ప్రచారం ఎందుకు.. తేల్చేయండి: జగన్ కఠిన నిర్ణయం
వైసీపీలో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తారు అనే చర్చ గత వారం పది రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
By: Garuda Media | 30 July 2025 11:00 PM ISTవైసీపీలో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తారు అనే చర్చ గత వారం పది రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో జగన్ మోహన్ రెడ్డిని పక్కన పెడితే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే రాజీనామా చేసేస్తారని. అసెంబ్లీకి వెళ్లే విషయంలో. అదేవిధంగా విపక్షంగా వైసిపి సరైన పాత్ర పోషించటం లేదని భావిస్తున్న పరిస్థితుల్లో వీరంతా ఉన్నారని, అందుకే ముకుమ్మడిగా రాజీనామాలు చేసి జగన్‌కు షాక్ ఇచ్చే దిశగా ఎమ్మెల్యేలు అడుగులు వేస్తున్నారన్నది ఓ వర్గం మీడియాలో వస్తున్న కథనాలను బట్టి అర్థమవుతుంది.
అయితే పదిమంది ఎమ్మెల్యేలలో కూడా జగన్‌కు అత్యంత సన్నిహితులు, కావలసినవారు అయిదు ఆరుగురు వరకు ఉన్నారు. మిగిలిన వారిలో ఒకళ్ళు ఇద్దరు వెళ్లిపోయినా పెద్దగా ఇప్పుడు జగన్ కి ఒరిగే నష్టం కానీ వైసీపీకి ఎదురయ్యే ఇబ్బందులు కానీ ఏమీ కనిపించడం లేదు. అయినా మూకుమ్మడి రాజీనామాలు చేస్తారంటూ ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారంపై జగన్ కూడా దృష్టి పెట్టారు. ఇదే విషయాన్ని వైసిపి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రశ్నించారు.
మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని వార్తలు వస్తున్నాయి ఏంటి దీనికి కథ అని సరదాగా ఆయన ప్రశ్నించడంతో సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా గొల్లున నవ్వి ఊరుకున్నారు. అంటే ఇది అవాస్తవ కథనం అనేది పరోక్షంగా ఒప్పుకున్న మాట. కానీ క్షేత్రస్థాయిలో నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా రాజకీయాల్లో ఏదో ఒకటి లేకుండా ఇటువంటి కథనాలు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి వైసీపీలోనే అంతర్గతంగా ఏదో జరుగుతుంది అనేది వాస్తవం. ఈ విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు.
''అధికారంలో ఉన్నప్పుడే నేను ఎవరిని ఆపలేదని, ఎవరికి వారికి స్వేచ్ఛ ఉంటుంద''ని ఆయన వ్యాఖ్యానించటం ద్వారా మరోసారి వెళ్లేవారు వెళ్ళిపోవచ్చు అనే సంకేతాలను ఇచ్చినట్టు అయింది. మరి ఎంతమంది ఉంటారు ఎంతమంది వెళ్తారు అనేది రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత కానీ స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. కానీ.. ఈ విషయంలో జగన్ మాత్రం పక్కా వ్యూహంతోనే ఉన్నారు. పోయే వారిని పట్టుకున్నా ఉండరని ఆయన నిర్ణయానికి వచ్చేశారు. దీంతోనే ఆయన తేల్చేసే విధంగా వ్యాఖ్యానించారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
