వైసీపీ ప్రోగ్రాం సక్సెస్...కానీ వాళ్ళు రాలేదు !
ప్రకాశం జిల్లాలో ఇంచార్జిలు క్యాడర్ ని పెద్ద ఎత్తున తీసుకుని రాలేకపోయారు. ఈ జిల్లాలో క్యాడర్ అయితే అంత దూకుడుగా లేదా అన్నది చర్చగా ఉంది.
By: Satya P | 11 Aug 2026 2:02 PM ISTవైసీపీ గత రెండేళ్ళలో ఎన్నడూ లేని విధంగా జనం బాట పట్టింది. ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. నిరసనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీ ఒక ఇష్యూని పట్టుకుని ఇంత సుదీర్ఘంగా ఆందోళన చేసిన దాఖలాలు అయితే గతంలో లేవు. కానీ మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ దూకుడు చేస్తోంది. అక్రమాలు జరిగాయని అంటూ ఏకంగా టీడీపీ కూటమిలో అతి ముఖ్య నాయకుడు, విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకేష్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఒక విధంగా చెప్పాలీ అంటే గట్టిగానే టార్గెట్ చేసింది. దాంతో ఏపీలో పది రోజులుగా వైసీపీ నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో వాటి ప్రభావం ఎలా ఉంది, జనాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది కనుక చూస్తే వైసీపీ ప్రోగ్రాం సక్సెస్ అని అంటున్నారు. కానీ అని అక్కడే ఆగిపోతున్నారు.
వైసీపీకి ఇదే ఫస్ట్ టైం :
ఇక వైసీపీ 2024 తరువాత ఘోరంగా ఓటమి చెంది 11 సీట్లకే పరిమితం అయిన తరువాత గడచిన రెండేళ్ళ కాలంలో చేపట్టిన అనేక ఆందోళనలు నిరసనలతో పోలిస్తే మెగా డీఎస్సీ మీద ఆ పార్టీ చేపట్టిన పోరాటం మాత్రం హైలెట్ అని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ప్రోగ్రాం బాగానే సాగింది. ఒక్క ప్రకాశం జిల్లాలో తప్పించి అన్ని చోట్ల సక్సెస్ అయింది అని అంటున్నారు. మరి ఇంతలా అన్ని చోట్ల వైసీపీ ప్రోగ్రాం సక్సెస్ అయితే ఒక్క ఆ జిల్లాలోనే ఎందుకు అలా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
ప్రకాశంలో ఎందుకంటే :
ప్రకాశం జిల్లాలో ఇంచార్జిలు క్యాడర్ ని పెద్ద ఎత్తున తీసుకుని రాలేకపోయారు. ఈ జిల్లాలో క్యాడర్ అయితే అంత దూకుడుగా లేదా అన్నది చర్చగా ఉంది. అలాగే ఇంచార్జిలే తమ జోరుని చూపించలేకపోయారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇంకో వైపు చూస్తే వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు జనాలు అన్ని చోట్ల పోటెత్తారు. అలాగే చాలా కాలం తరువాత వైసీపీ క్యాడర్ లో ఉత్సాహం కనిపించింది. అలాగే వైసీపీ నాయకులు కూడా అంతా కలసి హుషార్ గా పాల్గొనడం కూడా జరిగింది. అదే సమయంలో మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెబుతున్న అభ్యర్థులు కానీ నిరుద్యోగులు కానీ యువత కానీ ఈ మొత్తం ఆందోళనలో ఎక్కడా కనిపించకపోవడమే ఒక లోటుగా చెబుతున్నారు.
అదే కారణమా అంటూ :
మరి వారు ఎందుకు పాల్గొనలేదు అంటే దానికి రీజనబుల్ గా వచ్చే సమాధానం కూడా ఉంది. తాము వచ్చి వైసీపీ చేసే ఆందోళనలలో పాలుపంచుకుంటే కెమెరాలకు చిక్కితే తమ భవిష్యత్తు ఎక్కడ ఇబ్బంది పడుతుందో అన్న ఆలోచనతోనే వారు వెనక్కి ఉండిపోయారు అని అంటున్నారు. ఒక రాజకీయ పార్టీ చేపట్టే ఆందోళనలో పాలు పంచుకుంటే తమకు మళ్ళీ జాబ్స్ రావు అన్న బెంగ కూడా వారికి ఉండడం వల్లనే ఎక్కడా కనిపించకుండా తెర వెనక్కే ఉండిపోయారు అని అంటున్నారు. అయితే ఎవరి కోసం ఈ కార్యక్రమం వైసీపీ చేసిందో వారు కానీ యువత కానీ కనిపించకపోవడం మాత్రం ఆ పార్టీకి మైనస్ గానే మారింది అని అంటున్నారు. దీంతో వైసీపీ నిరసనలకు జనాల నుంచి మంచి స్పందన వచ్చినా కూడా అసలైన వారు డీఎస్సీ రాసిన అభ్యర్ధులు ఎక్కడా కనిపించకపోవడంతో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్లుగా వైసీపీ ప్రోగ్రాం తయారైంది అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ వరకూ చూస్తే మాత్రం ఈ నిరసనలు హిట్ అయి మంచి బూస్ట్ ఇచ్చాయనే అంటున్నారు.
