వైసీపీ కమిటీలు...డెడ్ లైన్ ఇచ్చినా ?
వైసీపీలో బూత్ లెవెల్ దాకా కమిటీలు వేయాలని అధినాయకత్వం పార్టీ నేతలను కోరుతోంది.
By: Satya P | 13 Jan 2026 5:00 PM ISTవైసీపీలో బూత్ లెవెల్ దాకా కమిటీలు వేయాలని అధినాయకత్వం పార్టీ నేతలను కోరుతోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను ఎనాడో పార్టీ నియమించింది. అంతే కాదు పాతిక దాకా ఉన్న లోక్ సభ సీట్లకు కూడా ఇంచార్జిలను నియమించారు. ప్రతీ రీజియన్ కి ఒక కో ఆర్డినేటర్ ని వేశారు. అలాగే రీజనల్ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్లు అని అన్ని అనుబంధ విభాగాలకు నియమించారు ఇదే స్ట్రక్చర్ తో బూత్ లెవెల్ దాకా కమిటీలు వేయాలని అధినాయకత్వం కోరుతోంది. అయితే ఆ దిశగా యాక్టివ్ గా ఎంత మంది ఉన్నారు అన్నదే చర్చగా ముందుకు వస్తోంది.
నర్శీపట్నం ఫస్ట్ :
ఇక ఏపీలోనే నర్సీపట్నం నియోజకవర్గం బూత్ లెవెల్ దాకా కమిటీలు వేసి ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది. జగన్ ఈ విషయంలో వైసీపీ నియోజకవర్గం ఇంచార్జి పెట్ల ఉమాశంకర్ గణేష్ ని అభినందించారు. ఇదే స్థాయిలో అందరూ పనిచేసి తొందరగా కమిటీల ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా ఉంటే మిగిలిన వాటి విషయంలో దృష్టి పెట్టాలని వైసీపీ భావిస్తోంది.
సభ్యత్వ నమోదు కూడా :
కమిటీల ప్రక్రియ ఒకసారి పూర్తి అయితే సభ్యత్వ నమోదు ని పూర్తి చేసి ఆ మీదట బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీని కదం తొక్కించాలన్నది వైసీపీ పెద్దల ఆలోచన. అయితే కమిటీలు పూర్తి చేసే పనిలో మాత్రం నేతలు ఎందుకో నెలలు గడిపేస్తున్నారు. నియోజకవర్గం మండలాలు, గ్రామాలు వార్డులు బూత్ లెవెల్ దాకా కమిటీలు వేయాలని అంటున్నారు. వేలాది మంది క్యాడర్ కి ఈ విధంగా పదవులు వస్తాయని కూడా అధినాయకత్వం చెబుతోంది. పనిచేసే వారికి పెద్ద పీట వేయాలని కూడా సూచిస్తోంది. కానీ ఆచరణలో మాత్రం ఆలస్యం అలా జరుగుతూనే ఉంది.
జిల్లాలలో కదలిక :
పార్టీ అధినాయకత్వం పదే పదే సూచించడంతో జిల్లాల స్థాయిలో నాయకత్వాలు ముందుకు కదులుతున్నాయి. తమ జిల్లా పరిధిలో ఏ నియోజకవర్గంలో ఎన్ని కమిటీలు పూర్తి చేశారు ఏమిటి అన్నది సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజాగా చూస్తే అటు రాయలసీమ నుంచి ఇటు గోదావరి జిల్లాల దాకా వైసీపీ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం గురించే చర్చ సాగింది అని చెబుతున్నారు. కమిటీలను తొందరగా పూర్తి చేయడమే కాకుండా వాటిని డిజిటలైజేషన్ చేయాలని కూడా పార్టీ పెద్దలు సూచిస్తున్నారు.
గుర్తింపు కార్డుతో :
ఇక వైసీపీలో ఉన్న ప్రతీ సభ్యుడికీ గుర్తింపు కార్డుని ఇవ్వాలని కూడా నిర్ణయించారు. దాని వల్ల పార్టీలో పనితీరుని ఎప్పటికపుడు బేరీజు వేసుకుని రేపటి రోజున కార్యకర్తలను కానీ తృతీయ శ్రేణి ఆ తరువాత శ్రేణులకు చెందిన నాయకులకు అవకాశాలు ఇవ్వాలని కూడా పార్టీ భావిస్తోంది. దాంతో కమిటీల కూర్పు అన్నది ఇపుడు పెద్ద చర్చగా మారుతోంది. మరో వైపు కమిటీల ఏర్పాటు పూర్తి అయితే జగన్ జిల్లా పర్యటనలు కూడా ఉంటాయని అంటున్నారు. మరి ఎక్కడ ఆలస్యం అంటే నాయకుల దగ్గరే అని చెబుతున్నారు. కమిటీలు వేయడానికి జాప్యం ఎందుకు జరుగుతోంది ఎవరికి ఉత్సాహం తగ్గింది, అధినాయకత్వం ఆదేశాలను ఎందుకు పెద్దగా పట్టించుకోవడం లేదు అన్నదే ఇపుడు సాగుతున్న చర్చగా ఉంది.
