డిజిటల్ భారం : కృంగిపోతున్న యంగ్
ఇప్పటి యువత పది మందిలో ఉన్నా ఒంటరిగానే కనిపిస్తున్నారు. ఏదో ఒక మూలన ఉండాలని చూస్తున్నారు. మనసు కూడా అలాగే ఉంటోంది.
By: Satya P | 12 Dec 2025 10:00 PM ISTయువతరం అంటే కొండను పిండి కొట్టేది అని అంటారు. అంత పొటెన్షియాలిటీ వారిలో ఉంటుంది. ఇనుమును కూడా తిని డైజెస్ట్ చేసుకోగల కెపాసిటీ వారిదే. ఈదమంటే సప్త సముద్రాలను సైతం లెక్క చేయకుండా దూకేసే నిజం వారి సొంతం. పాజిటివ్ వైబ్స్ తో ఉరకలెత్తే ఉత్సాహంతో ఎత్తిన జెండా దించని పట్టుదల కూడా యూత్ దే. అలాంటి యూత్ ఇపుడు కృంగుతోంది, వంగుతోంది, లొంగుతోంది. ఎందుకిలా లోపమెక్కడుంది అన్నది కనుక విశ్లేషిస్తే చాలానే కనిపిస్తాయి.
డిజిటల్ యుగంలోనే :
ఒక వైపు అభివృద్ధి సాధించామని గొప్పగా చెప్పుకుంటున్నా డిజిటల్ యుగంలో దూరాలు దగ్గరవుతూ చేతిలోనే ప్రపంచం ఒదిగిపోతున్నా అదంతా ఒక వైపు సంతోషమే అవుతోంది. రెండో వైపు విషాదం గురించి ఆలోచిస్తే భయం పుట్టుకుని వస్తుంది. ముఖ్యంగా యంగర్ జనరేషన్ మీద డిజిటల్ యుగం తెచ్చిన అతి పెద్ద సైలెంట్ వార్ ఏంటి అన్నది చూస్తే కనుక ముప్పు ప్రతీ ఇంట్లోనూ పొంచి ఉంది అనిపిస్తుంది. ఈ భారాలను మోసేది భవిష్యత్తు తరం అని తెలిసినపుడు మరింతగా మధన పడాల్సిన అవసరమూ ఏర్పడుతోంది.
బరువంతా మోస్తూనే :
ఈనాటి యువతరాన్ని ఒక్కసారి పరికిస్తే చాలు ఎన్నో విషయాలు తెలుస్తాయి. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోలోపల వారు మోసే భారాలు ఎవరెస్టు శిఖరాలు అన్నది ఎంతమందికి తెలుసు. ఇంట్లో పేరెంట్స్ బయట సొసైటీ మరో వైపు ఫ్రెండ్స్, చదువుకునే చోట ఫాకల్టీ రూపంలో కెరీర్ లో విపరీతమైన పోటీతో ఇలా ఒత్తిడితో యువత నలిగిపోతోంది. అటూ ఇటూ కాని మనసుతో ప్రతీ క్షణం తనలో తాను యుద్ధమే చేస్తోంది. దాని ఫలితంగా యువతలో మానసిక ఒత్తిడి అయితే పెద్ద ఎత్తున పెరిగిపోతోంది. ప్రతీ విషయంలోనూ పోలికలు తెస్తున్నారు. ప్రపంచం అంతా ఓపెన్ అయిపోయిన నేపథ్యంలో యువత జీవితం వ్యక్తిగతం నుంచి సామూహికం అయిపోయింది. ఎక్కడో ఎవరో సాధించిన విజయం చూసి సగటు యువత మీద తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు. దాంతో పాటు సోషల్ మీడియా ప్రభావం సైతం తోడు అయి యువతరం బంగారం లాంటి భవిష్యత్తు కాస్తా ఇత్తడై చిత్తు అవుతోంది.
ఇవేనా కారణాలు :
ఈనాటి యువతరం ముందు ఉన్న సవాళ్ళూ అన్నీ ఇన్నీ కావు, చదువులో చూసినా పోటీ పడుతోంది. ఒకరికి టాప్ ర్యాంక్ వస్తే చాలు అది ఇంట్లో తమ బిడ్డకు దక్కాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలా ఒత్తిడి బీభత్సంగా పెరుగుతోంది. ఇక కెరీర్ లో చూసినా ఒకరికి మంచి జాబ్ వస్తే చాలు తమ వాడూ ఆ రేసులో టాప్ లో ఉండాలనుకుంటున్నారు దాంతో అది కూడా పెను భారం అవుతోంది.
సోషల్ మీడియా తోనే :
గతంలో అయితే సమాజం అంటే చుట్టు పక్కన వారే కనిపిస్తారు. వారితోనే పోల్చుతూ తన బిడ్డ మీద ఆశలు పెంచి ఒత్తిడి చేసేవారు. సోషల్ మీడియా పుణ్యమాని ఇపుడు అలా కాదు ఎక్కడో ఖండాంతరాల్లో ఎవరో ఏదో సాధించారు అంటే చాలు తమ వాడూ అలాగే ఉండాలనుకుంటున్నారు. ఆ పోలికలు తెచ్చి మరీ డిమాండ్ పెడుతున్నారు. దీంతో పాజిటివ్ నెస్ లేకుండా పోతోంది. అదే సమయంలో నెగిటివ్ కంపారిజన్ కి ఇదంతా దారితీస్తోంది.
