Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీ వేదాలు నేర్చుకోవాలా...ఎందుకలా ?

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వేదాలు నేర్చుకోవాలని బీజేపీ అంటోంది.

By:  Satya P   |   25 Aug 2026 9:32 AM IST
రాహుల్ గాంధీ వేదాలు నేర్చుకోవాలా...ఎందుకలా ?
X

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వేదాలు నేర్చుకోవాలని బీజేపీ అంటోంది. ఆయనకు భారతీయ సంస్కృతి గురించి తెలియదని బీజేపీ విమర్శిస్తోంది. అంతే కాదు భారతీయ గ్రంధాలు ప్రాచీన రచనలు పురాణాల గురించి పెద్దగా అవగాహన లేదని కూడా నిందిస్తోంది. అందుకే రాహుల్ గాంధీ ముందు నాలుగు వేదాలు చదివితే ఆయనకు అన్నీ అర్ధం అవుతాయని అపుడు విషయ పరిజ్ఞానంతో మాట్లాడే సామర్థ్యం ఎంతో కొంత వస్తుందని కమలం పార్టీ ఆశిస్తోంది. అంతే కాదు మనువు గురించి మను సంస్కృతి గురించి రాహుల్ గాంధీ తెలుసుకోవాలంటే అధర్వ వేదం, శతపథ బ్రాహ్మణం, మత్స్య పురాణం వంటి ప్రాచీన గ్రంధాలను చదవాలని కోరుతోంది. రాహుల్ గాంధీకి ఇంతటి సలహా ఇచ్చింది ఎవరో కాదు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి. ఆయన రాహుల్ గాంధీ మీద తాజాగా యూపీలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాహుల్ హాట్ కామెంట్స్ :

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ మహారాష్ట్రలో పూణెలో చాత్రోం కీ గూంజ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో తాజాగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మను స్మృతి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనుస్మృతి ప్రకారం మహిళలకు స్వేచ్ఛ ఎక్కడా లేదని రాహుల్ ఎత్తి చూపించారు. చిన్న తనంలో తండ్రి, తరువాత భర్త చివరి దశలో పిల్లల రక్షణలో ఉండమని మను స్మృతి బోధిస్తుందని ఆయన తప్పు పట్టారు. తాను ఇలాంటి భావనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అని రాహుల్ గాంధీ అన్నారు ఇది మహిళా లోకానికి సిగ్గు చేటు అని కూడా ఆయన అంటూ ఆగ్రహించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా మహిళలకు జైలులో బంధించాలని చూస్తూంటాయని రాహుల్ గాంధీ రాజకీయ విమర్శలు కూడా చేశారు. దీని మీదనే యూపీ సీఎం యోగి రాహుల్ గాంధీ మీద మండిపడ్డారు.

రాహుల్ మీద ఆశలు లేవు :

రాహుల్ గాంధీ మీద ఈ దేశానికి పెద్దగా ఆశలు లేవని యోగి కామెంట్స్ చేశారు. అయితే ఆయన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడాలని యోగి సూచించారు. మాట్లాడే ముందు ఏ విషయం మీద అయినా అవగాహన ముఖ్యమని కూడా యోగి చెప్పారు. భారతీయ సంప్రదాయాలను సంకృక్తిని తప్పుదోవ పట్టించేలా రాహుల్ వ్యాఖ్యానిస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యమంగా ఆయన యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు అని నిందించారు.

రాహుల్ వ్యూహం ఇదే :

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ వేదాలు చదవడం కాదు బీజేపీ నేతలే ఆధునిక భారతాన్ని చదవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాహుల్ అయితే జెన్ జీ తరం ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించుకుంటున్నారు అని గుర్తు చేస్తున్నారు. మరో వైపు చూస్తే రాహుల్ గాంధీ పాత పద్ధతుల మీద ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద విమర్శలు పెద్ద ఎత్తున ఎక్కుబెట్టడం ద్వారా జెన్ జీని దగ్గర చేసుకోవాలని వ్యూహంతో ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ మీద కానీ ఆర్ఎస్ఎస్ మీద కానీ తీవ్ర విమర్శలు చేస్తే వారి నుంచి ఘాట్ అయిన రియాక్షన్ వస్తుంది. దాంతో ఇదీ వారి విధానం అని మరింతగా చూపించవచ్చు అన్నదే కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి బీజేపీ హిందుత్వను నమ్ముకుని రాజకీయాలు చేసే అనివార్యత ఉందా లేదా అన్నది పక్కన పెడితే రాహుల్ విమర్శలతో ఆ వైపుకే చూడాల్సి వస్తోంది. మరి బీజేపీకి గడచిన ఎన్నికల్లో హిందూత్వ లైన్ భారీ విజయాలను అందించింది. జెన్ జీ దూకుడు నేపథ్యంలో ఇపుడు బీజేపీకి ఆ విధంగా సాగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.