Begin typing your search above and press return to search.

తండ్రి చాటు త‌న‌య‌: ఇలా అయితే పాలిటిక్స్ ఎందుకు..?

ఇలాంటి వారిలో కొంతమంది విజయం కూడా దక్కించుకున్నారు. అయితే, వారసుల పరిస్థితి విభిన్నంగా కనిపిస్తోంది.

By:  Garuda Media   |   21 Aug 2025 9:34 AM IST
Yanamala Divya Political Journey  Challenges
X

రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మంది కొత్త నేత‌లు విజయం దక్కించుకున్నారు. పార్టీ అధినేతలు కూడా కొత్త తరానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రధాన ఉద్దేశంతో యువతను భారీగా ప్రోత్సహించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొత్తవారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు కూడా. ప్రస్తుతం దాదాపు 60 నుంచి 70 మంది కొత్తతరం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు. వీరిలో కొందరు యువకులు ఉన్నారు. మరీ ముఖ్యంగా వారసులకు సైతం గత ఎన్నికల్లో టిడిపి టికెట్లు ఇచ్చింది.

ఇలాంటి వారిలో కొంతమంది విజయం కూడా దక్కించుకున్నారు. అయితే, వారసుల పరిస్థితి విభిన్నంగా కనిపిస్తోంది. కొందరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతుంటే.. మరికొందరు తమ తమ కుటుంబ సభ్యుల వెనుక ఉండి రాజకీయాలు చేస్తున్నారు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఉదాహర ణకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య గత ఏడాది విజయం దక్కించుకున్నారు.

ఇంతకుముందు కూడా ఆమె పోటీ చేసినప్పటికీ పరాజయం పాలవడంతో గత ఏడాది సీరియస్గా తీసుకు ని ప్రయత్నం చేశారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుపు గుర్రం ఎక్కారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా యనమల దివ్య తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకోలేకపోతున్నారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తన తండ్రి చాటునే ఉంటూ ఆయన చెప్పినట్టే వింటూ రాజకీయాలు సాగిస్తున్నారని సొంత పార్టీలోనే రాజకీయ చర్చ నడుస్తోంది. సాధారణంగా సీనియర్ నాయకులు అనగానే పార్టీలో వ్యతిరేకించే వర్గం ఉంటుంది. సమర్థించే వర్గం కూడా ఉంటుంది.

కానీ, కొత్త తరం నాయకుల విషయానికి వస్తే అటు వ్యతిరేకించేవారు ఇటు సమర్థించే వారు కూడా వారిపై చాలానే ఆశలు పెట్టుకుంటారు. అందరినీ కలుపుకొని పోతారని అందరితోనూ సమన్వయం చేసుకుంటా రని అనుకుంటారు. ఈ తరహా పరిస్థితి తునిలో కనిపించడం లేదు. రామకృష్ణుడి వర్గంగా ఉన్నవారితో మాత్రమే యనమల దివ్య టచ్ లో ఉంటే.. రామకృష్ణుని వ్యతిరేకించే వర్గం తో ఆమె తీవ్రంగా విభేదిస్తు న్నారు. ఇక నియోజకవర్గంలో పర్యటనలకు కూడా ఆమె క‌డు దూరంలో ఉంటున్నారు.

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అయినా.. తల్లికి వందనం పథకం అమలు కార్యక్రమం అయినా దివ్య స్థానంలో రామకృష్ణుడు పాల్గొని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం టిడిపిలో చర్చనీయాంశం గా మారింది. భవిష్యత్తులో పుంజుకోవాలంటే దివ్య రాజకీయ తీరు మారాలి అన్నది సీనియర్లు చెబుతున్న మాట. అయితే తన తండ్రి ఉన్నంతవరకు తను అంత చొరవ తీసుకోలేనని ఆమె అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లో చెబుతున్నారు. మరి ఇలా అయితే ఇక తండ్రి చాటు బిడ్డగానే ఆమె మిగిలిపోతారు. మరి భవిష్యత్తులో ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది.