వైసీపీ ఎమ్మెల్యేలను మాజీలు చేసేందుకు రంగం సిద్ధం ?
నిజానికి ఎవరైనా ఎమ్మెల్యే అయ్యేది అధ్యక్షా అన్న పిలుపు కోసమే. అసెంబ్లీకి వస్తేనే ఎమ్మెల్యే హోదా దర్జా అన్నది అందరికీ తెలుస్తుంది.
By: Satya P | 25 Sept 2025 3:00 AM ISTవైసీపీ ఎమ్మెల్యేల విషయంలో ఈ మధ్యనే హోం మంత్రి అనిత ఒక వ్యాఖ్య చేశారు. ఈసారి వైసీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు దురదృష్టవంతులు అని. వారు సభకు హాజరు కాలేకపోతున్నారు. ప్రజలకు ఏమీ చేయలేక పోతున్నారు అని ఆమె అన్నారు. సరిగా అదే నిజం అన్నట్లుగానే పరిస్థితి అయితే ఉంది అంటున్నారు. నిజానికి ఎవరైనా ఎమ్మెల్యే అయ్యేది అధ్యక్షా అన్న పిలుపు కోసమే. అసెంబ్లీకి వస్తేనే ఎమ్మెల్యే హోదా దర్జా అన్నది అందరికీ తెలుస్తుంది. పైగా ప్రజా సమస్యలను ప్రస్తావించడం ద్వారా తమ నియోజకవర్గం ప్రజలకు కూడా తాము చేసింది చెప్పుకునేందుకు వీలు అవుతుంది. కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ చాన్స్ అయితే లేదు అని అంటున్నారు.
అసెంబ్లీకి రాకుండానే :
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అరవై నెలలలో పదిహేను నెలల కాలం ఈ విధంగానే పోయింది. సభకు రాకుడానే వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. అధినేత వైఎస్ జగన్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకు ప్రాణ సంకటంగా మారింది. అందులో కొందరు సీనియర్ ఎమ్మెల్యేలను జనంలో పలుకుబడి ఉన్న వారిని పక్కన పెడితే కొత్తగా గెలిచిన వారి పరిస్థితి అగమ్య గోచరం అవుతోంది అనీ అంటున్నారు. వారు తమ పనితీరుని నిరూపించుకుంటేనే మళ్ళీ గెలవగలరు. అలాంటిది సభకు రాకుండా ఉంటే జనాలకు ఏమి చేశామని చెప్పుకుంటారు అన్నది కీలకమైన ప్రశ్న. దాంతోనే చాలా మంది మధన పడుతునారు అని అంటున్నారు.
సంతకాలు చేశారా :
మరో వైపు చూస్తే తమ సభ్యత్వం పోతుందని అనర్హత వేటు పడుతుందని భావించి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే రిజిష్టర్ లో సంతకాలు చేశారు. దీని మీద కూడా ఏకంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడే సభలో ప్రస్తావించారు. సభకు గౌరవంగా రావచ్చు కదా ఎందుకు అలా వెనకాల సంతకాలు పెట్టి వెళ్తున్నారు అని కూడా అన్నారు. దీని మీద అప్పట్లో చర్చ కూడా సాగింది. ఇపుడు అలాంటి వారిని గుర్తించే పనిలో ఉన్నారని అంటున్నారు.
యాక్షన్ కి రెడీ :
తాజాగా చూస్తే ఎథిక్స్ కమిటీ సమావేశం అయి ఇదే అంశం మీద చర్చించింది అని అంటున్నారు. అసెంబ్లీకి రాకుండానే సంతకాలు రిజిష్టర్ లో పెట్టిన ఎమ్మెల్యేల గురించి అంతా డిస్కషన్ అయింది అని అంటున్నారు. అలాంటి వారిని గుర్తించారు అని అంటున్నారు. అలా సభకు రాకుండా సంతకాలు చేయడం నైతిక విలువల ప్రకారం కూడని పని కాబట్టి ఎథిక్స్ కమిటీ వీరి విషయంలో చర్యలకు సిఫార్సు చేస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే వీరి మీద వేటు వేయడానికే కూటమి ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది అని అంటున్నారు.
ఇదే అంశాన్ని జనంలోకి బలంగా తీసుకోపోవడం ద్వారా ఆయా ఎమ్మెల్యేల తప్పుని బాగా వివరించి జనాల చేతనే అవును అనిపించేలా చేసుకుని వేటు వేస్తారు అని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి అంటే డిసెంబర్ లో జరిగే శీతాకల సమావేశాల నాటికి కొందరు వైసీపీ ఎమ్మెల్యేల మీద వేటు పడుతుంది అని ప్రచారం అయితే సాగుతోంది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉనిద్.
