పెద్దల సభ వైపు సీనియర్ మోస్ట్ లీడర్ చూపు !
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో దాని మద్దతుతో నడిచే ఎన్డీయే ప్రభుత్వం ఉంది.
By: Satya P | 18 Sept 2025 11:00 AM ISTఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో దాని మద్దతుతో నడిచే ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఇక అక్కడా ఇక్కడా పదవులు చాలానే ఉన్నాయి. దాంతో పాటు 2026 లోకి మరి కొద్ది నెలలలో అడుగు పెడుతున్న వేళ పదవుల పంట పండే కాలం వచ్చేస్తోంది అని అంటున్నారు. ఇక పదవుల కోసం ఎదురు చూసే వారికి కోరికలు తీరే విధంగానే అంతా ఉండబోతోంది. ఇక ఎవరికి ఏ సమయంలో ఎలాంటి పదవులు ఇవ్వాలన్న విషయంలో టీడీపీ అధినేత కూటమి పెద్ద చంద్రబాబుని మించిన వారు ఉండరు. దాంతో కూటమి పార్టీలకు పదవుల పండుగగా రానున్న రోజులు మారబోతున్నాయని ప్రచారం సాగుతోంది.
ఆర్థిక దిగ్గజం ఆలోచనలు :
తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక సార్లు ఆర్ధిక మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ పదవి నుంచి రిటైర్ అయ్యారు. నాటి నుంచి ఆయన ఖాళీగానే ఉన్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నారు. ఇక అల్లుడు ఎంపీగా ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వియ్యంకుడు మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో యనమల కుటుంబానికి అయితే పదవులకు కొరత లేదు కానీ యనమల మాత్రం తన జీవిత కాలం కోరిక తీర్చుకోవాలని అనుకుంటున్నారుట.
అదే సరైన గౌరవం :
ఏడున్నర పదుల వయసులో ఉన్న యనమల రామక్రిష్ణుడుకు రాజ్యసభకు వెళ్ళాలన్నది ఈనాటి కోరిక కాదు 2014 నుంచి అలాగే ఉంది. అప్పటి నుంచి ప్రతీ రెండేళ్ళకు రాజ్యసభ ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. గతంలో అయిదేళ్ళ పాటు టీడీపీ అధికారంలో ఉంది. అయినా యనమలకు రాజ్యసభ సీటు దక్కలేదు. ఆర్ధిక మంత్రిగా ఆయన సేవలు ఉపయోగించుకున్నారు ఇక 2019 నుంచి 2024 మధ్యలో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో పెద్దల సభకు నెగేందుకు తగిన సంఖ్యాబలం లేదు. ఇపుడు చూస్తే అసెంబ్లీ నిండా పరచుకున్న టీడీపీ కూటమికే అన్ని రాజ్యసభ సీట్లు అన్నది ఉంది. దాంతో 2026 లో ఖాళీ అయ్యే అయిదు రాజ్యసభ ఎంపీల సీట్లలో తనకు ఒకటి ఖాయం చేయమని ఆయన అధినాయకత్వానికి వినతులు చేసుకుంటున్నారు అని అంటున్నారు.
రాజ్ భవన్ కంటే కూడా :
గవర్నర్ గా యనమల వెళ్తారని ఆ మధ్య అంతా ప్రచారం సాగింది. అయితే యనమల మాత్రం రాజ్యసభ వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది 2029లో ఇదే పొత్తు కొనసాగుతుంది. ఆ ఎన్నికల్లోనూ ఎన్డీయే గెలిచే చాన్స్ అయితే ఈ రోజుకి ఉంది. దాంతో పాటు కీలకంగా టీడీపీ ఉంది. ఇక అన్నీ అనుకూలిస్తీ రాజ్యసభ నుంచి ఎంపీగా ఉంటూ కేంద్ర మంత్రి కూడా కావచ్చు అన్న ఆలోచనలు కూడా ఆయనకు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి యనమల మనసు మారిందా లేక రాజకీయంగా సరైన వ్యూహంతో ఉన్నారా అన్నది తెలియదు కానీ కేంద్రం నుంచి మరో గవర్నర్ పోస్టు దక్కనున్న వేళ ఆయన తన ఓటు పెద్దల సభకే వేస్తున్నారు అని అంటున్నారు. ఇక చంద్రబాబు కూడా ఆయనను రాజ్యసభకు పంపడానికి రెడీ అని చెబుతున్నారు. సో యనమల ఇక పెద్దల సభకే అని అంతా అంటున్నారు.
