Begin typing your search above and press return to search.

జగన్ ను బుక్ చేస్తున్న సోషల్ మీడియా.. సరైన వ్యూహం లోపిస్తోందా?

సోషల్ మీడియా తన ఉనికి చాటుకుంటున్న సమయంలో పురుడు పోసుకున్న వైసీపీ తన రాజకీయ ఎదుగుదలకు సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వాడుకుంది.

By:  Tupaki Political Desk   |   5 Oct 2025 3:00 AM IST
జగన్ ను బుక్ చేస్తున్న సోషల్ మీడియా.. సరైన వ్యూహం లోపిస్తోందా?
X

వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు సరైన వ్యూహం లోపిస్తోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్రుత, ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తమ అధినేతనే అబాసు పాలు చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించాల్సిన సోషల్ మీడియా విభాగంపై వైసీపీ అధినాయకత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సివుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అవగాహన లోపమో లేక తొందరపాటుతోనో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తున్న ప్రచారం వల్ల అధినేత అబాసుపాలు అవుతున్నారని పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ తరఫున సోషల్ మీడియా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా తన ఉనికి చాటుకుంటున్న సమయంలో పురుడు పోసుకున్న వైసీపీ తన రాజకీయ ఎదుగుదలకు సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వాడుకుంది. సుశిక్షితులైన సైనికుల మాదిరిగా సోషల్ మీడియా కార్యకర్తలను తీర్చిదిద్దింది. 2014-19 మధ్య వైసీపీలో సీనియర్ నేతలను మించిన రీతిలో సోషల్ మీడియా సైనికులే అప్పటి ప్రభుత్వంతో యుద్ధం చేశారు. దీని ఫలితం 2019లో వైసీపీ అందుకుందని చెబుతున్నారు. అయితే ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని ఇష్టారీతిన వదిలేయడంతో కొన్ని అపసవ్య విధానాలకు చోటుచ్చినట్లైందని అంటున్నారు. అధికారం ఉందన్న ధీమాతో సోషల్ మీడియాను ఇష్టానుసారం వాడటం, అసభ్య, అవాంఛిత కంటెంట్ కు పార్టీ వాల్స్ ను వాడుకోవడం వల్ల పార్టీ సోషల్ మీడియా విభాగం తీవ్ర విమర్శల పాలైందన్న వాదన ఎక్కువగా వినిపించింది.

దీనిఫలితం వల్లే 2024 ఎన్నికల్లో వైసీపీ తీవ్ర పరాజయానికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2019-24 మధ్య అలవాటైన కంటెంట్ ను కొందరు వదులుకోకపోవడం వల్ల ఎన్నికల తర్వాత తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. అరెస్టులై జైలుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో చిక్కుకున్నారని చెబుతున్నారు. ఈ పరిణామాల తర్వాత వైసీపీ అధినాయకత్వం తమ కేడర్ కు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎవరూ సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దని తరచూ చెబుతూనే వస్తోంది. ఇటీవల అధినాయకత్వం అప్రమత్తం చేస్తున్న పోస్టులు వైసీపీ సోషల్ మీడియా వాల్స్ పై కనిపించాయి. అయితే ఇదే సమయంలో కొందరు తమ అధినేతపై ఉన్న అభిమానంతో చేస్తున్న ప్రచారం పార్టీకి నష్టం చేస్తుందని అంటున్నారు.

ఇందుకు తాజాగా కొన్ని ఉదాహరణలు చూపుతున్నారు. రాజధాని అమరావతిలో భారీ పెట్టుబడులు పెట్టడాన్ని తొలినుంచి వ్యతిరేకిస్తున్న వైసీపీ.. ఆ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరదలపై ఫోకస్ చేసింది. ఈ సందర్భంగా అలవాటుగా ఇతర ప్రాంతాల చిత్రాలను వాడి అసత్య ప్రచారం చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఫొటోలు, వీడియోలు ఎంపిక విషయంలో పార్టీ వింగు సరైన శ్రద్ద పెట్టకపోవడం వల్లే ప్రభుత్వం నుంచి ఎదురుదాడి ఎదుర్కోవాల్సివచ్చిందని అంటున్నారు. ఇక తాజాగా ఆసియాకప్ క్రికెట్ పోటీల సందర్భంగా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మతో జగన్ ఫొటో వైరల్ చేశారు. నిజానికి ఇంతవరకు జగన్, తిలక్ వర్మ ఎక్కడా కలవకపోయినా, ఆడుదాం ఆంధ్రాలో తిలక్ వర్మకు జగన్ బహుమతి ఇచ్చినట్లు ఓ ఫొటోను వైరల్ చేశారు. ఇది కూడా తీవ్ర విమర్శల పాలైంది. ఇది సరైన అవకాశంగా చేసుకుని వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని ప్రభుత్వం అనుకూల మీడియా ఎదురుదాడి చేసింది. దీనివల్ల పార్టీ అధినేత జగన్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిందని అంటున్నారు.

ఇదంతా వైసీపీ సోషల్ మీడియా విభాగం వైఫల్యంగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో సోషల్ మీడియా గ్రూపును సరైన దిశానిర్దేశం లేకుండా నడుపుతుండటం వల్ల అధినేత జగన్ టార్గెట్ అవుతున్నారని, ఆయనకు తెలియకుండా జరిగిన పొరపాట్లకు కూడా జగన్ బలి కావాల్సివస్తోందని అంటున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన వైసీపీ సోషల్ మీడియా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికైనా పార్టీ అధినాయకత్వం వైసీపీ సోషల్ మీడియా విభాగంపై ద్రుష్టి పెట్టకపోతే మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.