యనమల పొలిట్ బ్యూరో టూ ఢిల్లీ రూటు
టీడీపీలో సీనియర్ లీడర్ గా యనమల రామక్రిష్ణుడు ఉన్నారు. ఆయన 1983 నుంచి గెలుస్తూ వచ్చారు.
By: Satya P | 19 April 2026 12:09 AM ISTటీడీపీలో సీనియర్ లీడర్ గా యనమల రామక్రిష్ణుడు ఉన్నారు. ఆయన 1983 నుంచి గెలుస్తూ వచ్చారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక టికెట్ అందుకుని ఎమ్మెల్యేగా తొలిసారి చట్టసభలలో అడుగుపెట్టిన యువ నేతలలో యనమల రామక్రిష్ణుడు ఒకరు. ఆయన ఏకంగా ఆరు సార్లు తుని నుంచి గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్సీగా పన్నెండేళ్ళ పాటు ఉన్నారు. సుదీర్ఘ కాలం మంత్రిగా ఆర్ధిక మంత్రిత్వ శాఖను చూశారు. ఇక యనమల కోరిక ఒకటి మాత్రం ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితంలో తీరలేదు అదే రాజ్యసభ సభ్యత్వం. ఆయన ఎంపీగా నెగ్గి పార్లమెంట్ లో తన గళం వినిపించాలని అనుకుంటున్నారు. ఆ కోరిక కూడా 2014 నాటిది. కానీ ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం అని చెబుతూ పార్టీ ఎమ్మెల్సీగానే చాన్స్ ఇస్తూ పోయింది.
అవన్నీ ఒట్టి మాటలే :
ఇదిలా ఉంటే టీడీపీలో యనమలకు పూర్వపు ప్రాధాన్యత లేదని ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి రిటైర్ కావాల్సిందే అన్న ప్రచారం సాగింది. కానీ అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. యనమలను టీడీపీ పొలిట్ బ్యూరోలో కొనాగించారు తాజాగా విడుదల చేసిన జాబితా చూస్తే కనుక అందులో అనేక మంది సీనియర్ నేతల పేర్లు లేకుండా పోయాయి. కానీ యనమలకు మాత్రం కీలక స్థానం అలాగే ఉంచేశారు. దాంతో టీడీపీలో యనమల సీనియారిటీకి తగిన గౌరవం దక్కుతోందని ఆయన వర్గం ఆనదంగా ఉంది.
రాజ్యసభకు సైతం :
ఇక యనమల విషయంలో టీడీపీ అధినాయకత్వం ఎంతో గౌరవ పూర్వకంగా వ్యవహరిస్తూ వస్తోంది. దాంతో యనమలకు పార్టీ పదవులతో పాటుగా రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కుతుందా అన్న చర్చ మొదలైంది. ఏపీ నుంచి జూన్ లో ఖాళీ అయ్యే నాలుగు సీట్లలో టీడీపీకి రెండు దక్కుతాయి. అందులో ఒకటి సానా సతీష్ కి ఇస్తారు అన్నది అంతా అనుకుంటున్నదే. అయితే ఆ రెండవ సీటు యనమలకే రిజర్వ్ చేశారా అన్న చర్చ సాగుతోంది.
ఆశలు అధికంగా :
అయితే ఇదే సీటు విషయంలో ఎంతో మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కానీ బీసీ సామాజిక వర్గంలో పెద్ద దిక్కుగా బాబుతో సమానంగా సీనియర్ గా ఆయన సమకాలీనుడిగా ఉన్న యనమలకు ఈ సీటు ఇస్తే పార్టీలో ఎవరూ పోటీ పడరని ఆలోచిస్తున్నారు. అంతే కాదు యనమల సేవలను జాతీయ స్థాయిలో కూడా వినియోగించుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. యనమల పొలిట్ బ్యూరోలో కొనసాగడం వెనక కూడా పార్టీ పెద్దల ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. రేపటి రోజున లోకేష్ పార్టీని లీడ్ చేసినా యనమల వంటి వారు తమ అనుభవంతో తగిన సూచనలు సలహాలు ఇచ్చే విధంగా ఉంటుందనే ఇలా చేశారు అని అంటున్నారు. అదే విధంగా రాజ్యసభలో కూడా సీనియర్ నేతల అవసరం ఉందని అది యనమలతో భర్తీ చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి యనమలకు పొలిట్ బ్యూరో నుంచి నేరుగా ఢిల్లీలో పార్లమెంట్ కి దారులు తెరిచారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.
