Begin typing your search above and press return to search.

దుస్తులు విప్పేసిన మాజీ అధ్యక్షుడు.. ఈ నిరసన ఎందుకంటే..!

అవును... ఎమర్జెన్సీ ప్రకటించి జైలు పాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  Raja Ch   |   2 Aug 2025 11:24 AM IST
దుస్తులు విప్పేసిన మాజీ  అధ్యక్షుడు.. ఈ నిరసన ఎందుకంటే..!
X

గతేడాది డిసెంబరులో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 'ఎమర్జెన్సీ మార్షల్‌ లా' విధించి అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌. అనంతరం జైలు పాలయ్యారు. ఈ క్రమంలో ఆయనపై పలు కేసులు నమోదవ్వగా.. అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో మరోసారి మాజీ అద్యక్షుడి ప్రవర్తన హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఎమర్జెన్సీ ప్రకటించి జైలు పాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన చేసిన పనులకు ఇప్పటికే పలు కేసులు నమోదవ్వగా.. అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విచారణకు హాజరయ్యేందుకు నిరాకరిస్తూ.. తాజాగా అధికారుల ముందు దుస్తులు విప్పేసి అర్ధనగ్నంగా నేలపై పడుకున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఈ ఏడాది ఏప్రిల్‌ లో అభిశంసనకు గురై పదవి నుంచి దిగిపోయిన యూన్‌ సుక్‌ యోల్‌ పై పలు అవినీతి కేసులు నమోదయ్యాయి. దీంతో గత నెల ఆయనను అరెస్టు చేయగా.. ప్రస్తుతం సియోల్‌ లోని ఓ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో.. అవినీతి కేసుల్లో ఆయనను విచారించాలని కొత్త అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఈ నేపథ్యంలో... ప్రత్యేక అధికారుల బృందం కోర్టు నుంచి డిటెన్షన్‌ వారెంట్‌ తీసుకొని జైలుకు చేరుకుంది. పైగా... విచారణకు సహకరించకపోతే బలవంతంగానైనా డిటెన్షన్‌ సెంటర్‌ కు తీసుకెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ విచారణకు హాజరయ్యేందుకు మాజీ అధ్యక్షుడు నిరాకరించారు. ఈ సమయంలో వినూత్నంగా నిరసన తెలిపారు.

ఇందులో భాగంగా.. అధికారులు రాగానే మాజీ అధ్యక్షుడు జైలు యూనిఫామ్‌ తొలగించి అర్ధనగ్నంగా నేలపై పడుకొని నిరసన తెలిపారు. దీంతో ఒక్కసారిగా షాకైన అధికారులు.. ఇంక చేసేదేం లేక అక్కడినుంచి వెనుదిరిగారు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన ఏమీ తప్పుచేయకపోతే ఎందుకు విచారణకు సహకరించడం లేదు అనే వాదన తెరపైకి వచ్చింది.

కాగా... ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. గతేడాది డిసెంబరులో నాడు అధ్యక్షుడి హోదాలో ఉన్న యూన్‌ 'ఎమర్జెన్సీ మార్షల్‌ లా' విధించిన సంగతి తెలిసిందే. దీంతో... తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వెంటనే తన ప్రకటనను విరమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.