Begin typing your search above and press return to search.

యోగీ పవర్ ఫుల్ ట్రైనింగ్...పీఎం సీటు కోసమేనా ?

అసలే యూపీ పెద్ద రాష్ట్రం. అందునా ముఖ్యమంత్రి. క్షణం తీరిక ఉండదు. కానీ యోగీ తలచుకుంటే ఏమైనా చేయగలరు.

By:  Satya P   |   31 July 2025 11:00 PM IST
యోగీ పవర్ ఫుల్ ట్రైనింగ్...పీఎం సీటు కోసమేనా ?
X

ఆదిత్యనాథ్ యోగీ. యూపీ వంటి దేశంలో అతి పెద్ద రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా ఈ మధ్యనే కొత్త రికార్డు నెలకొల్పారు. రెండుసార్లు వరసగా ఉత్తరప్రదేశ్ సీఎం గా వ్యవహరిస్తూనే జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం గా పదమూడేళ్ళు పాలించిన తరువాత జాతీయ రాజకీయాల్లోకి వచ్చి అపుడు ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ యోగీ అలా కాదు యూపీ సీఎం గా ఉండగానే జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థి ఆయనే అన్నంతగా మీడియాలో నలుగుతున్నారు.

కఠోరమైన శిక్షనంతా :

అసలే యూపీ పెద్ద రాష్ట్రం. అందునా ముఖ్యమంత్రి. క్షణం తీరిక ఉండదు. కానీ యోగీ తలచుకుంటే ఏమైనా చేయగలరు. అందుకే ఆయన తన దిన చర్యలో కొంత సమయాన్ని వేరేగా కేటాయించేశారు. దేనికి అంటే కఠోరమైన శిక్షణ కోసమట. ఆ శిక్షణ ఏమిటి అన్నదే అందరిలో ఆసక్తి అయితే ఎందుకు అన్నది మరో ఆసక్తి యోగ ప్రతి రోజూ సైకాలజీ, సోషియాలజీ, విదేశీ వ్యవహారాలు. భాషా నిపుణుల బృందంతో క్రమం తప్పకుండా శిక్షణ గట్టిగానే తీసుకుంటున్నారు అని అంటున్నారు.

ఎనిమిదేళ్ళుగా లేనిది ఇలా :

ముఖ్యమంత్రిగా గత ఎనిమిదేళ్ళుగా ఎలాంటి శిక్షణా లేకుండానే బాగానే పాలిస్తున్న యోగీ ఉన్నట్టుండి ఈ శిక్షణ ఎందుకు తీసుకుంటున్నారు అని అంతా ఆలోచిస్తున్నారు. పైగా విదేశీ వ్యవహారాలు సైకాలజీ ఇత్యాది అంశాలు ఇపుడు ఆయనకు ఎందుకు అవసరం అయ్యాయని కూడా చర్చిస్తున్నారు. అయితే యోగీకి ఉత్తరాది హిందీ బాగా వచ్చు. కానీ అది సరిపోదు అని భాషా నిపుణులతో మంచి భాషనే నేరుస్తున్నారుట. అంతే విదేశీ వ్యవహారాల మీద కూడా పూర్తి అవగాహన పెంచుకుంటున్నారుట. అంటే సీఎం కంటే పెద్ద పోస్ట్ కోసమే ఈ శిక్షణ అంతా అని అంటున్నారుట.

ఆర్ఎస్ఎస్ సంకేతాలు ఇచ్చిన వేళ :

అటు చూస్తే ఆర్ ఎస్ ఎస్ సంకేతాలు ఇచ్చేసింది. ఏడున్నర పదులు నిండిన వారు ఎవరూ రాజకీయంగా క్రియాశీలంగా ఉండవద్దు అని చెప్పేసింది. హుందాగా తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల కుండ బద్ధలు కొట్టారు. ఈ రోజు దేశాన్ని ఏలుతున్న ప్రధాని మోడీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంతా అనుకుంటూ వస్తున్నారు. ఈ సెప్టెంబర్ లో మోడీకి అక్షరాలా 75 ఏళ్ళు నిండుతాయి. దాంతో మోడీని కనుక కాదు అనుకుంటే బీజేపీకి కొత్త ప్రధాని ఎవరు అన్న చర్చ ఉండనే ఉంది. ఆ అన్వేషణలో వినిపిస్తున్న మొదటి పేరే యోగీది.

ప్రిపరేషన్ అంతా దానికేనా :

మరి యోగీ ఇపుడు తీసుకుంటున్న శిక్షణ చూస్తే కనుక ఆయన పీఎం సీటు కోసమేనా అన్న చర్చ సాగుతోంది. అనూహ్యంగా ప్రధాని పీఠం వరించి వస్తే దానిని నిభాయించాలి అంటే చాలా విషయాల మీద అవగాహన ఉండాలి కదా అన్నదే అంతా అంటున్నారు. హిందీలో ప్రసంగాలు దంచి కొట్టే యోగీ ఆంగ్లంలోనూ ప్రావీణ్యం సంపాదిస్తున్నారు అని అంటున్నారు. అలాగే ప్రపంచ విషయాలను కూడా గమనంలోకి తీసుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి మోడీ వారసుడిగా హిందూత్వ నినాదాల వరకే కాదు పాలనలోనూ తనదైన శైలితో ముందుకు సాగిపోవడానికి ఆయన మాదిరిగా విదేశాల్లో పర్యటిస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి యోగీ ఈ రోజు నుంచే పట్టు సంపాదిస్తున్నారు అని అంటున్నారు.

బీజేపీతో గ్యాప్ ఉన్నా :

మరో వైపు చూస్తే బీజేపీకి ఆర్ఎస్ కి చాలా విషయాల్లో గ్యాప్ ఉంది అని అంటున్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వం అవసరం లేదని కొందరు నేతలు బాహాటంగానే ఇటీవల వ్యాఖ్యానించారు. అయినా సరే ఆర్ఎస్ఎస్ పునాది. మాటలు ఎన్ని చెప్పినా చివరికి పైచేయి ఆర్ఎస్ఎస్ దే అవుతుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కొత్త ప్రధానిగా యోగీని తెర మీదకు తీఅవడానికి ఆర్ఎస్ఎస్ చూస్తోందా అన్నదే చర్చగా ఉంది. అందులో భాగమే ఈ శిక్షణా అంటే అవును అన్నది ప్రస్తుతానికి అయితే అనుకోవాల్సిందే.