సర్...సూపర్ సక్సెస్ - ఆ రాష్ట్రాల్లో ఓకే సార్
ఇక దేశంలో ప్రజాస్వామ్యం మరింతగా పరిఢవిల్లడానికి యువ ఓటర్లే కీలకం అని ఆయన అన్నరు.
By: Satya P | 25 Jan 2026 9:30 AM ISTకేంద్ర ఎన్నికల సంఘం దేశమంతా విడతల వారీగా ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ సర్ ని అమలు చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికి సర్ దేశంలో కొన్ని చోట్ల విజయవంతంగా అమలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో మిగిలిన రాష్ట్రాలలో కూడా సర్ ని అమలు చేస్తామని ఆయన అన్నారు.
ఒక్క ఫిర్యాదూ లేదు :
జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ నెల 25న నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన దేశంలోని ప్రజలకు ఇచ్చిన సందేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. ఈ లక్ష్యంతోనే, అర్హులైన ప్రతి ఓటర్ల పేరును ఓటర్ల జాబితాలో చేర్చడానికి అలాగే ప్రతి అనర్హమైన పేరును తొలగించడానికి ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ సర్ ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిందని చెప్పారు. బీహార్‌లో సర్ విజయవంతంగా పూర్తయిందని అక్కడ తుది ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా ఒక్క అప్పీల్ కూడా దాఖలు కాలేదని ఆయన గుర్తు చేశారు.
పన్నెండు రాష్ట్రాలలో :
ఇక దేశంలో ప్రస్తుతం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో సర్ సజావుగా నిర్వహించబడుతుందని జ్ఞానేష్ కుమార్ అన్నారు. మిగిలిన రాష్ట్రాలలో కూడా సర్ తొందరలో అమలు చేయబడుతుందని చెప్పారు. దేశంలో మరో 16 రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ కూడా సర్ ని అమలు చేసే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధపడుతోంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఓటర్ల జాబితా పవిత్రత విశ్వసనీయతను సర్ ద్వారా మరోసారి స్థాపించగలిగామని ఆయన చెప్పారు.
అన్ని సేవలకి ఒక యాప్ :
ఇక డిజిటల్ యుగంలో దాని అవసరాన్ని గుర్తించి అనుగుణంగా ఈసీఐ నెట్ యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఓటర్ల సేవలను ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులో ఉంచిందని జ్ఞానేష్ కుమార్ అన్నారు. దీని ద్వారా ఎన్నికల కమిషన్ సాంకేతిక నిబద్ధత పరిపాలనా సామర్థ్యాన్ని తెలియచేస్తున్నామని అన్నారు.
యువ ఓటర్లే కీలకం
ఇక దేశంలో ప్రజాస్వామ్యం మరింతగా పరిఢవిల్లడానికి యువ ఓటర్లే కీలకం అని ఆయన అన్నరు. యువ ఓటర్లు తప్పకుండా ఓటు వేయాలని ప్రజాస్వామ్యానికి రాయబారులుగా మారాలని జ్ఞానేష్ కుమార్ కోరారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి ఇతరులను కూడా వారు ప్రోత్సహించాలని అన్నరు. అంతే కాదు ఈసీ మీద వచ్చే తప్పుడు సమాచారం తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా పోరాటానికి యువ ఓటర్లు సిద్ధంగా ఉండాలని జ్ఞానేష్ కుమార్ కోరడం విశేషం.
