బీజేపీ అధ్యక్షుడిగా యోగి?
ఇపుడు ఎక్కడ చూసినా యోగీ ఆదిత్యనాధ్ పేరు మారుమోగుతోంది. బీజేపీకి ఆయన ఆశాకిరణంగా కనిపిస్తున్నారు అని అంటున్నారు.
By: Satya P | 2 Aug 2025 12:09 PM ISTఇపుడు ఎక్కడ చూసినా యోగీ ఆదిత్యనాధ్ పేరు మారుమోగుతోంది. బీజేపీకి ఆయన ఆశాకిరణంగా కనిపిస్తున్నారు అని అంటున్నారు. మీడియాకు పెద్దగా రాని యోగి ఇపుడు మీడియాలో తెగ నలుగుతున్నారు. ఇదంతా ఎందుకు ఏమిటి అన్నదే చాలా ఆసక్తిని కలిగిస్తోంది. మోడీ ప్రధానిగా ఉండగానే యోగీ పేరు వారసుడిగా తెర పైకి వస్తోంది. మోడీ చేతిలో ఇంకా నాలుగేళ్ళ పాటు అధికారం ఉంది. మరి యోగీని జాతీయ రాజకీయాల్లోకి ఎపుడు తీసుకుని వస్తారు అంటే దానికే ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహ రచన సాగుతోంది అని అంటున్నారు.
బీజేపీ అధ్యక్ష పీఠంపైన :
బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఎందరో ఉద్ధండులు అధిరోహించారు. వాజ్ పేయ్ అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి వారు పార్టీ సారధ్యాన్ని నిర్వహించారు. ఇపుడు జాతీయ అధ్యక్ష పీఠం అయితే కొత్త నేత కోసం ఎదురుచూస్తోంది. జేపీ నడ్డా కాలపరిమితి ముగిసిపోయింది అయినా ఆయనే కంటిన్యూ అవుతున్నారు. మరి కొత్త సారధిగా ఎవరు వస్తారు అన్న దాని మీద చర్చ అయితే తీవ్రంగానే ఉంది. ఈ నేపధ్యంలో యోగీ పేరు ఈ కీలక పదవి విషయంలో వినిపించడం విశేషం.
బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య గ్యాప్ :
ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ. బీజేపీ నేతలు అంతా దాదాపుగా అందులో నుంచి వచ్చిన వారే ఉంటారు.అలాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీలకు మధ్య గ్యాప్ ఉందా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలు అయితే బీజేపీని కలవరపెడుతున్నాయి. ఇక ఆర్ఎస్ఎస్ కి మోడీని దింపేయాలని ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నిజంగా మోడీకి ఆర్ఎస్ఎస్ కి మధ్య అంత అంతరం ఎందుకు ఏర్పడింది అన్నది మరో చర్చగా ఉంది.
మోడీకి వయసు దెబ్బ :
ఈ మధ్యనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవంత్ ఒక సంచలన ప్రకటన చేశారు. 75 ఏళ్ళు నిండిన వారు రాజకీయాల నుంచి హుందాగా తప్పుకోవాలని ఆయన అందులో సూచించారు. మోడీకి చూస్తే సెప్టెంబర్ తో 75 ఏళ్ళు పూర్తి అవుతాయి. దాంతో ఆయన మీదనే గురి పెట్టి మరీ ఈ తరహా ప్రకటన చేసి ఉంటారా అన్న చర్చ సాగుతోంది. ఇక 75 ఏళ్ళకు రాజకీయాలకు దూరం అన్న నిబంధన గతంలో బీజేపీలో పెట్టి పెద్ద నాయకులు చాలా మందిని పక్కన పెట్టేశారు. మోడీ వచ్చిన తరువాతనే అది జరిగింది. మరి బీజేపీలో నిబంధనలు అన్నీ అందరికీ సమానంగానే ఉండాలని ఆర్ఎస్ఎస్ అంటోంది అని చెబుతున్నారు.
అమిత్ షా తోనూ పడదా :
ఇంకో వైపు చూస్తే ఆర్ఎస్ఎస్ కి కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షాకి కూడా పడటం లేదు అన్న వార్తలు వినవస్తున్నాయి. కేంద్రంలో మోడీ ప్రధానిగా ఉన్నా ప్రభుత్వంలో అసలైన చక్రం తిప్పుతోంది అంతా అమిత్ షాయే అన్నది కూడా ప్రచారంలో ఉంది. ఇక పార్టీ సైతం అమిత్ షా నియంత్రణలోనే చాలా ఏళ్ళుగా ఉంది ఈ విధంగా అత్యంత శక్తిమంతుడుగా అమిత్ షా కాషాయ దళంలో ఉన్నారు అయితే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం చూస్తే వ్యక్తులు ఎపుడూ బలవంతులుగా ఉండరు, వ్యవస్థ మాత్రమే బలంగా ఉంటుంది. దానికి భిన్నంగా బీజేపీ పోకడలు సాగడంతోనే అమిత్ షాతోనూ ఆర్ఎస్ఎస్ కి పడడం లేదని అంటున్నారు.
ఢిల్లీ సీఎం దగ్గర మొదలు :
ఢ్ల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాకు చాన్స్ వచ్చింది. అది ఎలా అంటే ఆర్ఎస్ఎస్ వల్లనే అని అంటున్నారు. నిజానికి ఈ కీలక పదవి విషయంలో మోడీ అమిత్ షా ఆలోచనలు వేరుగా ఉన్నాయని చెబుతున్నారు బీజేపీలో ఉన్న వారిలో ఒకరిని ఎంపిక చేయాలని మోడీ అమిత్ షా చూస్తే ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పి రేఖా గుప్తాకు దక్కేలా చూసింది. అది ఒక ఎపిసోడ్ మోడీ షా వర్సెస్ ఆర్ఎస్ఎస్ గా సాగింది అని అంటున్నారు
బీజేపీ పీఠం పైన చిక్కుముడి :
బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠం మీద ఎవరిని కూర్చోబెట్టాలి అన్న దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ అయితే సంఘ్ నుంచి వచ్చిన వారికే ఇవ్వాలని అంటోంది. బీజేపీ పెద్దలైన మోడీ అమిత్ షా మదిలో వేరే పేర్లు ఉన్నాయట. ఒక మహిళను తెచ్చి ఆ పదవిలో కూర్చోబెడితే సంఘ్ ని ఆ విధంగా నియంత్రించగలమని మోడీ షా వ్యూహరచన చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇపుడు మరో ప్రచారం వెలుగు చూస్తోంది.
యూపీ వంటి దేశానికి గుండెకాయ లాంటి పెద్ద స్టేట్ కి సీఎం గా ఉన్న యోగీని తప్పించాలని చాలా కాలంగా మోడీ షాలు చూస్తున్నారు అని ప్రచారంలో ఉంది ఇపుడు ఆయననే ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని చేయడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారుట. ఆర్ఎస్ఎస్ వ్యక్తి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్న సంఘ్ మాట నెగ్గించినట్లు అవుతుంది అలాగే యూపీ సీఎం పదవి నుంచి యోగీని తప్పించినట్లు అవుతుందని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ ప్రచారం కనుక నిజమైతే మాత్రం యోగీ యూపీకి టాటా చెప్పేయాల్సిందే అని అంటున్నారు.
