షాకింగ్.. 100కోట్ల మందిలో మానసిక రుగ్మత.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే?
ముఖ్యంగా ఈ రుగ్మతల వల్ల ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం తీవ్రంగా ఎదురవుతోందని.. ఉత్పాదకత కోల్పోవడం వల్ల పరోక్షంగా సమాజానికి నష్టమేనని ఆ సంస్థ తెలిపింది .
By: Madhu Reddy | 4 Sept 2025 4:00 PM ISTప్రస్తుత కాలంలో ఎక్కువగా యువత గుండెపోటుతో మరణిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే అయితే ఇలా ఎక్కువగా యుక్త వయసులోనే సమస్యలు రావడానికి కారణం మానసిక రుగ్మతలు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా తేలిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రజలు ఇలా మానసిక రుగ్మతలతోనే బాధపడుతున్నారని.. అందులో యువత ఎక్కువగా ఉన్నారని.. పైగా ప్రతి ఏడుగురిలో ఒకరికి ఈ సమస్య ఉన్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా ప్రకటించింది. వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే, మెంటల్ హెల్త్ అట్లాస్ 2024 పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక విడుదల చేయగా.. ఇందులో చాలామంది యువత డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, ఆందోళన వంటి కారణాలవల్ల బాధపడుతున్నారని, అందుకే యువతలో మరణాలకు ఆత్మహత్య ప్రధాన సమస్యగా కనిపిస్తోందని తెలిపారు. మానసిక సమస్యల వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆర్థికంగా కూడా నష్టం ఏర్పడుతోందని నిపుణులు తెలియజేశారు.
ముఖ్యంగా చాలామంది యువత ఈ మానసిక రుగ్మతలను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారని, అందులో 20 ప్రయత్నాలు తర్వాత ఈ బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ప్రతి 200 మందిలో ఒకరికి స్కిజోఫ్రెనియా, ప్రతి 150 మందిలో ఒకరికి బై పోలార్ డిజార్డర్ సమస్య ఉన్నట్లు తేలింది. అధిక ఒత్తిడి కలగడానికి చాలా కారణాలు ఉన్నాయని.. ముఖ్యంగా డబ్బు సంపాదించాలనే తపన , కుటుంబ వ్యవహారాల, వ్యక్తిగత జీవిత కారణాలు, ఉద్యోగంలో మార్పులు, ఆర్థిక సమస్యలు ఇలా పలు కారణాలు యువతను మానసిక రుగ్మతలకు గురిచేస్తోందని డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో వెల్లడించింది.
ముఖ్యంగా ఈ రుగ్మతల వల్ల ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం తీవ్రంగా ఎదురవుతోందని.. ఉత్పాదకత కోల్పోవడం వల్ల పరోక్షంగా సమాజానికి నష్టమేనని ఆ సంస్థ తెలిపింది .ఇక ఈ నేపథ్యంలోనే మానసిక ప్రజారోగ్య పరిరక్షణ పై ప్రభుత్వాలు వెంటనే దృష్టి సారించి వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ సూచించారు. మరి యువతలో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్యపై తక్షణ పరిష్కారం ఏ విధంగా లభిస్తుందో అని చాలామంది ఎదురుచూస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో యువత ప్రతి చిన్నదానికి డిప్రెషన్ కి లోనవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కావాలనుకున్న ఉద్యోగం రాకపోవడం, ఉద్యోగంలో చేరిన తర్వాత అక్కడ ఏర్పడే సమస్యలు, పై అధికారులతో ఇబ్బందులు.. ఇటు వ్యక్తిగత జీవితంలో కుటుంబ సమస్యలు, లవ్ ఫెయిల్యూర్ , వివాహం అనంతరం భార్య లేదా భర్తతో గొడవలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు తారసపడతాయి. వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోకపోగా ఇలా ఎదుర్కోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి సమస్య ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైంది? అనే విషయాన్ని తెలుసుకోగలిగితే ఇలాంటి మానసిక రుగ్మతలకు చెక్ పెట్టవచ్చు అని మానసిక నిపుణులు చెబుతున్నారు.మరి యువత ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని స్ట్రెస్ ని దూరం చేసుకొని తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలని కోరుతున్నారు.