ఫ్యామిలీ అండ్ సొసైటీ :
ముందు కుటుంబం నుంచి ఒత్తిడి మొదలవుతుంది. ఆ మీదట సమాజం నుంచి అది మరింత పెరిగి పెద్దది అవుతోంది. అలా యువత మీద మోయలేని టార్గెట్లు పెడుతున్నారు. ఒక విధంగా మనసు మీద టన్నుల కొద్దీ బరువే దించుతున్నారు. దాన్ని అందుకోలేక యువతరం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు, దాంతో వారు ఒక విధంగా కృంగిపోతున్న నేపధ్యం ఉంది.
మారిన జీవన విధానం :
ఈనాటి యువతరాన్ని చూస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. వారి ముఖంలో నిద్ర లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తరచూ ఆవలింతలతో ఏకాగ్రత లేకుండా గడిపేస్తున్నారు దానికి కారణం నిద్ర టైం ని దారుణంగా తగ్గించేసుకోవడమే. అలాగే మంచి ఆహారం తీసుకునే తీరిక ఓపిక అభిరుచి ఆసక్తి కూడా లేకుండా తయారు అవుతున్నారు ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. దాంతో పగలూ రాత్రి తేడా లేకుండా స్క్రీన్ టైమ్ పెంచేస్తున్నారు. దీంతో విపరీత పోకడలతో మారిన జీవనశైలితో యువత మానసికంగా శారీరకంగా కూడా పూర్తిగా డల్ అవుతోంది.
కోపంతో పాటు చిరాకు :
ఈ విధంగా ఉన్న లైఫ్ స్టైల్ తో యువతలో తరచూ కోపం వస్తోంది. అలాగే అయిన దానికీ కాని దానికీ చిరాకు వస్తోంది. ఒక్కోసారి అది పరాకుగా మారుతోంది. అంతే కాకుండా నిరుత్సాహంతో నిండిపోతున్న యువత కనిపిస్తున్నారు. వారు చేసే పని మీద కానీ చదువు మీద కానీ పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు అలాగే నిద్ర లేని రాత్రులు గడుపుతూ జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంటున్నారు.
ఒంటరి బతుకుతో :
ఇప్పటి యువత పది మందిలో ఉన్నా ఒంటరిగానే కనిపిస్తున్నారు. ఏదో ఒక మూలన ఉండాలని చూస్తున్నారు. మనసు కూడా అలాగే ఉంటోంది. ప్రతీ దానికీ అతిగా ఆలోచించడమే కాదు పూర్తిగా నిరాశ నిస్పృహతలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇవన్నీ అత్యంత ప్రమాదకర లక్షణాలుగా మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ లక్షణాలను ఆరంభ దశలో గుర్తించకుండా ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా అవి లాంగ్ టెర్మ్ లో కచ్చితంగా మానసిక ఆరోగ్యంపై భారీ ఎత్తున ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
డిజిటల్ లోకం వీడాల్సిందే :
చిత్రమేంటి అంటే డిజిటల్ యుగంలో పడి కొట్టుమిట్టాడుతున్న యువత అసలైన లోకాన్ని మరచిపోతోంది. వాస్త్వ ప్రపంచం వైపు కన్నెత్తి చూడడంలేదు ఫలితంగా ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోతోంది. ఒక ఒత్తిడితో ఉండే యువత దానిని ఎలా ఎదుర్కోవాలి అన్న దానికి కూడా నిపుణులు పలు సూచనలు చేస్తున్నాఉర్. దాని ప్రకారం డిజిటల్ లైఫ్ నుంచి బయటకు రావాలి. ప్రతీ రోజూ వ్యాయామం చేయాలి. అలాగే ధ్యానం చేయాలి, తమ చుట్టూ ఉన్న వారితో అన్ని విషయాలు మాట్లాడాలి, కుటుంబ సభ్యులతో అన్నీ పంచుకోవాలి. ఫ్రెండ్స్ తో ఎక్కువగా ఉంటూ జీవితం అంటే ఎంటో కూడా చూసి ఆస్వాదించాలి.
తమ గురించి తెలుసుకుని :
అందరికీ అందలాలు ఎక్కాలని ఉంటుంది. అయితే తమలోని అసలైన శక్తి ఏమిటో తెలుసుకోవాలి. అలాగే తమ ఆసక్తులను కూడా స్వయంగా విశ్లేషించుకుని ఆ దిశ్గా వాస్తవ దృక్పధంతో సొంత లక్ష్యాలను ఏర్పాటు చేసుజ్కోవాలి. ఆ మీదట ఆత్మ విశ్వాసం కూడా పెంచుకుని తాము సాధించగలమన్న నమ్మకంతో ముందుకు అడుగులు వేయాలి. మానసిక ఒత్తిడి నుంచి యువత ఎంత త్వరగా బయటపడితే అంతలా జీవితం బంగారం అవుతుంది. ఒత్తిడిలోనే ఉంటూ అందులోనే మునిగితే మాత్రం నిండు జీవితం పూర్తిగా పాతాళానికి జారిపోతుంది. సో యువత తస్మాత్ జాగ్రత్త. జీవితం ఒక వరం అన్నది గుర్తించాలి. ఏది వాస్తవం ఏది భ్రమ అన్నది గ్రహించి మంచి వాతావారణం వైపుగా అడుగులు వేస్తే తామే కాదు తమ కుటుంబాన్ని సమాజాన్ని కూడా ప్రగతిపధంలో తీసుకుని వెళ్ళగలరు.
