Begin typing your search above and press return to search.

98 శాతం వేడిని వెన‌క్కి పంపే కూల్ పెయింట్.. ఇక AC ల‌తో ప‌ని లేదు!

ఈ స్థాయిలో సామర్థ్యాన్ని సాధించడం వెనుక శాస్త్రవేత్తల ఆరేళ్ల కఠిన శ్రమ దాగి ఉంది. రంగుల తయారీ కోసం వారు `బేరియం సల్ఫేట్` అనే రసాయన సమ్మేళనాన్ని ఎంచుకున్నారు.

By:  Sivaji Kontham   |   9 Aug 2026 1:05 PM IST
98 శాతం వేడిని వెన‌క్కి పంపే కూల్ పెయింట్.. ఇక AC ల‌తో ప‌ని లేదు!
X

పెరుగుతున్న భూగోళ ఉష్ణోగ్రతలు - తీవ్రమైన వేసవి తాపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ కండిషనర్ల (AC) వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే,ఇవి వినియోగించే భారీ విద్యుత్ భారం ఒక్కసారిగా గ్రిడ్‌లపై ఒత్తిడి పెంచడమే కాకుండా.. గ్రీన్‌హౌస్ వాయువు(వేడి గాలి)లను విడుదల చేస్తూ పర్యావరణానికి మరింత హాని కలిగిస్తున్నాయి. ఈ సమస్యకు ప్రకృతిసిద్ధమైన- విద్యుత్ రహిత పరిష్కారాన్ని కనుగొనే క్రమంలో అమెరికాలోని ప్యూరిడ్యూ యూనివర్సిటీ ఇంజనీర్లు ప్రపంచంలోనే అత్యంత తెల్లటి పెయింట్‌ను ఆవిష్కరించి సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఈ పెయింట్ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే.. ఇది తనపై పడే సూర్యకాంతిలోని ఏకంగా 98.1 శాతం కాంతిని, వేడిని పరావర్తనం చేసి వెనక్కి మళ్లిస్తుంది. సాధారణంగా మార్కెట్‌లో లభించే `కూల్ రూఫ్` పెయింట్లు 80 శాతం నుండి 90 శాతం వరకు మాత్రమే సూర్యరశ్మిని పరావర్తనం చేయగలవు. దీనివల్ల ఆ ఉపరితలాలు కొంతవరకు వేడెక్కుతాయి. కానీ ప్యూరిడ్యూ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ నూతన సాంకేతికత భవనం సూర్యరశ్మిని పీల్చుకోకుండా నిరోధిస్తూ `ప్యాసివ్ రేడియేటివ్ కూలింగ్` ద్వారా భవనాలు వేడెక్కకుండా అద్భుతంగా కాపాడుతుంది.

ఈ స్థాయిలో సామర్థ్యాన్ని సాధించడం వెనుక శాస్త్రవేత్తల ఆరేళ్ల కఠిన శ్రమ దాగి ఉంది. రంగుల తయారీ కోసం వారు `బేరియం సల్ఫేట్` అనే రసాయన సమ్మేళనాన్ని ఎంచుకున్నారు. అంతేకాకుండా కాంతిలోని వివిధ రకాల తరంగదైర్ఘ్యాలను సమర్థవంతంగా చెదరగొట్టడానికి వేర్వేరు పరిమాణాల్లో ఉన్న రేణువులను ఇందులో కలిపారు. ఈ మిశ్రమం సూర్యకాంతిని పీల్చుకోకుండా తిరిగి వాతావరణంలోకి పంపివేస్తూ.. పెయింట్ ఊడిపోకుండా ఉండేలా తగిన ప్రాధాన్యతనిచ్చి తయారుచేశారు.

క్షేత్రస్థాయి పరీక్షల్లో ఈ పెయింట్ చూపిన ఫలితాలు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి. విపరీతమైన ఎండ ఉన్న పగటిపూట కూడా ఈ పెయింట్ వేసిన ఉపరితలాలు పరిసర గాలి ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యాయి. అలాగే నైట్స్ లో 10డిగ్రీల‌కు వేడి త‌గ్గి చ‌ల్ల‌గా మారిపోతుంది. సుమారు 1000 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఇంటి పైకప్పుకు ఈ పెయింట్ వేస్తే.. అది దాదాపు 10 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సెంట్రల్ ఏసీ అందించే కూలింగ్‌కు సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

పూర్తిగా పర్యావరణ హితమైన ఈ ఆవిష్కరణ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా.. కమర్షియల్‌గా ఉత్పత్తి చేయడానికి వీలుగా డిజైన్ చేసారు. ప్ర‌స్తుతం కూల్ పెయింట్లు ఎలా త‌యారు చేస్తారో అలానే త‌యారు చేసి పంపిణీ చేసేందుకు పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని తెలుస్తోంది. ఇది వేసవిలో ఏసీల వినియోగాన్ని భారీగా తగ్గించి.. విద్యుత్ బిల్లుల భారంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఈ `వరల్డ్స్ వైటెస్ట్ పెయింట్` ప్రపంచానికి ఒక గొప్ప ఊరటగా నిలవనుందనడంలో సందేహం లేదు.