టెకీ మరణంపై సీఎం యోగి సీరియస్.. ఉన్నతాధికారిని పదవి నుంచి తొలగింపు
ఐటీ ఉద్యోగి మరణంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు.
By: Garuda Media | 20 Jan 2026 10:37 AM ISTఐటీ ఉద్యోగి మరణంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. ఈ ఉదంతంపై సిట్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయటంతో పాటు.. ఐదు రోజుల్లో రిపోర్టు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో కీలక అధికారిని పదవి నుంచి తప్పించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ పాలనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..
గత శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న ఐటీ ఉద్యోగి యువరాజ్ మెహతా.. నోయిడా సెక్టార్ 150 వద్ద ప్రమాదానికి గురయ్యాడు. అతను వెళుతున్న దారిలోని నిర్మాణ స్థలంలో ఉన్న గుంత నీటితో నిండిపోయింది. అతను ప్రయాణిస్తున్న కారు అందులో పడిపోయింది. అతన్ని రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఆలస్యం కావటంతో.. ఊపిరి ఆడక అతను మరణించాడు.
అదే సమయంలో అతను గుండెపోటుకు గురయ్యాడని.. అందుకే మరణించినట్లుగా అటాప్సీ రిపోర్టు పేర్కొంది. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అధికారుల పని తీరు ఎంత నిర్లక్ష్యంగా ఉందన్న దానికి నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపించాయి. తన కుమారుడి మరణానికి ప్రభుత్వ పని తీరు కారణమంటూ యువరాజ్ తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్థానికులు సైతం పెద్ద ఎత్తున ప్రభుత్వ పని తీరును విమర్శించారు.
గతంలోనూ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకున్నా.. రక్షణ చర్యలు తీసుకోలేదని.. ఈ నిర్లక్ష్యమే యువరాజ్ ప్రాణాల్ని తీసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో.. ప్రభుత్వ పని తీరు మీద వస్తున్న విమర్శల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సీరియస్ అయ్యారు. యువరాజ్ మరణంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించటంతో పాటు.. ఐదు రోజుల్లో ఇందుకు సంబంధించిన రిపోర్టును తనకు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అదే సమయంలో నోయిడా అథారిటీ సీఈవోను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదంతం యూపీలో ఇప్పుడు సంచలనంగా మారింది.
