డిఫెన్స్ మోడ్ లోనే వైసీపీ...షేక్ చేస్తున్న టీడీపీ
వైసీపీ రాజకీయ పార్టీగా అవతరించి ఏకంగా పదిహేనేళ్ళు అయింది. పార్టీ మొత్తం అధినేత జగన్ చుట్టూ అల్లుకుని ఉంది.
By: Satya P | 4 Aug 2025 9:35 AM ISTవైసీపీ రాజకీయ పార్టీగా అవతరించి ఏకంగా పదిహేనేళ్ళు అయింది. పార్టీ మొత్తం అధినేత జగన్ చుట్టూ అల్లుకుని ఉంది. జగన్ అవేశం ఆలోచనలు ఆయన ఇమేజ్ ఆయన విధానాలు ఆయన వ్యవహార శైలి ఇవన్నీ వైసీపీ రాజకీయ పార్టీ వ్యక్తిత్వంగా స్థిరపడిపోయాయి. రాజకీయంగా వైసీపీకి భారీ విజయాలు దక్కవచ్చు. అలాగే దూకుడుగా ముందుకు సాగవచ్చు. కానీ వైసీపీ అఫెన్సివ్ మోడ్ లో పాలిటిక్స్ చేయడం మాత్రం ఇప్పటిదాకా అలవరచుకోలేకపోయింది అన్న్న విశ్లేషణలు ఉన్నాయి.
బాబు రాజకీయ చాణక్యం :
వైసీపీని చంద్రబాబు ఎపుడూ తక్కువ అంచనా వేయలేదు. అదే రాజకీయ అధినేత ప్రధాన లక్షణం అని కూడా అంటారు. వైఎస్సార్ మరణం తరువాత జగన్ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా పాలిటిక్స్ ఎమెర్జ్ అవుతారని ముందుగానే ఊహించి బాబు తనదైన శైలిలో పావులు కదుపుతూ వచ్చారు. వైసీపీని కట్టడి చేయడానికి టీడీపీ ఏకంగా జగన్ మీదనే శరసంధానం చేస్తూ వచ్చింది.
తొలి ఎన్నికల్లో సానుభూతి :
వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నది తొలిసారిగా 2014లో భారీ పోరుకు తలపడింది. అంతకు ముందు ఉప ఎన్నికలు జరిగిన చోట్ల వైసీపీ పైచేయి సాధించింది. దాంతో 2014 నాటికి టీడీపీ పదునైన వ్యూహంతో బరిలోకి దిగింది. లక్ష కోట్ల అవినీతి జగన్ అంటూ చేసిన భారీ ప్రచారాన్ని వైసీపీ ఏ మాత్రం కాచుకోలేకపోయింది. విజయవంతంగా తిప్పికొట్టడమే కాదు ఎదురుదాడి చేయాల్సిన చోట కూడా ఆ దూకుడు చూపించలేకపోయింది. అయితే వైఎస్సార్ మీద ఉన్న సానుభూతి జగన్ జైలులో నెలల తరబడి ఉంటూ బయటకు రావడం ఆ పార్టీలో లక్షలాది మంది వైఎస్సార్ అభిమానుల కసి అన్నీ కలసి వైసీపీకి 2014 ఎన్నికల్లో 67 ఎమ్మెల్యే సీట్లు అందినాయి. అలా విజయానికి దగ్గరగా వైసీఎపీ నిలిచింది.
అదే పోరు రిపీట్ :
ఇక 2019 ఎన్నికల్లో చూసుకుంటే అదే పోరు పునరావృత్తం అయింది. జగన్ చేతిలో అధికారం కడు ప్రమాదకరం అంటూ టీడీపీ ఎంతగానో ప్రచారం చేసింది. బాబాయ్ వివేకా గొడ్డలి పోటు వ్యవహారం కూడా తెర మీదకు తెచ్చి హూ కిల్డ్ బాబాయ్ అని కూడా విగరస్ గా ప్రచారం చేశారు. అయితే జగన్ కి ఒక్క చాన్స్ ఇవ్వాలన్న జనాల ఆలోచనల ముందు ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. ఈ సమయంలో కూడా టీడీపీ చేసిన ఆరోపణల మీద వైసీపీ ఘాటుగా ధాటీగా రిప్లై ఇవ్వలేకపోయింది అన్నది అంతా విశ్లేషించారు. ఆ తరహా మెకానిజం అయితే వైసీపీకి లేదని అదే తీరని లోటు అని కూడా అంటూ వచ్చారు.
జనాల మైండ్ సెట్ తో పాలిటిక్స్ :
జనాల మైండ్ సెట్ తో పాలిటిక్స్ చేయడం ఏమిటో వైసీపీకి ఇంకా అర్ధం కాలేదని అంటున్నారు. తమ మీద వచ్చిన ఆరోపణలను సన్న సన్నగా వివరణ ఇచ్చుకుంటూ ముందుకు సాగిపోవడమే తప్ప టీడీపీని ఈ రోజుకీ డిఫెన్స్ లో పడేసే వ్యూహాలను వైసీపీ పెద్దగా రూపొందించలేకపోయింది అని అంటున్నారు దాని వల్లనే వైసీపీ విషయంలో నిజాలతో పాటు నిందలు కూడా అనేకం పడి ఆ పార్టీ కొన్ని సెక్షన్లకు దూరం అయిందన్న విశ్లేషణలు ఉన్నాయి.
అత్యంత క్లిష్ట సమయం :
గతంలో జరిగినది వేరు ఇపుడు జరుగుతున్నది వేరు అని అంటున్నారు. 2024 ఎన్నికల తరువాత వైసీపీకి ఘోర ఓటమి ప్రాప్తించింది. ఇక వైఎస్సార్ చరిష్మా తో పాటు సానుభూతి అన్నది పెద్దగా ఉండదనే అంటున్నారు. అలాగే ఒక్క చాన్స్ అంటూ తీసుకుని జగన్ పాలన చేశారు. దానిని జనాలు చూశారు. ఈ నేపధ్యంలో వైసీపీ ఘోర పరాజయం నుంచి బయటపడి పుంజుకోవాలంటే పాత పద్ధతుల్లలోనే డిఫెన్స్ మెకానిజంతో సాధ్యపడదని అంటున్నారు. తమ మీద పడుతున్న బురదను తుడుచుకుంటూ పోవడం తో సరిపెట్టకుండా ప్రత్యర్ధులను రాజకీయంగా దూకుడుగా సవాల్ చేసే వ్యూహాలను అమలు చేయాలని అంటున్నారు.
అలా కనుక చేయలేకపోతే కనుక ఈసారి టీడీపీ వ్యూహం నూరు శాతం సక్సెస్ అవుతుందని వైసీపీ అందులో పడి ఇబ్బందుల పాలు అవుతుందని అంటున్నారు. జాతీయ స్థాయిలో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా రాజకీయలు అఫెన్సివ్ మోడ్ లోనే సాగుతున్నాయి. ప్రత్యర్ధులు ఒకటి అంటే రెండు అంటూ వారిని ఉక్కికి బిక్కిరి చేసే స్ట్రాటజీతోనే అంతా సాగుతున్నారు. వైసీపీలో అంతా దేవుడు చూసుకుంటాడు, ప్రజలు చూసుకుంటారు అన్న విధానంలో సాగితే మాత్రం ఇక్కట్లు తప్పవని అంటున్నారు.
