దేశ మాజీ అధ్యక్షుడికి 5 ఏళ్ల జైలు... రాజకీయాల్లో ప్రకంపనలు..
దక్షిణ కొరియా ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ అధ్యక్షుడు కటకటాలపాలయ్యారు.
By: A.N.Kumar | 17 Jan 2026 12:00 AM ISTదక్షిణ కొరియా ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ అధ్యక్షుడు కటకటాలపాలయ్యారు. గత ఏడాది దేశంలో అశాంతికి కారణమైన ‘మార్షల్ లా’ సైనిక పాలన విధింపు ఉదంతంలో మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
తీర్పుకు దారితీసిన ప్రధాన అంశాలు
గత కొంతకాలంగా కొనసాగుతున్న విచారణలో యూన్ సుక్ యోల్‌పై ఉన్న పలు కీలక ఆరోపణలు రుజువయ్యాయి. అధికార దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా మార్షల్ లా విధించేందుకు ప్రయత్నించడం... నిబంధనలకు విరుద్ధంగా పత్రాలను సృష్టించడం.. తనను అరెస్టు చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడం.. దర్యాప్తుకు సహకరించకపోవడంతో ఈ అభియోగాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు, దేశ అత్యున్నత పదవిలో ఉండి చట్టాన్ని ఉల్లంఘించడం క్షమించరాని నేరమని పేర్కొంటూ ఈ శిక్షను ఖరారు చేసింది. దీంతో దక్షిణ కొరియా చరిత్రలో పదవిలో ఉండగానే అరెస్టయిన తొలి అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ నిలిచారు.
‘రాజద్రోహం’ కేసుపైనే అందరి కళ్లు!
తాజా తీర్పుతో ఐదేళ్ల శిక్ష పడినప్పటికీ యూన్ సుక్ యోల్‌కు గండం ఇంకా గడవలేదు. ఆయనపై నమోదైన అత్యంత తీవ్రమైన ‘రాజద్రోహం’ కేసు విచారణ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఈ కేసులో ప్రాసిక్యూటర్లు అత్యున్నత శిక్ష అయిన మరణశిక్షను కోరడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. "ఈ కేసుపై ఫిబ్రవరిలో తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ రాజద్రోహం రుజువైతే ఆయనకు మరణశిక్ష పడే అవకాశాలను కొట్టిపారేయలేం " అని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రజాస్వామ్య విజయంగా విశ్లేషకులు
ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి పడిన శిక్ష మాత్రమే కాదని దక్షిణ కొరియాలో చట్టం ముందు అందరూ సమానమే అనే అంశాన్ని నిరూపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మాజీ అధ్యక్షుడైనా సామాన్యుడైనా చట్టానికి అతీతుడు కాదన్న సందేశం ప్రపంచానికి అందింది. సైనిక పాలనను అడ్డుకోవడంలో అక్కడి వ్యవస్థలు చూపిన చొరవను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి.
ప్రస్తుతానికి యూన్ సుక్ యోల్ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడటమే కాకుండా ఆయన జీవితం జైలు గోడల మధ్యే గడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో రాబోయే 'రాజద్రోహం' తీర్పు దక్షిణ కొరియా రాజకీయ దిశను మార్చే అవకాశం ఉంది.
