Begin typing your search above and press return to search.

జిల్లాలు మౌనం...వైసీపీలో ఏం జరుగుతోంది ?

వైసీపీ విపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి నిశ్శబ్దమే తాండవిస్తోంది. పార్టీ అధినాయకత్వం దిశా నిర్దేశం చేస్తూనే ఉంది.

By:  Satya P   |   5 Aug 2025 5:00 PM IST
YCP in Silence Internal Struggles Ground-Level Gaps
X

వైసీపీ విపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి నిశ్శబ్దమే తాండవిస్తోంది. పార్టీ అధినాయకత్వం దిశా నిర్దేశం చేస్తూనే ఉంది. కానీ జిల్లాల్లో మాత్రం నాయకులు మౌన వ్రతం పాటిస్తున్నారు. పార్టీ ఆదేశాలను వారు మొక్కుబడిగా తీసుకుంటున్నారు. వైసీపీ అధినాయకత్వం అయితే మొత్తం 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అంతే కాదు పార్టీ కార్యక్రమాలను ఎక్కడికక్కడ ఎవరికి వారే రూపొందించుకోవాలని సూచించింది. స్థానిక సమస్యల ఆధారంగా ప్రజా సమస్యల మీద నిరంతర పోరాటం చేయాలని కోరింది.

నిరాశగానే సీన్ ఉందా :

అయితే వైసీపీ అధినాయకత్వం నమ్మి పార్టీ పదవులు అప్పగించినా కూడా చాలా మంది మాత్రం వాటిని అలంకారప్రాయంగా చూస్తున్నారు అని అంటున్నారు. కొన్ని చోట్ల అయితే అధినాయకత్వం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చినా వాటిని పెద్దగా చేసేందుకు ముందుకు రాలేదని అంటున్నారు. ఎటు చూసినా నిరాశగానే సన్నివేశం కనిపిస్తోంది అని అంటున్నారు. తమ ప్రాంతాలలో బలంగా ఉన్న కూటమి ప్రభుత్వాని ఎదిరించడానికి వైసీపీ నేతలు సిద్ధంగా లేరని అంటున్నారు. పైగా ఎవరికి వారు సొంత వ్యాపారాలు వ్యవహారాలలో బిజీగా ఉన్నారని అంటున్నారు.

నివేదికలు చేరాయా :

జిల్లాలలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో అని వైసీపీ అధ్యయనం చేయించిన నివేదికలు ఇపుడు అధినాయకత్వం వద్దకు చేరాయని అంటున్నారు. చాలా చోట్ల అయితే జిల్లాల బాధ్యులు చురుకుగా లేరని క్రియాశీలంగా కనిపించడం లేదని నివేదికల సారాంశంగా ఉంది అని అంటున్నారు. దాంతో క్యాడర్ కూడా నిస్తేజంగా ఉందని చెబుతున్నారు. దీంతో వైసీపీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో ఆలోచనలో పడినట్లుగా చెబుతున్నారు.

పూర్తి స్వేచ్చ ఇచ్చినా :

మీకు మీరే పార్టీ యజమానులు. మీదే పార్టీ అని అధినాయకత్వం స్పష్టంగా చెప్పింది. మీరు పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళాలి. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంది. దానిని అందిపుచ్చుకోవాలని కూడా సూచించారు. హైకాండ్ వైపు చూడవద్దని పై నుంచి ఆదేశాలు వచ్చేంతవరకూ ఆగవద్దని కూడా స్పష్టంగానే చెప్పారని అంటున్నారు. పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలు అన్నీ పూర్తి చేసి ప్రతీ జిల్లాలో పార్టీని ధీటుగా నిలబెట్టాలని హైకమాండ్ కోరుతోంది. కానీ చాలా చోట్ల అయితే ఇవేమీ పెద్దగా జరగలేదని చెబుతున్నారు.

భారీ మార్పులు ఖాయమా :

ఈ నేపథ్యంలో నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్న హైకమాండ్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది అని అంటున్నారు. పార్టీ బాధ్యతల పట్ల పెద్దగా ఆసక్తి లేని వారు చురుకుగా జనంలోకి వెళ్ళలేని వారిని పక్కన పెట్టి అంకితభావంతో పనిచేసే వారికి నిబద్ధతో ఉండేవారికి చోటు కల్పించాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. చాలా జిల్లాల్లో చూస్తే మాజీ మంత్రులు సీనియర్ నేతలకే పార్టీ పగ్గాలు అప్ప్పగించారు. మరి వీరిలో పార్టీ ఆదేశానుసారం పార్టీ నమ్మకం ప్రకారం పనిచేయని వారు ఉంటే కనుక వారిని తప్పించి కొత్తవారికి యువతకు చాన్స్ ఇస్తారని అంటున్నారు.

గ్రౌండ్ లెవెల్ లో అలా :

అయితే నాయకత్వాలు ఎంత మార్చినా గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీస్ వేరుగా ఉన్నాయని అంటున్నారు. తమ వ్యాపారాలు వ్యవహారాలు వదులుకుని ఎవరూ ముందుకు రాని పరిస్థితి అని అంటున్నారు పైగా కూటమి చేతిలో నాలుగేళ్ళ అధికారం ఉంది. దాంతో ఎదురు నిలిచి గట్టిగా పోరాడితే అనవసర ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం పట్ల అనుకున్నంత వ్యతిరేకత అయితే లేదని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీలో ఎలా ఉంది అంటే అధినేత జగన్ బయటకు వస్తేనే పార్టీ కనిపిస్తోంది. లేకపోతే గప్ చుప్ అన్నట్లుగానే సీన్ ఉంది అని అంటున్నారు.