యోగి రచ్చ: 'వందేమాతరం' పాడడమే ఛటర్జీకి నివాళా?!
తాజాగా యూపీలో నిర్వహించిన ఐక్యతా యాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి యోగి ఈ మేరకు ప్రకటన చేయడం రాజకీయ వివాదానికి దారితీసింది.
By: Garuda Media | 10 Nov 2025 3:24 PM ISTవందేమాతరం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం. ముఖ్యంగా కేంద్రం సహా బీజేపీ పాలిత (ఎన్డీ యే కాదు) రాష్ట్రాల్లో ప్రస్తుతం వందేమాతరం గేయం.. ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేసి.. కొత్త రచ్చకు తెరదీశారు. రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలు(క్రిస్టియన్-మైనారిటీ సంస్థలు కూడా) వందేమాతరం గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేశారు.
తాజాగా యూపీలో నిర్వహించిన ఐక్యతా యాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి యోగి ఈ మేరకు ప్రకటన చేయడం రాజకీయ వివాదానికి దారితీసింది. వందేమాతరం పట్ల ఎవరికీ అభ్యంతరం లేదు. దీనిని విద్యా ర్థి దశ నుంచి అమలు చేయాలన్న వారు కూడా ఉన్నారు. కానీ, నిర్బంధంగా దీనిని అనుసరించాలని పేర్కొనడం వివాదానికి దారి తీసింది. ఇక, యోగి ప్రకటన సారాంశం చూస్తే.. వందేమాతరం గేయం ఖచ్చితంగా పాడాల్సిందే. లేకపోతే.. విద్యాసంస్థలపై చర్యలు తప్పవని.. జీవో కూడా ఇస్తామని చెప్పారు.
దీంతో అసలు వందేమాతరం గేయం ఆలపించడమే ఈ గేయాన్ని రాసిన బంకిం చంద్ర ఛటర్జీకి నివాళి అర్పించడమా? అనేది ప్రశ్నగా మారింది. దీనిని పలువురు మేధావులు కూడా ప్రశ్నిస్తున్నారు. ''సుజలాం .. సుఫలాం.. మలయజ సీతలాం. సశ్యశ్యామలాం..'' అంటూ.. ఆసేతు హిమాచలంలోని వనరులను ప్రజలకు అందించాలన్న స్ఫూర్తిని వందేమాతరం చాటుతోందన్నది మేధావులు చెబుతున్న మాట. కానీ, ప్రస్తుత బీజేపీ పాలిత ప్రభుత్వాలు.. వనరులను పెద్దలకు, కార్పొరేట్లకు సొంతం చేస్తున్నాయని విమర్శిస్తున్నారు.
అంతేకాదు.. 'సుహాసిని.. సుమధుర భాషిణి' అన్న పంక్తులను కూడా ప్రస్తావిస్తున్నారు. అందరినీ ఒకటిగా చూడాలన్న స్ఫూర్తి ఈ పంక్తులు చాటుతున్నాయని.. కానీ.. కులాలు, మతాలుగా విడదీసి.. నాయకులు చేస్తున్న యాగీ మాటేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వందేమాతరం స్ఫూర్తి అంటే.. దీనిని ఆలపించి.. నోరు పుక్కిలించుకోవడం కాదని.. ముందు నాయకులు దీని నుంచి ఎంతో నేర్చుకుని స్వేచ్ఛ, సమానత్వం, వనరుల పంపిణీ విషయంలో స్ఫూర్తిని పొందాలని మేధావులు చెబుతున్నారు.
