యనమల ముందుజాగ్రత్త.. తప్పిన పెను ప్రమాదం
గుండె రక్తనాళాల్లో (కరోనరీ ఆర్టరీస్) పూడికలు లేదా బ్లాక్లు ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలించడానికి చేసే వైద్య పరీక్షనే యాంజియోగ్రామ్ అంటారు.
By: Tupaki Political Desk | 22 Oct 2026 6:45 PM ISTమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో గురువారం ఉదయం కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రిలో ఆయన చేరారు. పరిస్థితిని గమనించిన వైద్యులు సత్వరమే వైద్యం అందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. అయితే 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని చెబుతుండటంతో యనమల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే తన ఆరోగ్య సమస్యను గుర్తించి సకాలంలో ఆసుపత్రికి రావడం వల్ల యనమలకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే యాంజియోగ్రామ్ నిర్వహించామని, అనంతరం పరిస్థితిని బట్టి యాంజియోప్లాస్టీ చేశామని యనమలకు వైద్యం చేసిన డాక్టర్ రామకృష్ణ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, గుండె సంబంధిత చికిత్స కావడంతో మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
గుండె రక్తనాళాల్లో (కరోనరీ ఆర్టరీస్) పూడికలు లేదా బ్లాక్లు ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలించడానికి చేసే వైద్య పరీక్షనే యాంజియోగ్రామ్ అంటారు. గుండె నొప్పులు, ఛాతిలో అసౌకర్యం లేదా గుండె సంబంధిత సమస్యల లక్షణాలు ఉన్నప్పుడు రక్తనాళాల పరిస్థితిని స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ పరీక్ష సహాయపడుతుంది. ఎక్స్-రే టెక్నాలజీ, ప్రత్యేక డై సాయంతో గుండె నరాల్లో రక్తప్రసరణ ఎలా ఉందో డాక్టర్లు ఈ పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఇక యాంజియోగ్రామ్ పరీక్షలో రక్తనాళాల్లో అడ్డంకులు లేదా పూడికలు ఉన్నట్లు తేలితే, వాటిని తొలగించి రక్తప్రసరణను పునరుద్ధరించడానికి యాంజియోప్లాస్టీ చేస్తారు. గుండెపోటు రాకుండా నివారించడానికి లేదా రక్తనాళాల్లోని పూడికలను సరిచేసి గుండెకు సక్రమంగా రక్తం అందేలా చేయడానికి ఈ చికిత్స అత్యంత కీలకం.
ఎటువంటి గుండె సమస్యలైనా సకాలంలో గుర్తించి ఆసుపత్రికి వెళ్లడం ప్రాణాలను కాపాడుకోవడంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. యనమల రామకృష్ణుడు విషయంలోనూ అదే జరిగిందని చెబుతున్నారు. ముందస్తుగా లక్షణాలను గుర్తించి వెంటనే ఆసుపత్రిని ఆశ్రయించడం వల్ల వైద్యులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అవసరమైన పరీక్షలు నిర్వహించి, సకాలంలో యాంజియోప్లాస్టీ చేయగలిగారు. దీనివల్ల పెద్ద ప్రమాదం తప్పిందని, ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు ధైర్యం చెప్పారు.
వయసురీత్యా సీనియర్ సిటిజన్లు గుండె సంబంధిత సమస్యలు రాకుండా కొన్ని కీలకమైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా బీపీ, షుగర్, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్ వంటి సాధారణ పరీక్షలు చేయించుకోవడం, నూనె పదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం మంచిదని అంటున్నారు. అలాగే, వైద్యుల సలహా మేరకు తేలికపాటి నడక లేదా యోగా చేయడం, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని చెబుతున్నారు. ఛాతిలో నొప్పి, ఆయాసం, గుండె దడ వంటి చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి తప్ప ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
