Begin typing your search above and press return to search.

8,320 కోట్లతో అతిపెద్ద మ్యూజియం.. ఎక్కడ? ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.ఆ అద్భుతాలలోకి మరో అద్భుతం కూడా చేరింది.

By:  Madhu Reddy   |   2 Nov 2025 10:00 PM IST
8,320 కోట్లతో అతిపెద్ద మ్యూజియం.. ఎక్కడ? ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
X

ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.ఆ అద్భుతాలలోకి మరో అద్భుతం కూడా చేరింది. అదే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం.. తాజాగా నవంబర్ 1 శనివారం రోజు గ్రాండ్ ఈజిప్షయన్ మ్యూజియంని ప్రారంభించారు.. దీని నిర్మాణానికి దాదాపు రెండు దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు పట్టింది.అలా 20సంవత్సరాలు కష్టపడి సందర్శకులను ఆకర్షించేలా ఈ మ్యూజియాన్ని నిర్మించారు. ఈజిప్టు రాజధాని అయినటువంటి కైరో సమీపంలో ఉండే గిజా పిరమిడ్ దగ్గర ఈ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం.. ఈ మ్యూజియం పురాతన ఈజిప్షియన్స్ జీవితాన్ని వివరించే 50 వేల కంటే ఎక్కువ కళాఖండాలను కలిగి ఉంది.

ఈజిప్షియన్ ప్రెసిడెన్సీ ప్రకారం.. చక్రవర్తులు, దేశాధినేతలు, ప్రభుత్వాలు, అధిపతులతో సహా ప్రపంచ నాయకులు ఈ గొప్ప ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ మ్యూజియం మానవ సంస్కృతి , నాగరికత చరిత్రలో అసాధారమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. 2014లో అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా ఎల్సీసీ అధికారం చేపట్టినప్పటి నుండి ఈ మ్యూజియం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా తీసుకున్నారు.ఈ మ్యూజియం సమీపంలోని గిజా పిరమిడ్ల చుట్టూ ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం మరింత అభివృద్ధి పరిచింది. తారు రోడ్లు వేయడంతో పాటు మ్యూజియానికి మరింత ప్రతిష్ట పెరిగేలా చుట్టుపక్కల అభివృద్ధి చేశారు.అలాగే మ్యూజియం గేట్ల లోపల మెట్రో స్టేషన్ ని కూడా నిర్మిస్తున్నారు. దూరంలో ఒక విమానాశ్రయం కూడా ఉందట. 2005లో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ఈ నిర్మాణం ప్రారంభమైంది.ఈ మ్యూజియం దాదాపు 24 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. అలాగే ఈ మ్యూజియంలో 12 ప్రధాన గ్యాలరీలు కూడా ఉన్నాయి.

అంతేకాదు ఈ మ్యూజియంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా తుతున్ కమన్ రాజుకు సంబంధించిన 5 వేల రకాల కళాఖండాలు ఏకంగా రెండు హాళ్లలో ఉన్నాయి. ఇందులో ఆయనకి సంబంధించిన బంగారు ఆభరణాలు, బంగారు సింహాసనం , రత్నాభరణాలు, సమాధి వస్తువులు వంటివి ఉన్నాయట. ఈ మ్యూజియంలో వివిధ కాలాల్లో ఎంతోమంది రాజులు వాడిన ఆభరణాలు, రాతి శాసనాలు, సమాధులు వంటివి మొత్తం కలిపి 50 వేల కళాఖండాల వరకు ఉన్నాయట. ఈ గ్రాండ్ మ్యూజియం నిర్మాణానికి దాదాపు 8,320 కోట్ల రూపాయల ఖర్చు అయినట్టు తెలుస్తోంది.

మ్యూజియంలో ఉండే 12 గ్యాలరీలలో ప్రతి గ్యాలరీకి డిజిటల్ ఇంటరాక్టివ్ డిస్ప్లే లు, మోడ్రన్ 3D ప్రదర్శన సాంకేతికత, లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయట. ఈ మ్యూజియం ద్వారా 2032 నాటికి ప్రతి ఏటా 30 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించాలనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలుస్తోంది. ఈ మ్యూజియం మంగళవారం అనగా నవంబర్ 4 నుండి ప్రజలు సందర్శించడానికి అందుబాటులోకి రాబోతుందని అధికారులు తెలిపారు.