సిక్కోలు భారం మొత్తం ధర్మాన సోదరులపైనే.. రిస్కులో తమ్మినేని, దువ్వాడ ఫ్యూచర్
ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో స్థానిక ఎన్నికలలో పార్టీ కేడర్ ను ముందుండి నడిపించాల్సిందిగా మాజీ మంత్రులు ధర్మాన సోదరులను ఆదేశించినట్లు చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 29 Sept 2026 4:00 AM ISTస్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విపక్షం వైసీపీ రాజకీయాలు అత్యంత ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానంగా పార్టీలోని రాష్ట్రస్థాయి నాయకులకు జిల్లాల బాధ్యతలు అప్పగిస్తున్న పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఎన్నికల భారం మొత్తం ఆ నాయకులపైనే మోపుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో స్థానిక ఎన్నికలలో పార్టీ కేడర్ ను ముందుండి నడిపించాల్సిందిగా మాజీ మంత్రులు ధర్మాన సోదరులను ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో జిల్లా పార్టీలో ధర్మాన వ్యతిరేకుల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లుగా మారిందని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీకి కింజరాపు కుటుంబం సారథ్యం వహిస్తుండగా, వారికి వ్యతిరేకంగా వైసీపీలో ధర్మాన సోదరులు పనిచేస్తున్నారు. కింజరాపు కుటుంబం తొలి నుంచి టీడీపీలోనే ఉంటూ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతుండగా, ధర్మాన సోదరులు ముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున రాజకీయాలు నడుపుతున్నారు. అయితే ఈ రెండు కుటుంబాల్లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఎదుటివారు అవగాహనతో పనిచేస్తారని జిల్లాలోని ఇతర నాయకులు విమర్శలు చేస్తుంటారు. ఇటువంటి వారిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బహిరంగ విమర్శలు చేస్తే, మిగిలిన వారు అంతర్గత సంభాషణల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తుంటారని పరిశీలకులు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఇతర నేతల విమర్శలు, ఆరోపణలను కొట్టిపడేస్తూ జిల్లా పార్టీ బాధ్యతలను సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు కృష్ణదాస్ కు అప్పగించారని జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. ఇటీవల కాలంలో తమను రాజకీయంగా తొక్కేస్తున్నారనే ఆవేదనతో సీనియర్ నేత ధర్మానపై మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం కుమారుడు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. పలుమార్లు ఆమదాలవలస ఎమ్మెల్యేగా గెలిచిన తమను కాదని, నియోజకవర్గంలో జూనియర్లను ప్రోత్సహిస్తున్నారని తమ్మినేని కుటుంబం ధర్మాన సోదరులపై రగిలిపోతున్నట్లుగా చెబుతున్నారు. అయినప్పటికీ తమ్మినేని కుటుంబం అభ్యంతరాలు లెక్కచేయకుండా స్థానిక ఎన్నికల బాధ్యతను ధర్మానకు అప్పగించారని అంటున్నారు.
దీనికి తగినట్లు ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎత్తిచూపుతున్నారు. అధిష్టానం ఇచ్చిన స్వేచ్ఛతో జిల్లాలో ఎవరు, ఎక్కడ పోటీ చేయాలి అన్న నిర్ణయాలతోపాటు 2029 ఎన్నికలలో పార్టీ అభ్యర్థులుగా ఎవరు ఉండాలనేది ధర్మాన సోదరులే నిర్ణయించే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇక సీనియర్ నేత తమ్మినేని, పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తప్ప మిగిలిన నేతలతో సమన్వయం చేసుకుంటూ ధర్మాన సోదరులు దూసుకుపోతున్నారని చెబుతున్నారు. దీంతో ధర్మాన కుటుంబాన్ని విస్మరించిన నేతల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.
