Begin typing your search above and press return to search.

జీవితం చిన్నది.. మనం వదిలివెళ్లే గుర్తులు.. పంచుకునే ప్రేమ శాశ్వతం...

తన చివరి దీపావళిని గురించి ఆ యువకుడు చేసిన వర్ణన హృదయాన్ని మెలిపెట్టేలా ఉంది. "దీపావళి వెలుగులు, నవ్వులు, శబ్దాలు ఈసారి చివరిసారి చూస్తున్నానని తెలిసి హృదయం భారమవుతోంది.

By:  A.N.Kumar   |   16 Oct 2025 9:48 PM IST
జీవితం చిన్నది.. మనం వదిలివెళ్లే గుర్తులు.. పంచుకునే ప్రేమ శాశ్వతం...
X

ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ యువకుడి ఆవేదన అక్షర రూపం దాల్చి, ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇటీవల ఒక రెడిట్ యూజర్ చేసిన భావోద్వేగ పోస్ట్ వేలాది మంది నెటిజన్లను కన్నీరు పెట్టించింది. జీవితం ఎంత క్షణికమైనదో, ఆ జ్ఞాపకాల విలువ ఎంత ముఖ్యమో ఈ పోస్ట్ మనందరికీ గుర్తుచేసింది.

* జీవితంపై విచారకరమైన వీడ్కోలు

"క్యాన్సరే గెలిచింది.. ఇదే నా చివరి దీపావళి" అనే శీర్షికతో ఆ యువకుడు తన కథను పంచుకున్నారు. Twenties India అనే ఖాతా ఈ పోస్ట్‌ను షేర్ చేయగా.. అది తక్షణమే వేల సంఖ్యలో రియాక్షన్లు, కామెంట్లను అందుకుంది.

ఆ యూజర్ తన పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, తాను 2023లో పెద్దపేగు క్యాన్సర్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆ వ్యాధి నాల్గవ దశ (ఫోర్త్ స్టేజ్)కి చేరుకుంది. "గత రెండేళ్లుగా ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నాను. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక ఒక సంవత్సరానికి మించి జీవించలేనని చెప్పారు" అని ఆయన తన దుర్భర పరిస్థితిని వివరించారు.

*దీపావళి వెలుగుల్లో విషాదం

తన చివరి దీపావళిని గురించి ఆ యువకుడు చేసిన వర్ణన హృదయాన్ని మెలిపెట్టేలా ఉంది. "దీపావళి వెలుగులు, నవ్వులు, శబ్దాలు ఈసారి చివరిసారి చూస్తున్నానని తెలిసి హృదయం భారమవుతోంది. నేను లేకపోయినా, నా స్థానంలో ఇంకొకరు దీపాలు వెలిగిస్తారు. అది కూడా ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందేమో" అని రాశారు.

* తీరని కోరికల చిట్టా

జీవితంలో నెరవేర్చుకోలేని తన తీరని కోరికలను కూడా ఆయన ప్రస్తావించారు. "ప్రపంచం చుట్టిరావడం, నా సొంత వ్యాపారం ప్రారంభించడం, ఒక శునకాన్ని పెంచుకోవడం... ఇవన్నీ కలలుగానే మిగిలిపోయాయి." అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఇంట్లో తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నానని, బహుశా ఈ పోస్ట్ రాసింది తాను పూర్తిగా కనుమరుగయ్యేలోపు తన గుర్తులను వదిలిపెట్టడానికే కావచ్చు అని పేర్కొన్నారు.

* నెటిజన్ల స్పందన: ధైర్యమే నీ ఆయుధం

ఈ భావోద్వేగ కథనంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చాలామంది ఆ యువకుడి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించారు. కొందరు అద్భుతం జరిగి ఆయన కోలుకోవాలని ప్రార్థించగా, మరికొందరు ఆశను కోల్పోవద్దంటూ ప్రోత్సహించారు. "జీవితం ఎంత క్షణికమో ఈ పోస్ట్‌ గుర్తుచేస్తోంది" అని ఒకరు కామెంట్‌ చేయగా, "మేమందరం నీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాం, దయచేసి ధైర్యంగా ఉండు" అంటూ మరొకరు అండగా నిలిచారు.

ఆ యువకుడి పోరాటం మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. జీవితం చిన్నదైనా, మనం వదిలివెళ్లే గుర్తులు, మనం పంచుకునే ప్రేమ శాశ్వతం.