుందని కూడా అంటున్నారు. ఇక జగన్ కూడా పార్టీ బాధ్యతలు తన సతీమణికి పంచాలని చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జగన్ కి సంబంధించిన వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ కూడా భారతి చూస్తున్నారు. ఆమె రాజకీయంగా పెద్దగా కనిపించినది లేదు, ఎన్నికల వేళ మాత్రం ఆమె పులివెందులలో జగన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇపుడు ఆమెకి వైసీపీలో కీలక పగ్గాలు అప్పగించాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

కడప నుంచి ఎంపీగా :

అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో కడప లోక్ సభ సీటు నుంచి కూడా భారతిని పోటీ చేయించాలని జగన్ ఆలోచిస్తున్నారు అని కూడా వినిపిస్తోంది. ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన 2024 నుంచి వరసగా మూడు సార్లు గెలుస్తూ వచ్చారు. ఇక 2029లో భారతిని పోటీ చేయించడం ద్వారా మొత్తం ఈ ఎంపీ సీటు పరిధిలో పది అసెంబ్లీ సీట్లను గెలుచుకోవచ్చు అన్నది జగన్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా ఢిల్లీ స్థాయిలో వైసీపీ పాత్ర వచ్చే ఎన్నికల్లో పెరుగుతుందని భావిస్తున్న క్రమంలో భారతిని పోటీ చేయిస్తారు అని గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఇవి ఊహాగానాలుగా మిగులుతాయా లేదా నిజం అవుతాయా అన్నది.