యండమూరి...మేధావితనం మితిమీరి
తాజాగా విజయవాడ భవానిపురం పర్యాటక ప్రాంతంలో ఆవకాయ అమరావతి పేరుతో టూరిజం శాఖ మూడు రోజుల పాటు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.
By: Satya P | 12 Jan 2026 3:40 PM ISTయండమూరి వీరేంద్ర నాధ్ అంటే ఒక తరాన్ని తన రచనలతో ఊపేసిన ప్రఖ్యాత నవలా రచయిత. అప్పటిదాకా మహిళా రచయిత్రులు నవలలతో తెలుగు సాహిత్యం ఒక వైపు సాగుతూండగా మేలి మలుపు తిప్పిన యువ కెరటంగా ఆయన దూసుకుని వచ్చారు. అలా యండమూరి ఎంతగా ఫ్యామస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఆయన తులసీదళం నవల ఒక సంచలనం. అలాగే ఆయన అభిలాష నవలతో నాటి హీరో చిరంజీవి నటన మరో కోణాన్ని చూపించింది. ఇలా ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న యండమూరి అనంతర కాలంలో వచ్చిన మార్పుల మూలంగా కెరీర్ ఓరియెంటేషన్ కోసం వ్యక్తిత్వ వికాసం పేరుతో అనేక పుస్తకాలను రాసి ఆ విధంగా కొత్త జానర్ వైపు మళ్ళారు. ఇక ఆయన తన వర్తమాన జీవితాన్ని ఈ తరహా పుస్తకాల రచనకలే అంకితం చేస్తున్నారు. అంతే కాదు వక్తగా ఎవరైనా పిలిస్తే ఆ సభలకు వెళ్ళి యువతకు కెరీర్ గురించి విలువైన సలహాలు ఇస్తూ వస్తున్నారు అయితే ఇంతటి మహా మేధావి యండమూరి వెంట వివాదాలూ రావడం ఒక విశేషం, విచిత్రం కూడా.
ఈ ప్రార్ధన ఏమిటో :
తాజాగా విజయవాడ భవానిపురం పర్యాటక ప్రాంతంలో ఆవకాయ అమరావతి పేరుతో టూరిజం శాఖ మూడు రోజుల పాటు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో అనేక రకాలైన ఇతర ఈవెంట్స్ ఉన్నాయి. ప్రముఖ రచయిత వ్యక్తిత్వ వికాసం మీద ఎన్నో పుస్తకాలు రచించిన యండమూరిని పిలిచి ఆయన చేత ప్రసంగం చేయించారు నిర్వాహకులు. అయితే యండమూరి తన ప్రసంగం అంతా పూర్తి చేశారు. కానీ తన ఉపన్యాసానికి చప్పట్లు రాకపోవడంతో ఒకింత అసహనానికి గురి అయినట్లు ఉన్నారు. ఆ వెంటనే ఆయన సభాముఖంగానే చప్పట్లు కొట్టలేని కుటుంబాలు నాశనం అయిపొవాలని సరస్వతిదేవి శపిస్తుంది అని వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు.
అదేమి వైఖరి :
యండమూరి సీనియర్ మోస్ట్ సిటిజన్. పైగా ఆయన రచయిత, వ్యక్తిత్వ వికాసం మీద పుస్తకాలు రాస్తున్న వారు, ఆయనకు ఏది మంచి ఏది చెడు అని బాగా తెలుసు. ఇక చప్పట్లు సభలో కొట్టకపోతే అది అపరాధం చేసినట్లు కాదు, మౌనంగా ఎవరైనా ఉంటే అది అవమానించడం కాదు, అయినా ఎవరైనా చప్పట్లు కొట్టాలి అనుకుంటే కొడతారు, కానీ కొట్టలేదని వారి మీద కోపగించుకున్నా ఫలితం ఏమి ఉంటుంది. కానీ ఇంతటి మహా మేధావికి మాత్రం కోపం వచ్చింది. వెంటనే అమ్మవారు సరస్వతిని తాను ప్రార్థిస్తాను అని తన ప్రసంగానికి చప్పట్లు కొట్టని వారు నాశనం కావాలని కోరుతానని చెప్పడం పట్ల సభలో ఉన్న వారు అయితే షాక్ తిన్నారు.
ఒక మహిళ ప్రశ్నించినా :
అయితే ఆ సభలో ఒక మహిళ మాత్రం ధైర్యంగా యండమూరిని ఇదే విషయం మీద ప్రశ్నించింది. అయితే ఆమె ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పకుండా యండమూరి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అని అంటున్నారు. ప్రస్తుతం ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యండమూరి అంటే ఎంతో మందికి అభిమానం ఉంది. ఆయన నాణేనికి రెండవ వైపు చూస్తే గొప్ప విజ్ఞానిగా చూస్తారు, అలాంటి ఆయన ఈ విధంగా వ్యవహరించడం తగునా అన్నదే అంతా అంటున్న మాట. గతంలో కూడా సినీ రంగంలో ప్రముఖుల గురించి యండమూరి కొన్ని కామెంట్స్ చేసి వివాదాల పాలు అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మేధావితనం ఉండడం ఒక ఎత్తు అయితే దానితో పాటుగా సంభాళించుకునే నేర్పూ ఓర్పూ ఎవరికైనా ఉండాలని అంటున్నారు. మొత్తానికి ఆవకాయ్ అమరావతి ప్రోగ్రాం హైలెట్స్ సంగతి పక్కన పెడితే యండమూరి మాత్రం ఈ విధంగా మరోసారి వివాదంలోకి వచ్చారా అన్న చర్చ అయితే సాగుతోంది.
