Begin typing your search above and press return to search.

లాలూ ములాయం నాటి రాజకీయం ముగిసినట్లేనా ?

ఇక కేంద్రంలో జనతాదళ్ అధికారం మూడు నాళ్ళ ముచ్చట అయింది. దాంతో పాటుగా జనతాదళ్ కూడా చీలిపోయింది. 1993లోనే జనతాదళ్ నుంచి వేరుపడి సమాజ్ వాది పార్టీని ములాయం సింగ్ స్థాపించారు.

By:  Satya P   |   14 Nov 2025 10:25 PM IST
లాలూ ములాయం నాటి రాజకీయం ముగిసినట్లేనా ?
X

దేశ రాజకీయాల్లో చూస్తే 1977కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అప్పటిదాకా అప్రతిహతంగా అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ ని గద్దె దించి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలసి జనతా పార్టీగా ఏర్పడి దిగ్గజ కాంగ్రెస్ ని ఓడించాయి. తిరిగి పన్నెండేళ్ళ తరువాత అదే ఫార్ములా సూపర్ హిట్ అయింది. నేషనల్ ఫ్రంట్ పేరుతో ఏర్పడిన కాంగ్రెసేతర పార్టీలు అన్నీ కలసి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ఓడించాయి. అలా 1989లో కేంద్రంలో వీపీ సింగ్ ప్రధానిగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అదే సమయంలో జనతాదళ్ నుంచి బీహార్ సీఎం గా లాలూ ప్రసాద్ యాదవ్ అనే యువ నేత సీఎం అయ్యారు. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ సీఎం అయ్యారు.

యాదవ ద్వయంతో :

ఒకే సమయంలో రెండు కీలక రాష్ట్రాలకు అందునా హిందీ బెల్ట్ లో అతి పెద్ద రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు గా ఇద్దరు యాదవులు రావడం ఆ రోజులలో అతి పెద్ద సామాజిక న్యాయంగా అంతా చూశారు. ఎందుకంటే అప్పటిదాకా కాంగ్రెస్ రాజ్యం ఏలిన స్టేట్స్ ఇవి. అగ్ర వర్ణాలే సీఎం గా ఎక్కువ శాతం ఉండేవారు. అయితే బ్రాహ్మిన్స్ లేకపోతే ఠాకూర్స్ సీఎంలు గా పాలించేవారు. అలాంటిది దేశంలో వచ్చిన ఒక మౌలికమైన సామాజిక మార్పుగా అంతా దీనిని చూశారు ఆహ్వానించారు. ఈ దెబ్బకు ఈ రెండు చోట్ల కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కుదేల్ అయింది. బీజేపీ హిందూత్వతో కొత్త రాజకీయం అపుడే స్టార్ట్ అయింది.

కొత్త పార్టీలుగా :

ఇక కేంద్రంలో జనతాదళ్ అధికారం మూడు నాళ్ళ ముచ్చట అయింది. దాంతో పాటుగా జనతాదళ్ కూడా చీలిపోయింది. 1993లోనే జనతాదళ్ నుంచి వేరుపడి సమాజ్ వాది పార్టీని ములాయం సింగ్ స్థాపించారు. ఇక లాలూ 1997లో ఆర్జేడీని ఏర్పాటు చేశారు. ఈ రెండు పార్టీల తరఫున లాలూ ములాయం బలంగా ఉంటూ జాతీయ రాజకీయాలను సైతం శాసించారు. ఒక దశలో ప్రధాని రేసులో కూడా వేరి పేర్లు వినిపించాయి. సంకీర్ణ రాజకీయాల నేపధ్యంలో వీరి పాత్ర కూడా చాలా కీలకంగా మారింది. యాదవ సోదరులు ఇద్దరూ బీజేపీ వ్యతిరేక రాజకీయాన్ని నడుపుతూ వచ్చారు. యాదవ ప్లస్ ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ ని పటిష్టం చేసుకుని తమ రాష్ట్రాలలో బలంగా పార్టీలను తయారు చేశారు. ఇక ములాయం లాలూ అనేక సార్లు సీఎంలుగా అయ్యారు అలా వారిద్దరు చెరి ఏడున్నరేళ్ల పాటు పాలించారు. లాలూ సతీమణి రబ్రీదేవి కూడా మూడు సార్లు బీహార్ సీఎం గా అయి మొత్తంగా ఏడున్నరేళ్ళ పాటు పాలించారు. ఇక యూపీలో ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ 2012లో సీఎం అయి అయిదేళ్ళ పాటు పాలించారు.

పుష్కర కాలంగా :

ఇక గడచిన పుష్కర కాలంగా చూస్తే యాదవ సోదరులు ఇద్దరికీ రాజకీయం సొంత రాష్ట్రాలలో ఏ మాత్రం కలిసిరావడంలేదు. ములాయం అయితే కొన్నేళ్ళ క్రితం దివంగతులు అయ్యారు లాలూ అనారోగ్య సమస్యలతో పాటు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు అఖిలేష్ యాదవ్ కి యూపీలో 2017 తర్వాత సీఎం కుర్చీ అందకుండా పోతోంది. అక్కడ వరసగా బీజేపీ రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. బలమైన ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాధ్ ఉన్నారు. దాంతో ఎస్పీకి రాజకీయంగా పెను సవాల్ గా మారింది. 2027లో యూపీలో అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈసారి కనుక గెలవకపోతే ఎస్పీకి మరింత ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.

బీహార్ లో అంతేనా :

ఇక బీహార్ లో చూస్తే ఆర్జేడీ పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉంది. వరసగా పరాజయాలు దక్కుతున్నాయి. 2015లో నితీష్ కుమార్ తో కలసి అధికారం అందుకున్నా నితీష్ బీజేపీ వైపు వెళ్ళడంతో ఆర్జేడీకి అధికారంలోకి వచ్చేందుకు బలం సరిపోవడం లేదు. దాంతో లాలూ వారసుడు తేజస్వి యాదవ్ కి సీఎం పదవీ యోగం ఉందా లేదా అన్న చర్చ అయితే ఉంది. మొత్తం మీద తొంబై దశకంలో దేశ రాజకీయాలను శాసించిన ఆర్జేడీ ఎస్పీ రెండూ ఇపుడూ రాజకీయంగా గట్టి సవాల్ నే ఎదుర్కొంటున్నాయని చెప్పక తప్పదు.