Begin typing your search above and press return to search.

యూట్యూబ్‌లో బిగ్ ఛేంజ్: ఇక వీడియో ప్లే అయితే చాలు.. వ్యూ పడిపోతుంది

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది.

By:  A.N.Kumar   |   18 Aug 2026 4:49 PM IST
యూట్యూబ్‌లో బిగ్ ఛేంజ్: ఇక వీడియో ప్లే అయితే చాలు.. వ్యూ పడిపోతుంది
X

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫామ్‌లో వీడియోల ‘వ్యూ కౌంటింగ్’ విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా క్రియేటర్లు, యూట్యూబ్ షార్ట్స్ రూపకర్తలకు ఈ వార్త ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. రాబోయే ఆగస్టు 24 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్లు సమాచారం.

కొత్త వ్యూ కౌంటింగ్ విధానం అంటే ఏమిటి?

ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఒక వీడియో చూసినట్లు లెక్కించబడాలంటే, యూజర్ కేవలం వీడియోను ఓపెన్ చేయడమే కాకుండా నిర్దిష్ట సమయం కొన్ని సెకన్ల పాటు వీక్షించాల్సి ఉండేది. అయితే ఆగస్టు 24 నుంచి అమల్లోకి రాబోయే కొత్త సిస్టమ్ ప్రకారం, యూజర్ వీడియోను క్లిక్ చేసి ప్లే చేయడం ప్రారంభించిన మరుక్షణమే దాన్ని ఒక వ్యూగా పరిగణిస్తారు. ప్రేక్షకుడు ఆ వీడియోను ఎంతసేపు చూశాడు లేదా మధ్యలోనే స్కిప్ చేశాడా అనే దానితో సంబంధం లేకుండా పబ్లిక్ వ్యూ కౌంట్‌లో ఆ సంఖ్య యాడ్ అయిపోతుంది.

అంతేకాకుండా ఒకే యూజర్ ఒక వీడియోను మళ్లీ రీవాచ్ చేసినప్పుడు కూడా వ్యూ లెక్కించే ప్రక్రియలో మార్పులు తెస్తున్నారు. దీనివల్ల ముఖ్యంగా షార్ట్స్.. తక్కువ వ్యవధి ఉండే వీడియోల పబ్లిక్ వ్యూస్ సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

క్రియేటర్ల ఆదాయం పెరుగుతుందా?

పబ్లిక్ వ్యూ కౌంట్ పెరగడం చూసి క్రియేటర్లకు ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే యూట్యూబ్ తన మానిటైజేషన్ విధానాల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. పబ్లిక్‌గా కనిపించే వ్యూస్ సంఖ్య పెరిగినప్పటికీ క్రియేటర్ల సంపాదనను నిర్ణయించే ప్రమాణాలు మాత్రం పాతపద్ధతిలోనే కొనసాగుతాయి.

యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) అర్హత, యాడ్స్ ద్వారా వచ్చే రాబడిని అంచనా వేయడానికి యూట్యూబ్ ప్రత్యేక మెట్రిక్స్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటుంది. యూజర్లు ఎంత సమయం నిజంగా వీడియోను చూశారు. షార్ట్స్ ఎంతమంది శ్రద్ధగా వీక్షించారు. మానిటైజేషన్‌కు అర్హత పొందిన ప్రామాణిక వ్యూస్ ఏంటన్నది లెక్కిస్తారు.

ఆగస్టు 24 తర్వాత పబ్లిక్‌గా కనిపించే వ్యూస్ సంఖ్యకు, మానిటైజేషన్ కోసం లెక్కించే వ్యూస్‌కు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఏర్పడనుంది. వీడియో రీచ్, పాపులారిటీని అంచనా వేయడానికి పబ్లిక్ వ్యూ కౌంట్ ఉపయోగపడితే.. క్రియేటర్ల అసలు ఆదాయానికి మాత్రం ఎంగేజ్‌మెంట్ ఆధారిత మెట్రిక్స్ మాత్రమే కీలకంగా మారనున్నాయి. మరి ఈ కొత్త విధానం క్రియేటర్ల కంటెంట్ స్ట్రాటజీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి..