Begin typing your search above and press return to search.

తునిలో యనమల వర్సెస్ యనమల! కూటమిలో కుంపటి రాజుకుంటోందా?

నియోజకవర్గంలో యనమల కృష్ణుడు పనితీరుపై అవగాహన ఉన్న వారు ఆయన జనసేనలో చేరిన తర్వాత కూటమి రాజకీయాల్లో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

By:  Tupaki Political Desk   |   28 Sept 2026 4:07 PM IST
తునిలో యనమల వర్సెస్ యనమల! కూటమిలో కుంపటి రాజుకుంటోందా?
X

కాకినాడ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో జనసేన పార్టీలో భారీగా చేరికలు మొదలయ్యాయి. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, తుని నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు ఇటీవల జనసేనలో చేరారు. అయితే ఈ ఇద్దరు నేతల సొంత కుటుంబ సభ్యులే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండగా, గతంలో వీరి మధ్య రాజకీయ విభేదాలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో తనను కాదని, తన అన్న కుమార్తె యనమల దివ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు ఇప్పుడు మళ్లీ జనసేనలో చేరడంతో రెండు పార్టీలు, ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారుతోందని చెబుతున్నారు.

తుని ఎమ్మెల్యేగా యనమల దివ్య ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చిన దివ్య తొలి ప్రయత్నంలోనే గెలిచి రికార్డు సృష్టించారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో కూటమి రాజకీయాలను ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే దివ్య బాబాయ్ యనమల కృష్ణుడు జనసేనలో చేరడంతో కూటమిలో పోటీ నేత తయారైనట్లు అయిందని అంటున్నారు. ఇక కూటమిలో టీడీపీ, జనసేన మధ్య పోటాపోటీ రాజకీయం చోటుచేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

నియోజకవర్గంలో యనమల కృష్ణుడు పనితీరుపై అవగాహన ఉన్న వారు ఆయన జనసేనలో చేరిన తర్వాత కూటమి రాజకీయాల్లో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కృష్ణుడు ఒక్కసారి కూడా గెలవలేకపోయారని చెబుతున్నారు. కానీ, గత ఎన్నికల ముందు గెలిచే అవకాశాలు ఉన్న సమయంలో తనను తప్పించి అన్యాయం చేశారని, సోదరుడు యనమల రామకృష్ణుడిపై ఆయన రగిలిపోతున్నారని అంటున్నారు. ఈ కారణంగానే ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారని చెబుతున్నారు. సీనియర్ యనమలతోను ఎమ్మెల్యే దివ్యతోనూ సత్సంబంధాలు కోరుకుంటే ఆయన తిరిగి టీడీపీలోనే చేరేవారని అంటున్నారు.

వైసీపీలో చేరినప్పటి నుంచి సరైన గుర్తింపు లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురైన యనమల కృష్ణుడు ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా? అన్న ఆలోచనతోనే ఉండేవారని అంటున్నారు. అయితే సొంత కుటుంబంలో ఆయన తిరిగి రావడానికి తగిన వాతావరణం కల్పించకపోవడం వల్లే జనసేన వైపు చూశారని చెబుతున్నారు. దీంతో తన వర్గాన్ని కాపాడుకోడానికి ఆయన స్థానిక ఎన్నికల్లో ప్రయత్నించవచ్చునని, అదే జరిగితే కూటమి ఐక్యతపై ప్రభావం పడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక యనమల కృష్ణుడు జనసేనలో చేరిన విషయమై ఇంతవరకు టీడీపీ నుంచి ఎటువంటి స్పందన బయటకు రాలేదు. దీంతో యనమల కుటుంబ రాజకీయాలు మరింత ఆసక్తి రేపుతున్నట్లు చెబుతున్నారు.