షాకింగ్ : లవర్ బర్త్‌డేకి గంజాయితో ఐఫోన్ గిఫ్ట్...!
ప్రేమలో ఉన్న వారికి కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు అంటారు. ప్రేమ వ్యామోహం తో ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో కొందరు ముంటారు.
By: Ramesh Palla | 18 Nov 2025 12:48 PM ISTప్రేమలో ఉన్న వారికి కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు అంటారు. ప్రేమ వ్యామోహం తో ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో కొందరు ముంటారు. ముఖ్యంగా టీనేజ్‌లో లవ్ చేసిన వారు తాము ప్రేమించిన వారి కోసం ఏం చేసేందుకు అయినా రెడీ అన్నట్లుగా సిద్ధంగా ఉంటారు. ఆ సమయంలోనే కొన్ని తప్పులు, నేరాలకు వాళ్లు పాల్పడటం జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తికి గిఫ్ట్‌లు ఇచ్చేందుకు దొంగతనాలు చేయడం, ఇంట్లో వారి డబ్బును కాజేయడం, బయట చిన్న చిన్న దొంగతనాలు చేయడం మనం కామన్‌గా చూస్తూ ఉంటాం. కానీ ఒక ప్రేమికుడు ఏకంగా తాను ప్రేమించిన అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వడం కోసం స్మగ్లింగ్ మొదలు పెట్టాడు. అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు విచారిస్తున్న సమయంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అతడి మాదిరిగా ఇంకా ఎంత మంది ఉన్నారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
22 కేజీల గంజాయితో పట్టుబడ్డ స్టూడెంట్..
పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఒడిశా లోని మల్కాన్ గిరి ప్రాంతంకు చెందిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఏకంగా 22 కేజీల గంజాయితో పట్టుబడ్డాడు. పోలీసులు రెగ్యులర్ చెకప్‌లో భాగంగా అతడి బ్యాగ్ చెక్ చేసిన సమయంలో ఏకంగా 22 కేజీల గంజాయి ప్యాకెట్స్ కనిపించాయి. ఆ మొత్తం గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ గా వందల కొద్ది రెడీ చేసుకుని అమ్మకంకు సిద్ధం అయ్యాడు. కాలేజ్ స్టూడెంట్స్ లక్ష్యంగా అతడు ఈ పని చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీస్ పెట్రోలింగ్ టీం అతడిని పట్టుకుని సోదాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. అతడి వద్ద ఉన్న గంజాయి మార్కెట్ లో లక్షల్లో ధర పలుకుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కాలేజ్ స్టూడెంట్ ఇలా చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అతడిని పోలీసులు లోతుగా ఎంక్వౌరీ చేసి మరింత మంది గంజాయి స్మగ్లర్స్‌ను పట్టుకోవాలని భావిస్తున్నారు.
ప్రేయసికి ఐఫోన్ బహుమానంగా ఇవ్వాలని...
ఆ కాలేజ్ స్టూడెంట్‌ను పోలీసులు విచారించిన సమయంలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. తనకు లవర్ ఉందని, ఆమెకి బర్త్‌డే కానుకగా ఐఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకున్నాను. అందుకోసమే ఇలా గంజాయి స్మగ్లింగ్ దారి పట్టాను అన్నాడు. తాను చాలా కాలంగా గంజాయి స్మగ్లింగ్ చేయడం లేదని, ఇటీవలే ఆమె గిఫ్ట్ కోసం మరో దారి లేక వెంటనే డబ్బు కావాల్సి వచ్చి ఈ దారికి వచ్చాను అన్నాడు. ప్రస్తుతానికి తనకు గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయాలను చెప్పలేదు. కానీ అతడిని పోలీసులు తమదైన శైలిలో విచారించి ఆ విషయాలను కూడా బయటకు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. త్వరలోనే అతడిపై చార్జ్ షీట్ దాఖలు చేస్తామని పోలీసులు స్థానిక మీడియాతో చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి.
గంజాయి మత్తులో యువత..
గంజాయి ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా పెరిగి పోతుంది. ప్రతి రాష్ట్రంలోనూ యువత గంజాయి మత్తులో మునుగుతున్నాయి. స్టూడెంట్స్ ను గంజాయికి అలవాటు చేస్తున్న వారిని పట్టుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఒడిషా లో దొరికింది స్టూడెంట్ కావడంతో పోలీసులు ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఏకంగా స్టూడెంట్స్ సైతం గంజాయి స్మగ్లింగ్ లో దిగితే వారిని పట్టుకోవడం ఎలా అన్నట్లుగా పోలీసు వర్గాల వారు తర్జన బర్జన పడుతున్నట్లు స్థానిక మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ముందు ముందు అయినా గంజాయిని అరికట్టేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ మధ్య గంజాయి గంప్ లు బయట పడ్డ విషయం తెల్సిందే. ఒడిశా లో గంజాయి చాలా కాలంగా విచ్చలవిడిగా పండిస్తున్నారు అనేది టాక్.
